నిబంధనలకు నీళ్లు!

ABN , First Publish Date - 2022-05-18T03:46:08+05:30 IST

ప్రతీ జీవికి ప్రాణాధారం నీరు. నీరు లేనిదే జీవుల మనుగడ లేదు. తిండి లేకపోయినా దోసెడు నీళ్లు తాగి ప్రాణాలను దక్కించుకుంటాం. ప్రాణుల జీవనానికి అత్యంత ముఖ్యమైంది నీరు. దీన్నే కొందరు ఆసరాగా మార్చుకొని తాగునీటి అమ్మకంతో డబ్బు సంపాదిస్తున్నారు.

నిబంధనలకు నీళ్లు!
పరిగిలోని ఓ ప్లాంట్‌లో నీటిశుద్ధి యంత్రాలు

  • అనుమతులు లేకుండానే వాటర్‌ ప్లాంట్ల ఏర్పాటు 
  • శుద్ధజలం పేరిట దోపిడీ
  • పుట్టగొడుగుల్లా ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్లు 
  • శుద్ధి చేయకనే, అపరిశుభ్ర క్యాన్లలో సరఫరా
  • పరిగిలో రోజూ రూ.లక్షల్లో నీటి వ్యాపారం
  • పట్టించుకోని ప్రజారోగ్య శాఖ అధికారులు

   ప్రతీ జీవికి ప్రాణాధారం నీరు. నీరు లేనిదే జీవుల మనుగడ లేదు. తిండి లేకపోయినా దోసెడు నీళ్లు తాగి ప్రాణాలను దక్కించుకుంటాం. ప్రాణుల జీవనానికి అత్యంత ముఖ్యమైంది నీరు. దీన్నే కొందరు ఆసరాగా మార్చుకొని తాగునీటి అమ్మకంతో డబ్బు సంపాదిస్తున్నారు. అధిక ఆదాయం కోసం అడ్డదారులు వెతుకుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించి కల్తీ నీటినే మినరల్‌ వాటర్‌గా అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే వాటర్‌ ప్లాంట్లు పెట్టి ప్యూరిఫైడ్‌, మినరల్‌ వాటర్‌ పేరిట మాయ చేస్తున్నారు. వారు సరఫరా చేస్తున్న నీటిని కొని తాగి అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు.

పరిగి, మే 17: కొందరు వ్యాపారులు శుద్ధజలం పేరుతో జనాన్ని దోపిడీ చేస్తున్నారు. ఫ్లోరైడ్‌ సమస్యతో జనం శుద్ధజలంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఖర్చు గురించి వెనుకాడకుండా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. గ్రామాల్లో మిషన్‌ భగీరథ, రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నా తాగడానికి మాత్రం జనం మినరల్‌ వాటర్‌పైనే మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా మినరల్‌ వాటర్‌ సరఫరా వ్యాపారం పరిగి పట్టణంలో జోరుగా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా మినరల్‌వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పేరు మినరల్‌ వాటర్‌, ప్యూరిఫైడ్‌ ప్లాంట్లే అయినా వాటిల్లో నిబంధనలు పాటించడం లేదు. తీపిదనం కోసం కెమికల్స్‌ వాడుతున్నారు. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పరిగిలో 15కిపైగా తాగునీటి ప్లాంట్లున్నాయి. వీటిల్లో ఒకటీ రెండింటికి మాత్రమే అనుమతులున్నాయి. పట్టణంలో నిత్యం లక్ష లీటర్ల వరకు ప్యూరిఫైడ్‌ వాటర్‌ వ్యాపారం జరుగుతోది. 20లీటర్ల క్యాన్లు 7వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా పరిగిలో రోజుకు రూ.లక్షకుపైగా తాగునీటి నీటి వ్యాపారం జరుగుతోంది. 20లీటర్ల డబ్బాలు రూ.15లు, అదే పరిమాణం గల చల్లని నీటి డబ్బాలు రూ.40కు అమ్ముతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా శుద్ధజలం పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నా ప్రజారోగ్య, మున్సిపల్‌ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటు పంచాయతీ, అటు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులూ తమ విధి కాదని ఊరకుంటున్నారు. ఇదే అదనుగా వాటర్‌ప్లాంట్‌ యజమానులు ఇష్టారాజ్యంగా జనరల్‌ వాటర్‌నే మినరల్‌ వాటర్‌ పేరుతో అమ్ముతున్నారు.


