రుషికొండపై నిజానిజాలు నిర్ధారిస్తాం

ABN , First Publish Date - 2022-07-06T07:00:53+05:30 IST

విశాఖలోని రుషికొండలో హరిత రిసార్టు స్థానంలో చేపట్టే నిర్మాణాలు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు, తమ మధ్యంతర ఉత్తర్వులకు లోబడి వుండాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది.

రుషికొండపై నిజానిజాలు నిర్ధారిస్తాం

అక్కడ నిర్మాణాలు సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులకు లోబడి ఉండాలి

స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

అడ్వకేట్‌ కమిషన్‌ను నియమిస్తామని ప్రకటన


అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి):

విశాఖలోని రుషికొండలో హరిత రిసార్టు స్థానంలో చేపట్టే నిర్మాణాలు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు, తమ మధ్యంతర ఉత్తర్వులకు లోబడి  వుండాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. గతంలో వున్న భవనాలను కూల్చివేసిన స్థానంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. విచక్షణారహితంగా కొండలు తవ్వకం, చెట్ల నరికివేతపై ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. చెట్ల కంటే ఎక్కువగా కొండలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చెట్లు పడిపోతే పెంచుకోగలము కానీ, కొండలను కోల్పోతే సృష్టించడం సాధ్యం కాదని తెలిపింది. అనుమతులకు మించి రుషికొండపై తవ్వకాలు, చెట్ల నరికివేతపై నిజానిజాలను నిర్ధారించేందుకు అడ్వకేట్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ధర్మాసనం పేర్కొంది. అయితే, కౌంటర్‌ దాఖలు చేసేందుకు వారం రోజులు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో, విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్‌ పరిశీలించిన తరువాత అడ్వకేట్‌ కమిషన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. 

కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌కు విరుద్ధంగా విశాఖ జిల్లా, ఎండాడ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 19లో గల రుషికొండపై చెట్లను తొలగిస్తున్నారని పేర్కొంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ వాసి, జనసేన నేత పీవీఎన్‌ఎన్‌ మూర్తియాదవ్‌ వేర్వేరుగా హైకోర్టులో పిల్స్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి, న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. ‘కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి రుషికొండపై తవ్వకాలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా వందలాది చెట్లు నరికివేశారు. కొండను తవ్వగా వచ్చిన వ్యర్థాలను సముద్ర తీరంలో పోస్తున్నారు. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్‌) ఇచ్చిన అనుమతులు అతిక్రమించి నిర్మాణాలు జరుపుతున్నారు. కేవలం 5.18 ఎకరాల్లోనే నిర్మాణాలు జరుపుకునేందుకు ఎంవోఈఎఫ్‌ అనుమతించింది. గతంలో వున్న భవనాలు కూల్చివేసిన స్థానంలోనే నిర్మాణాలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులు, ఎంవోఈఎఫ్‌ అనుమతులకు విరుద్ధంగా కొండపై తవ్వకాలు జరుపుతున్నారు. మరో రెండు వారాలు ఇదేవిధంగా తవ్వకాలు జరిపితే అక్కడ కొండ కూడా కనపడదు’ అని తమ వాదన వినిపించారు. తవ్వకాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందు ఉంచారు. యథాతథ స్థితి పాటించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 


అనుమతులకు లోబడే చేస్తున్నాం: ప్రభుత్వం

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ... సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎంవోఈఎఫ్‌ అనుమతులకు లోబడి నిర్మాణాలు జరుపుతున్నామన్నారు.  ఎనిమిది నెలలకు ముందు చూపిన ఫొటోలనే ఇప్పుడు చూపిస్తున్నారని తెలిపారు. పిటిషనర్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-07-06T07:00:53+05:30 IST