అమెరికాకు రష్యా షాక్

ABN , First Publish Date - 2022-03-17T20:05:35+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నందుకు తనపై విధించిన

అమెరికాకు రష్యా షాక్

మాస్కో : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నందుకు తనపై విధించిన ఆంక్షల నేపథ్యంలో విదేశీ వాణిజ్య విమానాలను స్వాధీనం చేసుకోవాలని రష్యా నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ సంతకం చేశారు. రష్యాలోని విదేశీ కంపెనీలు లీజుకు తీసుకున్న విమానాలను రష్యన్ ఎయిర్‌లైన్స్ రిజిస్టర్ చేసుకుని, వాటిని దేశీయంగా వినియోగించుకోవడానికి ఈ బిల్లు ద్వారా అవకాశం కలిగింది. ఈ విమానాలను తిరిగి ఆయా విదేశీ సంస్థలు పొందడం చాలా కష్టమవుతుంది. ఈ వివరాలను దేశాధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 


అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలను విధించాయి. ఈ ఆంక్షల ఫలితంగా లీజింగ్ కంపెనీలు  తాము రష్యన్ ఎయిర్‌లైన్స్‌కు  లీజుకు ఇచ్చిన విమానాలను ఈ నెలాఖరునాటికి  తిరిగి స్వాధీనం చేసుకోవలసి ఉంటుంది. ఈ విమానాలను సురక్షితంగా నడపటానికి అవసరమైన విడి భాగాలను పాశ్చాత్య విమాన నిర్మాణ సంస్థలు  రష్యన్ ఎయిర్‌లైన్స్‌కు సరఫరా చేయడం నిలిపేశాయి. ఏవియేషన్ అనలిటిక్స్  సంస్థ సిరియం వెల్లడించిన వివరాల ప్రకారం రష్యన్ ఎయిర్‌లైన్స్ 305 ఎయిర్‌బస్ విమానాలను, 332 బోయింగ్ విమానాలను నడుపుతోంది. ఈ సంస్థలు విడిభాగాల సరఫరాను నిలిపేశాయి. 


బొంబార్డియర్, ఎంబ్రాయెర్, ఏటీఆర్ వంటి వెస్టర్న్ మాన్యుఫ్యాక్చరర్లు తయారు చేసిన 83 రీజనల్ జెట్స్‌ను కూడా రష్యా నడుపుతోంది. రష్యన్ ఎయిర్‌లైన్స్‌లోని 144 విమానాలు మాత్రమే రష్యాలో తయారయ్యాయి. విదేశీ తయారీ విమానాల్లో 85 శాతం విమానాలు లీజింగ్ కంపెనీల యాజమాన్యంలో ఉన్నాయి. వీటి విలువ 12.4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 


రష్యా గడ్డపై ఉన్న తమ విమానాలను ఈ లీజింగ్ కంపెనీలు ఏవిధంగా స్వాధీనం చేసుకోగలవనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విడి భాగాలు, మెయింటెనెన్స్ లేకపోతే ఈ విమానాలు సక్రమంగా పని చేయడం అసాధ్యమని తెలుస్తోంది. 


Updated Date - 2022-03-17T20:05:35+05:30 IST