Abn logo
Nov 24 2021 @ 02:15AM

‘రాజధాని’ పేరిట రుణమేళా!

50 వేల కోట్లకు ఒకేసారి టెండర్‌ 

ప్రపంచ బ్యాంకుకు రాష్ట్రం ప్రతిపాదన

రుణం మంజూరైతే ఏం చేస్తారు?

ఏ రాజధాని అభివృద్ధికి ఇంత రుణం?

అమరావతి కోసమా.. విశాఖ కోసమా?

అసలు.. అభివృద్ధి కోసమే ఖర్చు పెడతారా?

లేక.. అలవాటు ప్రకారం దారి మళ్లిస్తారా?

జగన్‌ సర్కారు తీరుపై ఎన్నెన్నో సందేహాలు


ఏ ‘రాజధాని’ని అభివృద్ధి చేస్తారో తెలియదు! కానీ... ‘క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రూ.50వేల కోట్ల రుణానికి టెండరు పెట్టింది. చీటికీ మాటికీ ‘ఓవర్‌ డ్రాఫ్ట్‌’కు వెళ్లడం! వారంవారం అప్పులకోసం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం! అప్పుల కోసం బ్యాంకులను బతిమలాడటం! ఇదీ ఇప్పటిదాకా జరుగుతున్న రుణ మేళా! ఇప్పుడు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా ఏకంగా రూ.50 వేల కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

సక్రమంగా, అక్రమంగా, ఏదో రకంగా అప్పులు తెచ్చుకోవడమే రాష్ట్ర సర్కారు లక్ష్యం! అప్పు పుట్టనిదే పూట గడవని జగన్‌ ప్రభుత్వం... అన్ని రకాల పరిమితులనూ దాటేసింది. స్థానికంగా, జాతీయంగా అప్పులు పుట్టడం లేదు. ఇప్పుడు... సర్కారు వారి కన్ను అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై పడింది. అనేక షరతులకు లోబడి అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులిచ్చే ప్రపంచబ్యాంకు నుంచి రూ.50 వేల కోట్లు అప్పు తీసుకునేందుకు ‘దరఖాస్తు’ పెట్టుకుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించిందని, ప్రస్తుతం ఆ ప్రతిపాదన ప్రపంచబ్యాంకు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘రాజధాని నగరాభివృద్ధి’ పేరిట ఈ రుణ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం విశేషం. గతంలో టీడీపీ హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి కోసం అప్పు కావాలని ప్రపంచ బ్యాంకును ఆశ్రయించారు. అయితే, ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు రైతుల పేరుతో రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ఈ-మెయిళ్లు పంపించారు. దీంతో ప్రపంచ బ్యాంకు బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు స్వయంగా అమరావతికి వచ్చింది. అక్కడ అంతా సక్రమంగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటికీ... ప్రపంచ బ్యాంకు షరతులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకున్న నాటి ప్రభుత్వం ఈ రుణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. రుణం కోసం మళ్లీ ప్రపంచ బ్యాంకును ఆశ్రయించలేదు.


ఇప్పుడు అదే పేరుతో... విపక్షంలో ఉండగా అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసిన వైసీపీ... అధికారంలోకి రాగానే ‘రాజధాని అభివృద్ధి’ కోసం అదే ప్రపంచ బ్యాంకును రూ.50వేల కోట్లు రుణం కోరడం గమనార్హం. ‘‘మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుంది. అంత డబ్బులు ఖర్చు పెట్టలేం’’ అనే నెపంతో అమరావతిని అటకెక్కించింది. ‘పరిపాలన వికేంద్రీకరణ’ పేరిట మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ఆ బిల్లులు ఆమోదించిన రెండేళ్ల తర్వాత... ‘సమగ్రంగా లేవు’ అంటూ సోమవారం వాటిని వెనక్కి తీసుకుంది. అదే సమయంలో ‘క్యాపిటల్‌ డెవల్‌పమెంట్‌’ పేరుతో ప్రపంచ బ్యాంకు రుణంకోసం ప్రయత్నాలు ప్రారంభించిన విషయం వెలుగులోకి రావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచబ్యాంకుకు చెప్పిన ‘క్యాపిటల్‌’ ఏది? అది... అమరావతేనా? లేక... పరిపాలనా రాజధానిగా చెబుతున్న విశాఖ నగరమా? అదీ కాకపోతే... న్యాయరాజధాని కర్నూలు నగరమా? దీనిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఆర్థికపరమైన అంశాలలో జగన్‌ సర్కారు విశ్వసనీయత బాగా పడిపోయింది. పథకాల నిధులను దారి మళ్లించడం, తప్పు లెక్కలు చూపించడంలో ఆరి తేరింది. ఈ నేపథ్యంలో... నిజంగానే ప్రపంచ బ్యాంకు రూ.50 వేల కోట్ల రుణం మంజూరు చేస్తే, ఆ మొత్తాన్ని రాజధాని అభివృద్ధి కోసమే ఖర్చు పెడతారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అన్ని అప్పులు, అన్ని శాఖల్లోని నిధులు, కోర్టుల్లో డిపాజిట్లను కూడా జగన్‌ సర్కారు లాగేసుకుంది. ప్రపంచబ్యాంకు రాష్ట్రంలో విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించింది. దీనిపై ప్రపంచబ్యాంకు సీరియ్‌సగా స్పందించి నేరుగా కేంద్రంతోనే తేల్చుకుంటామంటూ లేఖ రాసింది. అలాగే, ఏఐఐబీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కోసం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించింది. దీంతో ఏఐఐబీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి వాయిదా చెల్లింపులను ఆపేసింది. కేంద్ర కార్మిక శాఖ ఈఎ్‌సఐ ఆస్పత్రుల కోసం ఇచ్చిన నిధులను కూడా జగన్‌ సర్కార్‌ దారి మళ్లించింది. దీనిపై కేంద్ర కార్మిక శాఖ... ‘‘రాష్ట్రంలో ఈఎ్‌సఐను నేరుగా మేమే నిర్వహించాలనుకుంటున్నాం మీ స్పందన చెప్పండి’’ అని లేఖ రాసింది. రోడ్డు అభివృద్ధి పేరిట విధించిన సెస్‌లు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులతో సహా మరెన్నో శాఖలు, విభాగాల నిధులను జగన్‌ సర్కారు వాడేసుకుంది. ఇవేవీ చాలదన్నట్లు వేలకోట్ల అప్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని పేరుతో ప్రపంచబ్యాంకు నుంచి అప్పు తెచ్చి... ఏం చేస్తారు? అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారా? లేక... వాటినీ అలవాటు ప్రకారం దారి మళ్లిస్తారా? అనేదే ప్రస్తుత సందేహం!