Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సమస్యలపై స్పందించరా?

twitter-iconwatsapp-iconfb-icon
సమస్యలపై స్పందించరా? పోడియం వద్ద బైఠాయించిన వైస్‌చైర్మన్‌, కౌన్సిలర్లు

అధికారుల తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్‌ నిరసన

పోడియం వద్ద బైఠాయింపు

మద్దతుగా నిలిచిన వైస్‌చైర్మన్‌, మరో కౌన్సిలర్‌

ముగ్గురినీ సస్పెండ్‌ చేయాలని కమిషనర్‌కు చైర్మన్‌ ఆదేశం

వాడీవేడిగా పలాస మునిసిపల్‌ సమావేశం

(పలాస, జనవరి 27)

పలాసలో మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం గరంగరంగా సాగింది. సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిలర్ల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. అధికారుల తీరును నిరసిస్తూ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్‌ పోడియం వద్ద బైఠాయించారు. ఆమెకు మద్దతుగా మరో ఇద్దరు బైఠాయించి.. నిరసన తెలిపారు. స్వపక్ష సభ్యులు ఇలా వ్యవహరించడం తగదంటూ చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మందలించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో.. ఆ ముగ్గురిని సభ నుంచి సస్పెండ్‌ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. దీంతో సభలో వాతావరణం మరింత వేడెక్కింది. సమస్యలపై అధికార పార్టీ కౌన్సిలర్లే నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. 

పలాస మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు అధ్యక్షతన గురువారం సమావేశం నిర్వహించారు. సభలో టేబుల్‌ అజెండా అంశాలను ప్రస్తావిస్తున్న సమయంలో వైసీపీకి చెందిన 25వ వార్డు కౌన్సిలర్‌ బోర చంద్రకళ మాట్లాడుతూ.. అజెండా అంటే ఏమిటో చెప్పాలని కమిషనర్‌ టి.రాజగోపాలరావును కోరారు. దీనిపై ఆయన వివరణ  ఇచ్చారు. ‘నాలుగు నెలలుగా మా వార్డులో కాలువలపై శ్లాబులు, పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తున్నా.. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. నాలుగుసార్లు సభ దృష్టికి తీసుకువచ్చినా పరిష్కరించలేదు. సీనియర్‌ కౌనిల్సర్లకే ప్రాధాన్యం ఇవ్వకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?’ అంటూ కౌన్సిలర్‌  చంద్రకళ మండిపడ్డారు. మునిసిపాలిటీలో ఇంతకన్నా అత్యవసర సమస్యలు ఉంటాయా? అని ప్రశ్నించారు. దీనిపై కమిషనర్‌ నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అధికారుల తీరుకు వ్యతిరేకంగా పోడియం వద్ద ఆమె బైఠాయించి నిరసన తెలిపారు. ఆమెకు వైస్‌చైర్మన్‌ బోర కృష్ణారావు(13వ వార్డు), పోతనపల్లి ఉమాకుమారి(12వ వార్డు కౌన్సిలర్‌) సంఘీభావం ప్రకటించారు. పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీనిపై చైర్మన్‌ బళ్ల గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వపక్ష సభ్యులు ఇలా నిరసన చేయడం తగదని, సమస్యలను లిఖితపూర్వకంగా తనకు అందిస్తే పరిష్కరిస్తాం కదా.. అంటూ  మందలించారు. సభకు ఆటంకం కలిగించిన ముగ్గురినీ సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అయినా ఆ ముగ్గురు పోడియం వద్ద నిరసన కొనసాగించారు. దీంతో కమిషనర్‌పై చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని సస్పెండ్‌ చేశామని... తక్షణమే మార్షల్స్‌తో వారిని బయటకు పంపించాలని ఆదేశించారు. దీంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ కౌన్సిలర్లు బడగల సుజాత, దువ్వాడ సత్యవతిలు చైర్మన్‌కు మద్దతుగా నిలిచారు. సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించుకుందామని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. విప్‌ దుర్గాశంకర్‌ మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటన జరగకూడదని, చిన్న విషయానికి సస్పెండ్‌ చేస్తామనడం తగదని వారించారు. ఆందోళనకారుల నుంచి సమస్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకుని.. వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని సూచించారు. ఆయన సూచనలను చైర్మన్‌ పాటించారు. వైస్‌ చైర్మన్‌-2 మీసాల సురేష్‌బాబు, కౌన్సిలర్‌ గుజ్జు జోగారావు మాట్లాడుతూ.. స్వపక్షంలోనే విపక్షం మాదిరిగా వ్యవహరించడం తగదన్నారు.  


పవర్‌బోర్లు వేయండి 

సభలో వివిధ సమస్యలపై సభ్యులు ప్రస్తావించారు. తన వార్డులో పవర్‌బోర్లు వేసి దాహార్తిని తీర్చాలని, భద్రం కోనేరు పార్కును అభివృద్ధి చేయాలని టీడీపీ కౌన్సిలర్‌ గురిటి సూర్యనారాయణ కోరారు. వైస్‌చైర్మన్‌ మీసాల సురేష్‌బాబు, కౌన్సిలర్‌ గుజ్జు జోగారావు, కోఆప్షన్‌ సభ్యుడు బి.సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ సూదికొండలో ఇచ్చిన క్వారీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కౌన్సిలర్లు వజ్జ బాబూరావు, డిక్కల ఆనంద్‌, జోగ త్రివేణి, డొక్కరి తులసి, సనపల అమ్మోజి, పి.అజయ్‌కుమార్‌, దువ్వాడ శ్రీకాంత్‌, ఎస్‌.సింహాచలం, పి.ప్రసాద్‌ పాల్గొన్నారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.