Salman Rushdie: రష్దీపై దాడి పాశ్చాత్య ప్రపంచానికి మేలుకొలుపు.. రిషి సునాక్ వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-08-15T03:03:37+05:30 IST

భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, బుకర్‌ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్దీపై(Salmaan Rushdie) దాడి జరిగిన నేపథ్యంలో బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్(Rishi Sunak) స్పందించారు.

Salman Rushdie: రష్దీపై దాడి పాశ్చాత్య ప్రపంచానికి మేలుకొలుపు.. రిషి సునాక్ వ్యాఖ్య

ఎన్నారై డెస్క్: భారత సంతతికి చెందిన ప్రముఖ రచయిత, బుకర్‌ప్రైజ్ గ్రహీత సల్మాన్ రష్దీపై(Salmaan Rushdie) దాడి జరిగిన నేపథ్యంలో బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్(Rishi Sunak) స్పందించారు. ఇరాన్‌పై(Iran) మరిన్న ఆంక్షలు విధించే అంశంపై పాశ్చాత్య ప్రపంచం(The West) దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ ఘటనను పాశ్చాత్య దేశాలకు ఓ మేలుకొలుపుగా ఆయన అభివర్ణించారు. ఆదివారం ఆయన ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 1988 నాటి రష్దీ నవల ‘ది సెటానిక్ వర్సెస్’ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నవల దైవదూషణ పూరితమైనదంటూ ఇరాన్ ప్రభుత్వం అప్పట్లో దీన్ని నిషేధించింది. అంతేకాకుండా.. రష్దీని చంపిన వారికి భారీ నజరానా కూడా ప్రకటిస్తూ ఓ ఫత్వా కూడా జారీ చేసింది. ఆ తరువాత.. ఫత్వా అమలును నిలిపివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే.. ఈ ఫత్వా కారణంగానే రష్దీపై దాడి జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇరాన్‌లో షియా తీవ్రవాదానికి మద్దుదారుడైన హదీ మాటర్ రష్దీపై దాడికి దిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే రిషి సునాక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 


రష్యా వ్యవహారంలో తలమునకలై ఉన్న పాశ్చాత్య ప్రపంచం ఇరాన్‌ నుంచి తన దృష్టి మళ్లించకూడదని రిషి సునాక్ సూచించారు. ఇరాన్‌లో పరిస్థితి సంక్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. అణ్వాయుధాలు కలిగిన ఇరాన్‌తో తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ ఉనికే ప్రమాదంలో పడుతుందని చెప్పారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించేలా ఓ కొత్త ఒడంబడిక అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో అమెరికా నేతృత్వంలో కుదిరిన జేసీపీఓఏ ఒప్పందం అనుకున్న ఫలితాలు ఇస్తోందా లేదా అని ప్రశ్నించుకోవాలని పాశ్చాత్య దేశాలకు రిషి సూచించారు. జేసీపీఓఏ ఒప్పందం ప్రకారం..అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాలను కట్టిపెట్టినందుకు ప్రతిగా ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలి. అయితే.. 2019లో అమెరికా.. అప్పటి అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఈ ఒప్పందం నుంచి వైదొలగింది. ఈ ఒప్పందాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం యోచిస్తోంది. 

Updated Date - 2022-08-15T03:03:37+05:30 IST