పల్లె ప్రగతిని పకడ్బందీగా చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-28T04:50:47+05:30 IST

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని, జూన్‌ 2వ తేదీలోగా ఈ ప్రొఫైల్‌ స్ర్కీనింగ్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు.

పల్లె ప్రగతిని పకడ్బందీగా చేపట్టాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 27:  పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా   చేపట్టాలని, జూన్‌ 2వ తేదీలోగా ఈ ప్రొఫైల్‌ స్ర్కీనింగ్‌ పూర్తి చేయాలని  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి శుక్రవారం సాయంత్రం  తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమస్యలపై సమీక్షించారు. గ్రామాల్లో పరిశుభ్రత కార్యాక్రమాలు చేపట్టేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు జూన్‌ 3 తేదీ నుంచి పల్లె ప్రగతి చేపడుతున్నట్లు చెప్పారు.  సమస్యల వివరాలను అధికారులు ముందుగానే తెలుసుకోవాలని, పల్లె ప్రగతిలో పల్లె ప్రగతిలో పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లోని చెరువు కట్టలను బలోపేతం చేయాలన్నారు. కీటకజనిత వ్యాధులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లోని బావుల్లో దోమలు వృద్ధి చెందకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, ప్రభుత్వ కార్యాలయ భవనాలను శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్న కట్టడాలను గుర్తించి కూల్చివేయాలన్నారు.  

జూన్‌ 2 లోగా హెల్త్‌ ప్రొపైల్‌ స్ర్కీనింగ్‌ పూర్తి చేయాలి

జూన్‌ 2 లోగా జిల్లాలో ఈ హెల్త్‌ ప్రొపైల్‌ స్ర్కీనింగ్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మిగిలిన వారు త్వరగా స్ర్కీనింగ్‌ పరీక్షలు చేసుకునేందుకు వీలుగా ప్రతీ గ్రామంలో డప్పు చాటింపు వేయించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని వేగంగా జరిగేలా చూసేందుకు ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలన్నారు. నైరుతి రుతుపవనాలు ముందే వస్తున్నందున ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, వేములవాడ ఆర్డీవో లీలా, డీఆర్‌డీవో మదన్‌మోహన్‌, డీపీవో రవీందర్‌, డీసీవో బుద్ధనాయుడు, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, మేనేజర్‌  హరీష్‌, జిల్లా వ్యసాయ అధికారి రణధీర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T04:50:47+05:30 IST