Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్తజనాద్రిగా యాదాద్రిక్షేత్రం

సందడిగా ఆలయ సేవా మండపాలు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 5: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవు రోజు కావడంతో పలు ప్రాంతాల నుంచి భక్తులు యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. దీంతో స్వామివారి ధర్మదర్శనాలకు 3గంటలు, ప్రత్యేక దర్శనాలకు 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకున్న యాత్రాజనులు నిత్యతిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చన, సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతపూజల్లో సుమారు 251మంది దంపతులు పాల్గొన్నారు. దీంతో ఆలయానికి రూ.1.25లక్షలు, ప్రసాదాల విక్రయంతో రూ.7.81లక్షలు సమకూరాయి. భక్తుల వాహనాలతో పట్టణ ప్రధానవీధులు, ఆలయ ఘాట్‌రోడ్లలో రద్దీ ఏర్పడింది. దీంతో వాహనాలను కొండకింద వైకుంఠద్వారం నుంచి రింగురోడ్డు వైపునకు పోలీసులు మళ్లించారు. స్వామివారికి వివిధ విభాగాల ద్వారా రూ.22,69,332 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

శాస్త్రోక్తంగా నిత్యవిధి కైంకర్యాలు

యాదాద్రీశుడికి నిత్యవిధి కైంకర్యాలు ఆగమ శాస్త్రోక్తంగా కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపిన ఆచార్యులు బాలాలయంలోని కవచమూర్తులను ఆరాధించారు. మండపంలో ఉత్సవమూర్తును అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. అనంతరం సుదర్శన శతక పఠనంతో హోమ పూజలు, నిత్యతిరుకల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాలాలయంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరాలు, వ్రత మండపంలో సత్యదేవుడి వ్రతాలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి, దర్శన క్యూకాంప్లెక్స్‌లోని చరమూర్తులకు నిత్య పూజలు కొనసాగాయి. కాగా, స్వామివారిని అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతకుమారి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.

శరవేగంగా స్వాగత తోరణం పనులు

యాదాద్రిక్షేత్రంలో కొండపైన ఆలయ రెండు ఘాట్‌రోడ్లను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న భారీ స్వాగత తోరణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులు నిరాటంకంగా కొనసాగేందుకు ఆ ప్రాంతంలోనికి భక్తులు, వీవీఐపీల వాహనాలను సైతం దేవస్థాన అధికారులు అనుమతించడం లేదు. సుమారు 40 అడుగుల ఎత్తు, 96 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవులో దీన్ని ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement