Abn logo
Jun 17 2021 @ 00:04AM

రేషన్‌ బియ్యంలో పురుగులు.. తుట్టెలు

బస్తాలో తుట్టెలు కట్టి ఉన్న బియ్యం, పురుగులతో తుట్టెలు కట్టిన బియ్యం

తినలేమంటున్న లబ్దిదారులు

గ్రామాల్లో డీలర్లతో గొడవలు

తక్కువ తూకంతో బస్తాలు

లబోదిబోమంటున్న పంపిణీదారులు


పర్వతగిరి, జూన్‌ 16 : పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యం నాసిరకంగా ఉన్నాయి. బియ్యం అంతా పురుగులు పడి తుట్టెలు కట్టి ఉండడంతో ఎలా తినాలని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేస్తూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవహేళన చేస్తున్నాయని మండిపడుతున్నారు. మరోవైపు చౌకధరల దుకాణాలకు 50 కిలోల బస్తాల చొప్పున బియ్యం సరఫరా చేస్తుండగా, ప్రస్తుతం వచ్చిన కోటాలో తక్కువ తూకం రావడంతో డీలర్లు సైతం లబోదిబోమంటున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలో 35 రేషన్‌ దుకాణాలకు గాను 30 దుకాణాలకు ఇలాగే నాసిరకం బియ్యం అందా యి. వర్ధన్నపేట ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అందుబాటులో ఉన్న బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు పంపిణీ చేస్తున్నారు. దీంతో అధికంగా నాసిరకం బియ్యమే వచ్చాయని డీలర్లు వాపోతున్నారు. కాగా, మండలంలో 14,636 రేషన్‌ కార్డులు ఉండగా, 43,494 మంది కార్డుదారులు ఉన్నారు. ప్రస్తుత జూన్‌ నెలలో 6,184.638 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. 


ఒక్కొక్కరికి 15కిలోలు..

కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి కేంద్రం రెండు నెలల పాటు 5కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అంది స్తామని చెప్పగా,  రాష్ట్రం మరో 10కిలోలు జోడించి ఒక్కో లబ్దిదారునికి 15కిలోల చొప్పున జూన్‌ 5వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నాయి. గత రెండు నెలలుగా తెలంగాణ ప్రభుత్వం రూరల్‌ జిల్లాలో సన్నబి య్యం పంపిణీ చేస్తుండగా, ప్రస్తుతం కేంద్రం పంపిణీ చేసే బియ్యం దొడ్డుగా ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి పాఠశాలలకు సరఫరా చేసే బియ్యాన్ని స్టాకు ఉన్నంత వరకు రేషన్‌ షాపులకు పంపిణీ చేయాలని గతంలో ప్రభు త్వం ఆదేశించింది. ఆయా గ్రామాలకు గోదా ముల్లో అందుబాటులో ఉన్న బియ్యాన్ని సరఫ రా చేస్తున్నారు. గతంలో ఒక్కో లబ్దిదారునికి 6కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా, ప్రస్తుతం 15కిలోల చొప్పున అందిస్తున్నాయి. స్థలం ఉన్న డీలర్లు ఒకేసారి కోటా మొత్తం దించుకోగా.. స్థలం లేని వారు విడతల వారీగా బియ్యం దిగుమతి చే సుకుంటున్నారు. దీనికి తోడు కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం తరలించడానికి గాను లారీ లు ఏర్పాటు చేయడంతో రేషన్‌ బియ్యం తరలించ డానికి కొరత ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకు మండ ల వ్యాప్తంగా 40 శాతం లబ్దిదారులు మాత్రమే బియ్యం అందుకున్నారు. 


ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్దే గందరగోళం

మండలంలోని రేషన్‌ షాపులకు వర్ధన్నపేటలోని మండల్‌ లెవల్‌ స్టాక్‌ పాయింట్‌(ఎంఎల్‌ఎస్‌) నుంచి రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తుంటారు. దీంతో గోదాముల్లో అందుబాటులో ఉన్న బియ్యా న్ని చౌక దుకాణాలకు పంపిస్తున్నారు. కాగా, ఇక్కడ గతంలో నిల్వ ఉన్న పురు గులు పట్టిన బియ్యాన్ని పర్వతగిరి మండ లానికి పంపించారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నిర్వాహకుల మాయాజాలంతో తూకం త క్కువ వస్తుంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను నిత్యం పర్యవేక్షించాల్సిన సివిల్‌ సప్లై అధికా రుల పర్యవేక్షణ లోపించడం వల్లే నాసిరకం బియ్యం, తూకం తక్కువగా ఉన్న బియ్యం వస్తున్నాయని పలువురు డీలర్లు వాపోతున్నారు.


డీలర్లతో లబ్దిదారుల గొడవ

రెండు నెలల పాటు సన్నబియ్యం అందించి ప్రస్తుతం దొడ్డుబియ్యం రావడంతో లబ్దిదారులు డీలర్లతో గొడవలకు దిగుతున్నారు. సన్నబియ్యం డీలర్లు అమ్ముకుని తమకు నాసిరకమైన దొడ్డుబియ్యాన్ని అంటగడుతున్నారని వాదనకు దిగుతున్నారు. బియ్యం అంతా పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండడంతో తమకు వద్దని, నాణ్యమైన బియ్యం అందించాలని మరికొందరు అక్కడే బైఠాయిస్తున్నారు. నాసిరకమైన దొడ్డుబియ్యం పంపిణీ చేయ్యలేక, తక్కువ తూకంతో బస్తాలు రావడంతో లబ్దిదారులకు సరిపుచ్చలేక డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు మండలంలోని 35 షాపులకు గాను ఇప్పటికి 60 శాతం మాత్రమే బియ్యం కోటా రావడంతో లబ్దిదారులు షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని లబ్దిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

50కి గాను 45 కిలోలే ఉన్న బియ్యం బస్తా