విధ్వంస పాలకా... బీపీ మీకా? మాకా?

ABN , First Publish Date - 2022-04-10T06:11:05+05:30 IST

తనప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భయపడుతున్నారా? ఇటీవలి కాలంలో ఆయన ప్రసంగాల ధోరణి గమనిస్తే ఈ అనుమానం కలుగుతుంది...

విధ్వంస పాలకా... బీపీ మీకా? మాకా?

తనప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భయపడుతున్నారా? ఇటీవలి కాలంలో ఆయన ప్రసంగాల ధోరణి గమనిస్తే ఈ అనుమానం కలుగుతుంది. పిచ్చి పీక్స్‌కు చేరింది అన్నట్టుగా జగన్‌ రెడ్డిలో నిరాశా నిస్పృహలు కూడా పరాకాష్ఠకు చేరినట్టున్నాయి. అందుకే, తాను ముఖ్యమంత్రిని అన్న విషయం విస్మరించి ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ వంటి పదాలు వాడుతున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనతోపాటు మీడియాపై ఆయన నోరు పారేసుకుంటున్నారు. ప్రభుత్వ చర్యలను తప్పుపట్టే వారిని ఆయన సహించలేకపోతున్నారు. 2019కి ముందు రాజధాని అమరావతిపై పిటిషన్లు వేసి ఆటంకాలు సృష్టించిన ఆనాటి ప్రతిపక్షమైన వైసీపీకి చెందిన నాయకులను... అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు రాక్షసులతో పోల్చేవారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని నిందించేవారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే బాటలో ప్రతిపక్షాలను, మీడియాను తిట్టిపోస్తున్నారు. అంతటితో ఆగకుండా తన ప్రభుత్వాన్ని విమర్శించే వారికి బీపీ పెరిగి గుండెపోటు వచ్చి చస్తారని కూడా శాపనార్థాలు పెట్టారు. జగన్‌ రెడ్డి నోటి వెంట ‘గుండెపోటు’ అన్న పదం వచ్చిందంటే దివంగత రాజశేఖర రెడ్డి సోదరుడైన వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య గుర్తుకొస్తుంది. అప్పట్లో వివేకాను గొడ్డళ్లతో నరికి చంపినప్పటికీ ఆయన గుండెపోటుతో మరణించారని జగన్‌ అండ్‌ కో ప్రచారం చేసిన విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో పాటు తాను ద్వేషించే మీడియా బాధ్యతలు నిర్వహిస్తున్న మాకు కూడా గుండెపోటు వస్తుందని జగన్మోహన్‌ రెడ్డి అంటున్నారంటే గొడ్డళ్లు సిద్ధమవుతున్నాయా? అన్న అనుమానం రాకుండా ఉంటుందా? సొంతింట్లోనే వివేకానంద రెడ్డిని కొందరు గొడ్డళ్లతో నరికి చంపగలిగినప్పుడు, మమ్మల్ని చంపడం కష్టం కాకపోవచ్చు. అయినా మేం చేసిన నేరం ఏమిటి? ప్రభుత్వ పోకడలను తప్పుపట్టడం నేరం కాదు కదా? మేం చేస్తున్నది తప్పయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ సొంత మీడియా చేసిన దాన్ని ఏమనాలి? ఆనాడు చేసిన దుష్ర్పచారానికి జగన్‌ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం నేరం కాదు కదా? విద్యుత్‌ కోతల విషయమే తీసుకుందాం! రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్‌ ఉంటుందని, తెలంగాణ చీకటిలో మగ్గుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చెప్పింది వాస్తవం కాదా? ఇప్పుడు తెలంగాణలో విద్యుత్‌ వెలుగులు జిగేల్మంటున్నాయి. డిమాండ్‌కు సరిపడినంతగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టే కదా! మిగులు విద్యుత్‌ ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలను అమలుచేయడాన్ని జగన్‌ రెడ్డి ఎలా సమర్థించుకుంటారు? నిజానికి తెలుగు ప్రజలు విద్యుత్‌ కోతల విషయం మరచిపోయి చాలా ఏళ్లయింది. జగన్‌ రెడ్డి పాలనా వైఫల్యాల వల్ల ఇంత కాలానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మళ్లీ చీకటిలో మగ్గిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులు సైతం కరెంటు కోతల వల్ల ఇబ్బందుల పాలవుతున్నారు. అభివృద్ధి పథంలో పయనించవలసిన రాష్ర్టాన్ని ప్రస్తుత దుస్థితికి తీసుకొచ్చినందుకు జగన్‌ రెడ్డికి కదా బీపీ రావాల్సింది? జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోవడానికి ప్రతిపక్షాలతోపాటు మీడియా కారణం అని కూడా జగన్‌ నిందిస్తున్నారు. అస్తవ్యస్త విధానాలతో కక్షపూరితంగా పాలిస్తున్న జగన్‌ రెడ్డి కారణంగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం నిజం కాదా? తెలంగాణలో పెట్టుబడులు ప్రవహిస్తోంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖం చూడ్డానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదే! రాష్ట్రంలో రహదారుల దుస్థితి ఎలా ఉందో తెలియంది కాదు. మరమ్మతులకు టెండర్లు పిలుస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి మేం కారణం కాదు కదా? ఆర్థిక అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రం పరపతిని కొండెక్కించింది జగన్‌ రెడ్డి కాదా? సంక్షేమం పేరిట అప్పులు తెచ్చి పంచిపెట్టడమే తన గొప్పగా ముఖ్యమంత్రి చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమే అనుకుందాం! సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి కదా? రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపిస్తోందా? రాష్ట్రం మాత్రమే ఎందుకు అప్పులపాలవుతోంది? కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిన మాట నిజమే అయితే ఖర్చులు తగ్గించాలి కదా? జగన్‌ రెడ్డి సొంత కంపెనీల ఆదాయం మాత్రం పెరగడానికి కారణం ఏమిటి? ఈ మూడేళ్లలో జగన్‌ రెడ్డితో పాటు కొంత మంది ఆయన అనుచరుల ఆస్తులు పెరగలేదా? రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాలా తీయించి ప్రభుత్వ సంపద అయిన గనులను, ఇతర సహజ వనరులను చేజిక్కించుకుని జేబులు నింపుకోవడం గొప్ప పాలన అవుతుందా? ఇప్పటిదాకా ఎవరో