  • ప్యూరిఫైడ్‌ నీటి ప్లాంట్‌ పెట్టాలంటే నిబంధనలివీ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నీటిలో ఫ్లోరైడ్‌, పీహెచ్‌, ఖనిజ లవణాలను శుద్ధి చేయాలి. మినరల్స్‌ పూర్తిగా తీసేయకూడ దు. నీటిని నింపే ముందు డబ్బాలను శుభ్రం చేయాలి. శుద్ధి చేసేటప్పుడు ప్రైజర్‌ ఫిల్టరింగ్‌తో నీటిలో మలినాలు లేవని నిర్ధారణ అయ్యేంత వరకూ ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి నీటిని పరీక్షించాలి. మలినాలు, బ్యాక్టీరియా లేకుండా శుద్ధిచేసే మెంబ్రియాలను వాడాలి. బాటిళ్లను బ్లీచింగ్‌ పౌడర్‌, లిక్విడ్‌ క్లోరిన్‌ కలిపిన నీటితో కడగాలి. నీటిలో ప్లోరైడ్‌ శాతం 1.0మిల్లీగ్రాములలోపు ఉండాలి. కానీ కొన్ని ప్లాట్ల వారు సరఫరా చేస్తున్న నీటిలో అది 2మిల్లీ గ్రాముల వరకూ ఉంటోంది. నీటిలో కరిగే లవణాలు కనీసం 150మిల్లీ గ్రాముల వరకు ఉండాలి. అయితే పట్టణంలోని నీటి ప్లాంట్ల నిర్వాహకులు ఈ నిబంధనలను పాటించడం లేదు. దీంతో నీటిలో బ్యాక్టీరియా మరీ ఎక్కువగా ఉంటే కలరా, ఇతర వ్యాధులు సోకే అవకాశాలున్నాయి. శుద్ధిచేయని నీటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దీనివల్ల గొంతు నొప్పి, జీర్ణకోశ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.


  • ప్లాంట్‌ నీటిలో మినరల్స్‌ నిల్‌!

ప్రస్తుతం మినరల్‌ వాటర్‌ ప్రజలకు విక్రయిస్తున్న నీటిలో నిజానికి ఖనిజ లవణాలు(మినరల్స్‌) ఏవీ ఉండవు. ఈ నీటిని మలినాలు, బ్యాక్టీరియాలు లేకుండా శుద్ధిచేసి డబ్బాల్లో సరఫరా చేస్తారు. వీటిని నింపేటప్పుడు చాలా కంపెనీలు సరైన నియమాలను పాటించడం లేదు. ఈ నీటిని రెండు రోజుల పాటు నిల్వ ఉంచితే బ్యాక్టీరియా పుట్టుకొస్తుంది. మరోవైపు ప్లాంట్లలో పనిచేసే సిబ్బందికి, యాజమాన్యానికి బాటిళ్ల శుద్ధి విషయంలో సరైన అవగాహన లేకపోవడం గమనార్హం.తాగు నీటి ప్లాంట్‌ల నిర్వాహణపై సంబంధిత అధికారుల నియంత్రణ కరువైంది.


  • మినరల్‌ వాటర్‌ పేరుతో దోపిడీ : చిన్నయ్య, పరిగి వాసి

మినరల్‌ వాటర్‌ పేరుతో దోపిడీ చేస్తున్నారు. నీటిశుద్ధికి నిబంధనలు పాటించడం లేదు. ఒక్కో డబ్బాకు రూ.15 నుంచి రూ.20 వసూలు  చేస్తున్నారు. డబ్బులు తీసుకున్నా శుద్ధమైన నీటినైనా సరఫరా చేయ డం లేదు. అపరిశుభ్ర నీరు తాగి రోగాల బారిన పడుతున్నాం. వాటర్‌ ప్లాంట్ల కెమికల్‌ నీరు తాగడం ద్వారా కీళ్ల నొప్పులతో పాటు వివిధ రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్లాంట్లను పర్యవేక్షించాలి.


  • ఒక్క ప్లాంట్‌కూ అనుమతి లేదు : ప్రవీణ్‌కుమార్‌, కమిషనర్‌, పరిగి మున్సిపాలిటీ

పరిగి మునిసిపల్‌ పరిధిలో ఒక్క మినరల్‌ ప్లాంటుకు కూడా అనుమతి లేదు. 15 ప్లాంట్లకుపై ఉన్నట్లు గుర్తించాం. గతంలో ప్లాంట్ల యజమానులకు నోటీసులు ఇచ్చాం. ఇప్పటి వరకు ఎవరి నుంచి కూడా రిప్లై రాలేదు. నిబంధనలకు విరుద్ధ్దంగానే నడుస్తున్నాయి. వాటర్‌లో కూడా ఉండాల్సిన మినరల్స్‌ ఉండడం లేదు. మరోసారి నోటీసులు ఇస్తాం. స్పందించకపోతే ప్లాంట్లను సీజ్‌ చేస్తాం. అనుమతి లేకుండా నిర్వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు.

Updated Date - 2022-05-18T03:46:08+05:30 IST