పల్లెపోరుపై పరుగులు

ABN , First Publish Date - 2021-01-27T06:31:36+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు.

పల్లెపోరుపై పరుగులు

  1. 18 అంశాలపై నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం 
  2. జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్‌ సమావేశం
  3. 970 పంచాయతీల్లో ఎన్నికలకు ఏర్పాట్లు
  4. స్ట్రాంగ్‌రూమ్‌కు చేరిన బ్యాలెట్‌ పేపర్లు


కర్నూలు(కలెక్టరేట్‌), జనవరి 26: గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య నడుస్తోన్న కేసుల వల్ల ఎన్నికలు వాయిదా పడతాయేమోనన్న అనుమానంతో అధికారులు కాలయాపన చేశారు. సుప్రీం కోర్టు తీర్పుతో పరుగులు పెడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఎలాంటి సమచారం అడగని రాష్ట్ర ప్రభుత్వం, 18 రకాల అంశాల సమాచారాన్ని నివేదికల రూపంలో అందించాలని జిల్లా పంచాయతీ అధికారులను కోరింది. దీంతో జిల్లా యంత్రాంగం నివేదికలను సిద్ధం చేయడంలో తలమునకలైంది. గణతంత్ర వేడుకల అనంతరం కలెక్టర్‌ వీరపాండియన్‌ జిల్లా అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. 


నాలుగు విడతల్లో పోలింగ్‌

జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉండగా 970 స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో 53 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మొదటి విడతలో 13 మండలాల్లో 240 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో 14 మండలాల్లోని 245 పంచాయతీలకు, మూడో విడతలో 14 మండలాల్లో 292 గ్రామ పంచాయతీలకు, నాలుగో విడతలో 12 మండలాల్లో 193 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి.


మూడు పంచాయతీలు దూరం

జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు, 10,026 వార్డులు ఉన్నాయి. 970 పంచాయతీలు, 9,984 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సున్నిపెంట, మండగిరి, సాదాపురం పంచాయతీలు ఎన్నికలు జరగడం లేదు. నూతన గ్రామ పంచాయతీ సున్నిపెంటలో ఓటర్ల జాబితా ప్రచురితం కాలేదు. మండగిరి, సాదాపురం గ్రామ పంచాయతీలు ఆదోని మున్సిపాలిటీలో విలీనం అవుతున్నాయి. 


సమస్యాత్మకం

జిల్లాలో అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక పంచాయతీలను అధికారులు గుర్తించారు. అత్యంత సమస్యాత్మక పంచాయ తీలు 106 ఉన్నాయి. వీటి పరిధిలో 255 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. సమస్యాత్మక పంచాయతీలు 159 కాగా, 377 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి.


గ్రామీణ ఓటర్లు

జిల్లాలో గ్రామీణ జనాభా 28,37,345 కాగా, పురుషులు 14,32,732, మహిళలు 14,04,613 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 10,55,362 మంది, మహిళా ఓటర్లు  10,59,632 మంది,  ఇతరులు 249 మంది ఉన్నాయి. మొత్తం గ్రామీణ ఓటర్లు 21,15,243 మంది ఉన్నట్లు అధికారులు  గుర్తించారు. 


పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు

జిల్లాలో 10,212 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించారు. 200 మంది లోపు ఓటర్లు ఉన్న పోలింగ్‌ స్టేషన్లు 6,086 ఉన్నాయి. 201 నుంచి 400 మంది ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలు 3,204, 401 నుంచి 650కి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాలు 922 ఏర్పాటు చేశారు. 


6,470 బ్యాలెట్‌ బాక్సులు

నాలుగు విడతల పోలింగ్‌కు 12,251 బ్యాలెట్‌ బాక్సులు అవసరం కాగా ప్రస్తుతం 6470 బాక్సులు మాత్రమే ఉన్నాయి. స్టేజ్‌ 1, 2 ఆర్వోలు, ఏఆర్వోల నియామకం పూర్తయింది. గతంలో షెడ్యూల్‌ విడుదలైన సందర్భంలో స్టేజ్‌ 1-2 ఆర్వోలు, ఏఆర్వోలను నియమించారు. వీరికి మొదటి విడత శిక్షణ గత ఏడాది మార్చి 2న నిర్వహించారు.


బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తి

సర్పంచు, వార్డు మెంబర్‌ బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తయింది. 23,89,000 సర్పంచు బ్యాలెట్‌ పేపర్లు, 23,86,000 వార్డు మెంబర్ల బ్యాలెట్‌ పేపర్లన ముద్రించి స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచారు. మండలానికి ఒక  ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ముగ్గురు వీడియోగ్రాఫర్లను నియమించారు. 

Updated Date - 2021-01-27T06:31:36+05:30 IST