నిర్వహిస్తూ వచ్చిన గనులను, కంపెనీలను మీరూ, మీ మనుషులూ సొంతం చేసుకుంటున్న విషయం నిజం కాదా? రాష్ర్టానికి రాజధాని లేకుండా చేసిన పాపానికి మీకు ఏ శిక్ష విధించాలి? అచ్చటా ముచ్చటా ఎరగని ఆలుమగలు 26 మంది పిల్లల్ని కన్నట్టుగా రాజధాని లేని రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటుచేసి అదే అభివృద్ధి అని జబ్బలు చరుచుకోవడాన్ని ఏమనాలి? అదేమని ఎవరైనా అంటే రాయలసీమకు సముద్రాన్ని తెచ్చామని, 26 జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల కర్నూలుకు, విశాఖకు మధ్య దూరం తగ్గిందని చెత్త ప్రచారం చేయించుకుంటున్న మిమ్మల్ని ఏమనాలి జగన్‌ రెడ్డి గారూ? అక్క చెల్లెమ్మలకు మేళ్లు చేస్తుంటే సహించలేక అసూయతో రగిలిపోతున్నామని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారే, మీరు చేస్తున్న అన్యాయాన్ని తలచుకొని రోదిస్తున్న మీ చెల్లి షర్మిల, డాక్టర్‌ సునీత పరిస్థితి ఏమిటి? మీ అక్కచెల్లెమ్మల జాబితాలో వారిద్దరూ లేరా? ఇది వంచన కాదా? మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచుతున్న మీరు.. మీ జీవితంలో ఒక్కరికైనా మీ జేబులోంచి తీసి ఆర్థిక సహాయం చేశారా? ప్రజలకు మజ్జిగ పోసి మీగడ తినడానికి అలవాటు పడిన మీకు రాష్ట్ర క్షేమం కోసం ఆలోచించే వాళ్లు రాక్షసులుగా కనిపించడంలో ఆశ్చర్యం ఏముంటుందిలే! ఆపదలో ఉన్న వారిని సొంత డబ్బుతో ఆదుకున్న చరిత్ర మీ తండ్రి రాజశేఖర రెడ్డికి ఉంది కానీ మీకు ఎందుకు లేదో చెప్పగలరా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజాధనాన్ని పథకాల పేరిట పంచిపెట్టడం ఘనకార్యం ఎలా అవుతుంది? పాత పథకాలకే పేర్లు మార్చి, పద్ధతి మార్చి చేస్తున్న పంపకాల విషయం పక్కన పెడితే... ఈ మూడేళ్లలో రాష్ర్టానికి మేలు చేసే ఒక్క పనంటే ఒక్క పని చేశామని చెప్పగలిగే స్థితిలో మీరు ఉన్నారా జగన్‌ రెడ్డీ? మీ పేటీఎం బ్యాచ్‌ వాడుతున్న భాషకు, మీరు వాడుతున్న భాషకు తేడా లేదు కదా! అంటే ఆ భాషను ఇప్పటిదాకా ప్రోత్సహించింది మీరేనని స్పష్టంకావడం లేదా? బూతుల మంత్రి కొడాలి నానితో రాజీనామా చేయించారు కనుక ఇప్పుడు మీరే స్వయంగా బూతు భాష వాడటానికి తెగబడ్డారన్న మాట! శభాష్‌!! నిరాశ నిస్పృహలు పేరుకుపోయినప్పుడే మనలోని నిజ స్వరూపం బయటకు వస్తుంది. ఇప్పుడు జగన్‌ రెడ్డి నిజ రూపం కూడా బయటకు వస్తోంది. మీ వెంట్రుకలను పీకడం మా పని కాదు. ప్రజలకు అండగా నిలబడటం, ప్రభుత్వ తప్పులను, వైఫల్యాలను ఎత్తిచూపడమే మా బాధ్యత. గుండెపోటు పేరిట మాపై కూడా గొడ్డళ్లను ప్రయోగించడానికి మీరు గానీ, మీ గుంపు గానీ సిద్ధపడినా మేం భయపడిపోం! రాష్ట్ర శ్రేయస్సు కోసం మేం చేస్తున్న యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. 


