ఒమైక్రాన్‌ నిర్ధారణకు పరుగులు

ABN , First Publish Date - 2022-01-27T08:46:39+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పరిస్థితి ఎలా తయారైందంటే..

ఒమైక్రాన్‌ నిర్ధారణకు పరుగులు

  • సోకింది ఏ వేరియంటో తెలుసుకోవడానికి ల్యాబ్‌లకు క్యూ.. 
  • వేరియంట్ల గుర్తింపునకు ప్రత్యేక టెస్టులు
  • పలు ప్రైవేటు ల్యాబ్‌లలో చార్జీల బాదుడు 


హైదరాబాద్‌ సిటీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో పరిస్థితి ఎలా తయారైందంటే.. దాదాపు ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. ఇంకొందరిలో లక్షణాలు ఏమాత్రం కనిపించడం లేదు. తీరా.. పరీక్ష చేసుకుంటే చాలామందికి పాజిటివ్‌ అని తేలుతోంది. ప్రస్తుతం ఈవిధంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఒమైక్రాన్‌ వేరియంటేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. 84 శాతం కేసులు ఇవేనని స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో చాలామంది తమకు సోకిన కరోనా వేరియంట్‌ ఏది ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్నారు. నిజానికి కొవిడ్‌ రోగికి సోకింది ఏ వేరియంట్‌ అనేది నిర్ధారించేందుకు సాధారణ ల్యాబ్‌లలో పరీక్షలు చేయరని వైద్యులు తేల్చి చెబుతున్నారు. కేంద్రం గుర్తించిన హైదరాబాద్‌లోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లలో మాత్రమే వేరియంట్‌ను నిర్ధారిస్తారని తెలిపారు.  


నోటిమాటగా చెప్పేస్తున్నారు..  

తమకు సోకింది ఒమైక్రానా ? కాదా ? అనేది తెలుసుకునేందుకు ప్రజలు చూపుతున్న ఆసక్తిని కూడా కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు వ్యాపారంగా మార్చుకున్నాయి. ఇందుకోసం అవి ‘ఒమైక్రాన్‌ టెస్ట్‌’ పేరిట ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కొవిడ్‌ రోగి నుంచి సేకరించిన శాంపిల్‌లో ‘ఎస్‌’ జీన్‌ లేకుంటే ‘ఒమైక్రాన్‌ పాజిటివ్‌’ అని.. ‘ఎస్‌’ జీన్‌ ఉంటే ‘ఒమైక్రాన్‌ నెగెటివ్‌’ అని నోటిమాటగా తెలియజేస్తున్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారి శాంపిల్‌లో ‘ఎస్‌’ ఉండదని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. అయితే ఈ ఒక్క అంశం ఆధారంగా ఒమైక్రాన్‌ ఇన్ఫెక్షన్‌ సోకిందా ? సోకలేదా ? అనే విషయాన్ని నిర్ధారించలేమని.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షతోనే పూర్తి స్పష్టత వస్తుందని కూడా డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించింది. ఈ అంశంపై పూర్తి అవగాహన లేకుండా పలు ప్రైవేటు ల్యాబ్‌ల సిబ్బంది ఒమైక్రాన్‌ పాజిటివ్‌, ఒమైక్రాన్‌ నెగెటివ్‌ అని చెబుతుండటం వల్ల పలువురు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. 


జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షకు ఇలా.. 

కొవిడ్‌ పరీక్ష చేయించుకునేందుకు ల్యాబ్‌లకు పరుగులు తీస్తున్న వారు.. క్యూలో నిలబడి నమూనాలు ఇచ్చి రావడానికే గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. 24 నుంచి 36 గంటల తర్వాత ఫలితం వచ్చాక, రిపోర్టు తీసుకోవడానికి వెళితే మరో అరగంట సమయం పడుతోంది. కొవిడ్‌ నిర్ధారణ అయిన రోగులకు.. ఒమైక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ కోసమంటూ ఎస్‌జీన్‌ పరీక్ష చేస్తున్నారు. అయితే ఎస్‌ జీన్‌ పరీక్షా నివేదిక ఆధారంగా.. ఏ ల్యాబ్‌ కూడా కచ్చితత్వంతో ఒమైక్రాన్‌ సోకిందా ? సోకలేదా ? అనే విషయాన్ని చెప్పలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఒమైక్రాన్‌ వేరియంట్‌ను నిర్ధారించే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్ష కోసం శాంపిళ్లను ఆస్పత్రులు ర్యాండమ్‌గా ఎంపిక చేసి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌లకు పంపుతాయి. ఈవిషయంలో రోగుల సూచనలను ల్యాబ్‌లు, ఆస్పత్రులు పరిగణనలోకి తీసుకోవు. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిలో పది శాతం మందికి సంబంధించిన శాంపిళ్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపిస్తారు.  


కచ్చితంగా చెప్పలేం

చాలామంది ఒమైక్రాన్‌ నిర్ధారణకు ‘ఎస్‌’ జీన్‌ పరీక్ష చేయించుకుంటున్నారు. దీని ఆధారంగా ఒమైక్రాన్‌ సోకిందా? లేదా? అని అంచనా వేయొచ్చు కానీ కచ్చితంగా చెప్పలేం. ప్రతి రోగికి జీనోమ్‌ పరీక్షలు చేయడం కష్టం కాబట్టి.. ఎస్‌ జీన్‌ పరీక్ష ద్వారా ఏ వేరియంట్‌ అనేది పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాంటీబాడీ కాక్‌టెయిల్‌, రెమ్‌డెసివిర్‌ వంటి మందులు ఇచ్చే సమయంలో ఇలాంటి పరీక్షలు అవసరం.

- డాక్టర్‌ ఎం.ఎన్‌.లక్ష్మీకాంత్‌రెడ్డి, మెడికవర్‌ ఆస్పత్రి



లక్షణాలు చూడాలి 

పరీక్ష కోసం సేకరించిన శాంపిల్‌లో ఎస్‌ జీన్‌ ఉంటే ఆల్ఫా, డెల్టా ఏదైనా కావచ్చు. కొన్నిసార్లు ఒమైక్రాన్‌ కూడా ఉండొచ్చు. ఏ వేరియంట్‌ అయినా ముందుగా రోగి లక్షణాల ఆధారంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. 

- డాక్టర్‌ రాకేశ్‌, పల్మనాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి


ఆందోళన చెందొద్దు

అనవసరంగా పరీక్షలు చేసుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒమైక్రాన్‌ ఒకరికి వస్తే సన్నిహిత వ్యక్తులందరికీ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. స్వల్ప జ్వరం ఉంటే ఒమైక్రాన్‌, హై ఫీవర్‌ ఉంటే డెల్టాగా అనుమానించాలి. ఒమైక్రాన్‌ సోకిన వారిలో రుచి, వాసన పోవడం ఉండదు. ఒమైక్రాన్‌ సోకినా 7 రోజుల్లోగా కోలుకుంటారు. అయితే వైద్యుల సలహా మేరకు చికిత్సపొందాలి.

- డాక్టర్‌ జగదీశ్‌, జనరల్‌ ఫిజీషియన్‌, కిమ్స్‌ ఆస్పత్రి

Updated Date - 2022-01-27T08:46:39+05:30 IST