అవసరంలో అక్కరకురాని రష్యా ముందుచూపు

ABN , First Publish Date - 2022-03-03T22:30:18+05:30 IST

ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశీ మారక

అవసరంలో అక్కరకురాని రష్యా ముందుచూపు

మాస్కో : ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశీ మారక ద్రవ్యాన్ని, బంగారాన్ని పెద్ద ఎత్తున రష్యా పోగు చేసుకుంది. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ నిల్వలను విపరీతంగా పెంచుకుంది. అయినప్పటికీ  ఆ ముందుచూపు వల్ల ప్రస్తుతం ప్రయోజనాన్ని చాలా వరకు పొందలేకపోతోంది. దీనికి కారణం ఆ నిల్వలన్నిటినీ విదేశీ బ్యాంకుల్లో దాచడమే. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు అమలవుతున్న సంగతి తెలిసిందే.


ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు రష్యాకు ఉపయోగపడి ఉండేవి. రష్యన్ కరెన్సీ రూబుల్ విలువ పతనం కాకుండా కాపాడటానికి ఆ దేశ సెంట్రల్ బ్యాంకుకు అవకాశం లభించి ఉండేది. క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యన్ కరెన్సీ రూబుల్ విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు సగానికి పతనమైంది. దీంతో రష్యన్ సెంట్రల్ బ్యాంకు రూబుల్‌ను స్థిరపరచడానికి 130 బిలియన్ డాలర్లు ఖర్చు చేయవలసి వచ్చింది. ఏడేళ్ళ క్రితం 368 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం ఉండేవి, ఇప్పుడవి 630 బిలియన్ డాలర్లకు చేరాయి. వీటిలో సగానికిపైగా విదేశీ బ్యాంకుల్లోనే ఉన్నాయి. దీంతో  ప్రయోజనం దక్కడం లేదు. 


అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్ సోమవారం రష్యా సెంట్రల్ బ్యాంకుపై ఆంక్షలు విధించాయి. తమ బ్యాంకుల్లో జమ చేసిన రష్యా ప్రభుత్వ సొమ్మును ఉపసంహరించకుండా నిషేధం విధించాయి. ఈ దేశాల నేతలు ఫిబ్రవరి 26న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడి చేయడంతో రష్యాపై ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రష్యాను ఏకాకిని చేయడానికి, అంతర్జాతీయ ఫైనాన్షియల్ సిస్టమ్, తమ ఆర్థిక వ్యవస్థల నుంచి రష్యాను బహిష్కరించడానికి ఈ ఆంక్షలు ఉపయోగపడతాయని చెప్పారు. 


అయితే చైనీస్ యువాన్‌ రూపంలో రష్యా జమ చేసిన 13 శాతం రిజర్వులను ఉపయోగించుకోవడానికి రష్యాకు అవకాశం ఉంది. రష్యాపై ఆంక్షలు విధించే దేశాలతో తాము భాగస్వాములం కాబోమని చైనా బ్యాంకింగ్ రెగ్యులేటర్ బుధవారం తెలిపింది. ఇటువంటి ఆంక్షల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని, వీటికి చట్టపరమైన ఆధారాలు కూడా లేవని తెలిపింది. 


ప్రభుత్వాలు విదేశీ రుణాలు, విదేశీ కరెన్సీ, బంగారం రూపంలో ఫారిన్ రిజర్వులను నిర్వహిస్తాయి. డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్‌లు, యువాన్‌ల రూపంలో ఈ నిల్వలను విదేశీ బ్యాంకుల్లో ఉంచుతాయి. ప్రపంచంలో ఆర్థిక ఒడుదొడుకులను తట్టుకోవడానికి ఈ ఫారిన్ రిజర్వులు ఉపయోగపడతాయి. 


Updated Date - 2022-03-03T22:30:18+05:30 IST