May 4 2021 @ 23:24PM

మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి హీరోయిన్ ఫిక్సయిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సంచలన దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రీసెంట్‌గా ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ విషయంలో ఇప్పుడు టాలీవుడ్‌లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి మరోసారి త్రివిక్రమ్.. పూజా హెగ్డేనే రిపీట్ చేస్తున్నాడనేలా సోషల్ మీడియాలో వార్తలు దర్శనమిచ్చాయి. కొత్తగా ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ నటి, అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని నటింపజేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిలో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ.. ఈ సినిమాలో జాన్వీనే హీరోయిన్ అనేలా సోషల్ మీడియాలో మంగళవారం అంతా ట్రెండ్ అయింది. అయితే మేకర్స్ మాత్రం అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు. ఈ సినిమా సెట్స్‌పైకి రావడానికి చాలా టైమ్ ఉంది కాబట్టి.. ఇలా హీరోయిన్ల విషయంలో వార్తలు వస్తూనే ఉంటాయి. 


ఒక్క హీరోయిన్ అనే కాదు.. సోషల్ మీడియాలో ఈ సినిమాకు పేరు కూడా ఫిక్స్ చేసేశారు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’లోని మహేష్ పేరు(పార్థు)నే ఈ సినిమాకి టైటిల్‌గా పెట్టబోతున్నారంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే 31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు.