ఫిర్యాదులపై సత్వరం చర్యలు

ABN , First Publish Date - 2021-10-28T05:54:41+05:30 IST

డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు సత్వరం స్పందించి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ సూచించారు.

ఫిర్యాదులపై సత్వరం చర్యలు
ఫిర్యాదు నమోదు చేస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాలు

గుంటూరు, అక్టోబరు 27: డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు సత్వరం స్పందించి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవాలని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ సూచించారు. బుధవారం జరిగిన డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమానికి రూరల్‌ జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి 13 ఫిర్యాదులు రాగా వాటిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్తి రాయించుకుని డబ్బులివ్వకుండా ఇబ్బందిపెడుతున్నారని మరిది, కుటుంబ సభ్యులపై తుళ్లూరు మండలం రాయపూడికి చెందిన జోత్స్న ఫిర్యాదు చేశారు. కులం పేరుతో దూషించి కొట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులో పోలీసులు కేసును తప్పుడు కేసుగా మూసివేశారని రొంపిచర్ల మండలం మర్రిచెట్టువారిపాలేనికి చెందిన వసంతబాబు ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి మామ రూ.13 లక్షలు తీసుకుని భార్యతో నాపై తప్పుడు కేసు పెట్టించాడని దాచేపల్లికి చెందిన ప్రవీణ్‌ ఫిర్యాదు చేశారు. తన మరిదికి ఇటీవల వివాహం జరగ్గా రూ.25 లక్షల కట్నం ఇచ్చారని, దీంతో తనను కూడా రూ.25 లక్షల కట్నం తీసుకురావాలని ఇంటినుంచి గెంటివేశారని తెనాలి మారీసుపేటకు చెందిన పూర్ణిమ ఫిర్యాదు చేశారు. పొలం కౌలుకు తీసుకుని డబ్బులివ్వకుండా బెదిరిస్తున్నాడని హైదరాబాద్‌లో ఉంటున్న దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన శివకుమారి ఫిర్యాదు చేశారు. ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తనను  ఉద్యోగం నుంచి తీసివేశారని తెనాలి పరిధిలోని అంగలకుదురుకు చెందిన లక్ష్మీ అనే బ్యాంకు ఉద్యోగి  తెలిపారు. తన నుంచి ఏడున్నర లక్షలు అప్పుగా తీసుకుని అడుగుతుంటే బెదిరిస్తున్నాడని ధరణికోటకు చెందిన జరీనా ఫిర్యాదు చేశారు. గుంటూరు బ్రాడీపేట ప్రాంతంలో రీడింగ్‌ రూమ్స్‌ను రాత్రి 11 గంటలకే మూయిస్తున్నారని, ప్రస్తుతం సీఏ ఎగ్జామ్స్‌ జరుగుతున్నందున చదువుకునేందుకు తమకు మరికొంత సమయం ఇప్పించాలని వివేక్‌ అనే వ్యక్తి కోరారు. 

Updated Date - 2021-10-28T05:54:41+05:30 IST