కన్నడిగుల ఉలికిపాటు

ABN , First Publish Date - 2022-03-02T18:05:24+05:30 IST

ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటూ కోటి ఆశలతో ఉక్రెయిన్‌లో వైద్య కోర్సు చేసేందుకు వెళ్లిన కన్నడిగుడు నవీన్‌ విగతజీవిగా మారడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఉక్రెయిన్‌పై రష్యా దళాలు మంగళవారం

కన్నడిగుల ఉలికిపాటు

- ఉక్రెయిన్‌లో కన్నడిగుడి మృతి

- రష్యా దాడులకు బలైన తొలి భారతీయుడు

- వైద్య విద్యార్థి నవీన్‌ మృతితో రాష్ట్రంలో విషాదం

- తల్లిదండ్రులను ఓదార్చిన సీఎం

- శోకసంద్రంలో చెళగెరె గ్రామం 

- మిగిలినవారినైనా సురక్షితంగా తీసుకురండి: ప్రతిపక్షాలు


బెంగళూరు: ఉజ్వల భవిష్యత్తును వెతుక్కుంటూ కోటి ఆశలతో ఉక్రెయిన్‌లో వైద్య కోర్సు చేసేందుకు వెళ్లిన కన్నడిగుడు నవీన్‌ విగతజీవిగా మారడంతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఉక్రెయిన్‌పై రష్యా దళాలు మంగళవారం తెల్లవారుజామున జరిపిన మిస్సైల్‌ దాడిలో హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా చళగేరి గ్రామానికి చెందిన శేఖరప్ప గ్యానగౌడర్‌ నవీన్‌ (21) అనే విద్యార్థి మృతి చెందాడు. ఖార్కివ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ నాల్గవ సంవత్సరం చదువుతున్న నవీన్‌ మంగళవారం ఉదయం బయటకు రాగా మిస్సైల్‌ దూ సుకురావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రష్యా - ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యు ద్ధంలో బలైన తొలి భారతీయుడు కన్నడిగుడు కావడంతో రాష్ట్రంలో విషాదచాయలు అ లుముకున్నాయి. కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ నవీన్‌ మృతిని ధ్రువీకరిస్తూ సమాచారం ఇచ్చింది. రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ చిక్కుకున్న వందలాది మంది కన్నడిగులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనే అనుకోకుండా జరిగిన ఈ దారుణ ఘటనను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ యుద్ధంలో బలైన తొలి భారతీయుడు నవీన్‌ కావడం అత్యంత విషాదభరితమని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మంగళవారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ఇలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. నవీన్‌ ఆత్మకు శాంతి లభించాలని ప్రార్థించారు. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ కూడా ఉక్రెయిన్‌ యుద్ధంలో కన్నడిగుడు బలి కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై స్వయంగా నవీన్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఓదార్చారు. ఒకదశలో ఆయన కూడా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మాజీ ముఖ్యమంత్రులు డీవీ సదానందగౌడ, జగదీశ్‌ శెట్టర్‌, బీఎస్‌ యడియూరప్ప, హెచ్‌డీ కుమారస్వామి, ప్రతిపక్షనేత సిద్దరామయ్య ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. నవీన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. 


స్వగ్రామంలో విషాద చాయలు 

హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా చెళగెరె గ్రామంలో నవీన్‌ మృతి నేపథ్యంలో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. వైద్యవృత్తి చేపట్టి తమకు సేవలందిస్తాడని ఎంతగానో ఆకాంక్షించామని, ఇలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని నవీన్‌ తల్లిదండ్రులు బోరున విలపించారు. వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. విషయం తెలుస్తూనే గ్రామస్తులు పెద్దసంఖ్యలో నవీన్‌ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నవీన్‌ పార్థివదేహం బుధవారం రాత్రికిగానీ గురువారం ఉదయానికిగానీ రావచ్చునని అంచనా వేస్తున్నారు. కడపటి వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. 

Updated Date - 2022-03-02T18:05:24+05:30 IST