జవాబు చెప్పగలరా?

అధికార వికేంద్రీకరణ గురించి మాట్లాడే మీరు 15వ ఆర్థిక సంఘం స్థానిక పంచాయతీలకు కేటాయించిన నిధులను కూడా కాజేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు? మీకు అప్పులు పుట్టకపోవడానికి మేం కారణం కాదు కదా? మీ సొంత కంపెనీలకు లేని ఆర్థిక ఇబ్బందులు రాష్ర్టానికి మాత్రమే ఎందుకు వస్తున్నాయో జగన్‌ రెడ్డి చెప్పాలి కదా! ప్రభుత్వాన్ని అప్పులపాలు చేస్తున్నారు కానీ, మీ కంపెనీలను అప్పులపాలు చేయడం లేదు కదా? అంటే ఆర్థిక వ్యవహారాలు మీకు తెలియవని కాదు! రాష్ట్రం, -రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమైపోయినా ఫర్వాలేదు కానీ అధికారంలో ఉంటే చాలు అనే ఉద్దేశంతోనే కదా రాష్ర్టాన్ని మీరు దివాలా తీయిస్తున్నది! ప్రతిపక్షాల విషయం అటుంచితే... మీ సొంత పార్టీ వాళ్లు కూడా మీ పాలనను, మీ వ్యవహార శైలిని హర్షించలేకపోతున్నారే! 151 మంది సభ్యుల బలంతో అధికారంలోకి వచ్చిన మీకు అప్పుడే అసంతృప్తి సెగ తగలడం దేనికి సంకేతం? ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రతిపక్షాలకు, మీడియాకు కనిపించడం లేదని జగన్‌ రెడ్డి బాధపడిపోతున్నారు. నిజమే కాబోలు అనుకుందాం! మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. పంచిపెట్టడం మినహా నిర్మాణాత్మకమైన పని ఒక్కటైనా చేశామని మీరు కానీ, మీ వందిమాగధులు కానీ చెప్పగలరా? రాజకీయ పార్టీలు తప్పు చేసినా, మీడియా తప్పుదారిలో నడిచినా సరిదిద్దేది ప్రజలే! ఎవరి వెంట్రుకలను ఎవరు పీకుతారో కాలమే నిర్ణయిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా తనను విమర్శించిన మీడియా వారికి కరోనా సోకాలని శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు మీరు కూడా అదే బాటలో మాకు గుండెపోటు రావాలని కోరుకుంటున్నారు. నిరాశా నిస్పృహలతో ముఖ్యమంత్రిని అన్న విషయం కూడా మరచిపోయి నోరుపారేసుకుంటున్న మీరు... ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? మీరు చేస్తున్నది ఏమిటి? అని ఒక్కసారైనా ఆత్మపరిశీలన చేసుకోండి. కొన్ని మీడియా సంస్థలను పాదాక్రాంతం చేసుకోగలిగిన మీకు, మేం వారి బాటలోనే లొంగకపోవడం మింగుడు పడకపోవచ్చు. ఎవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం మేం ఆరాటపడుతున్నామని జగన్‌ అండ్‌ కో తరచుగా నిందిస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారని కాదు -ముఖ్యమంత్రిగా వచ్చిన వ్యక్తి రాష్ట్ర హితవు కోసం ఎలా పని చేస్తారన్నదే మాకు ముఖ్యం. ముఖ్యమంత్రిగా కాకపోయినా ఒక మనిషిగానైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తోంటే... ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఎందుకు వెనుకబడిపోయిందో ఆత్మపరిశీలన చేసుకోండి. రాష్ర్టానికి మేలు చేసే కార్యక్రమాలు చేపడితే మిమ్మల్ని కూడా అభినందిస్తాం. మీ పల్లకీని కూడా మోస్తాం. ఆ దిశగా ఆలోచన చేయకుండా కూలి మీడియా బాటలోనే మమ్మల్ని కూడా భజన చేయమంటే కుదరదుగాక కుదరదు. ప్రజాక్షేత్రంలో మీరు బలహీనపడుతున్న విషయం మీకు కూడా స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఇంత అసహనం! నిజానికి నిరాశ నిస్పృహలకు గురైన వారికే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగం ఒకటైతే మందు మరొకటి వేసుకోకూడదు. ఈ మాట జగన్‌ రెడ్డికే ఎక్కువ వర్తిస్తుంది. దిల్‌ రాజు నిర్మించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో రావు రమేశ్‌... హీరో వెంకటేష్‌ను ఉద్దేశించి ‘వాడినలా వదిలేయకండిరా!! ఎవరికైనా చూపించండి. లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుంది’ అని అంటాడు. వైసీపీ నాయకులు ఈ డైలాగ్‌ను గుర్తుతెచ్చుకొని రోగానికి తగిన మందు వేసుకోవాలి. లేకపోతే శాశ్వతం అనుకుంటున్న అధికారం చేజారిపోతే వారికే గుండెపోటు రావొచ్చు. రోగం ముదిరితే పీకే కుతంత్రాలు కూడా పనిచేయవు.


ఈ వివాదం అవాంఛనీయం..

ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం! కేసీఆర్‌ ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైకి మధ్య వివాదం ముదురు పాకానపడింది. తెలుగు ప్రజలు ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య వివాదాలను చూసి మూడున్నర దశాబ్దాలు దాటింది. మళ్లీ ఇంత కాలానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌భవన్‌తో తలపడుతున్నారు. నిజానికి ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి గవర్నర్లు కుముద్‌బెన్‌ జోషీ, రాంలాల్‌ సృష్టించిన చికాకులతో పోల్చితే... ఇప్పటి గవర్నర్‌ తమిళిసై.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది తక్కువే. అయినప్పటికీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు రాజ్‌భవన్‌తో కూడా తలపడుతున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వివాదం ఇప్పుడు బహిర్గతమైంది. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అన్న విషయం పక్కనపెడితే గవర్నర్‌ తమిళిసై విషయంలో కేసీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సమర్థనీయంగా లేదు. ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్‌ షాను కలసి తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... కేసీఆర్‌ వైఖరి తనను వ్యక్తిగతంగా బాధించిన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన తల్లి మరణిస్తే కూడా కేసీఆర్‌ ఫోన్‌ చేసి కనీసం సానుభూతి తెలుపలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా అభినందనలు తెలపడానికి తాను ఫోన్‌ చేసినా ముఖ్యమంత్రి అందుబాటులోకి రాలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఈ రెండూ నిజమైన పక్షంలో కేసీఆర్‌ వైఖరి ఆక్షేపణీయమే అవుతుంది. ఫోన్‌ చేసి పలకరించినంత మాత్రాన మృతి చెందిన గవర్నర్‌ తల్లి తిరిగి రారు. విభేదాలు ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి సందర్భాలలో రాజకీయ నాయకులు హుందాగా ప్రవర్తిస్తారు. తల్లిని కోల్పోయిన గవర్నర్‌ తమిళిసైని స్వయంగా వెళ్లి పరామర్శించడం ముఖ్యమంత్రి కనీస ధర్మం. అలా చేయకపోవడం కేసీఆర్‌ తప్పే అవుతుంది. రాజకీయ విభేదాలను చావుల దాకా తీసుకెళ్లకూడదు. బర్త్‌డే గ్రీటింగ్స్‌ చెప్పడానికి గవర్నర్‌ ప్రయత్నించినప్పుడు కేసీఆర్‌ అందుబాటులోకి వెళ్లకపోవడం మంచిది కాదు. కేసీఆర్‌ ఆగ్రహానికి, అనుగ్రహానికి హద్దులు ఉండని మాట నిజమే కానీ, ఈ రెండు సందర్భాలలో ఆయన ప్రవర్తన ఆక్షేపణీయమేనని చెప్పక తప్పదు. గవర్నర్‌ కోటాలో కౌశిక్‌ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయడానికి తమిళిసై నిరాకరించినంత మాత్రాన ఇంతగా కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ఉగాది ఉత్సవాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను వెళ్లనివ్వకపోవడం, యాదాద్రి దేవస్థానానికి వెళ్లినప్పుడు కనీసం ఈవో కూడా స్వాగతం పలకకపోవడం రాష్ర్టానికి శోభనివ్వదు. రాష్ట్రంలో డ్రగ్స్‌ సంస్కృతి పెరిగిపోయిందని కేంద్రానికి గవర్నర్‌ ఫిర్యాదు చేయడం కూడా సమంజసంగా లేదు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తారని ఎవరు ఆరోపించినా దాన్ని సమర్థించలేం. వ్యక్తిగతంగా కేసీఆర్‌లో సవాలక్ష అవలక్షణాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే ఏ పని కూడా ఆయన చేయరు.


డ్రగ్స్‌ విషయంలో జాగ్రత్త!

మాదక ద్రవ్యాల వినియోగం హైదరాబాద్‌కు బెడదగా మారుతున్న విషయం కూడా వాస్తవమే. దేశంలోని మిగతా నగరాలతో పోల్చితే వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో ప్రభుత్వానికే కాదు- వ్యక్తుల ఆదాయం కూడా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. సునాయాసంగా డబ్బు వచ్చి పడుతుండటంతో యువత దుర్వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ సంస్కృతి ప్రవేశించింది. దీన్ని ప్రారంభంలోనే అరికట్టడానికి గట్టి కృషి చేయాలి. లేని పక్షంలో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుంది. ఇటీవలే ఒక పబ్‌పై పోలీసులు జరిపిన దాడి తర్వాత డ్రగ్స్‌ వాడకం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి దాటినా పబ్‌లను అనుమతించడం, వాటిపై నియంత్రణ లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో డ్రగ్స్‌ వాడకంలో సినిమా వాళ్లకు సంబంధం ఉందని ఆరోపణలు వచ్చినప్పుడే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉండవలసింది. ఇప్పుడు తాజా సంఘటనలోనైనా కఠినంగా వ్యవహరించాలి. లేనిపక్షంలో ‘పోలీసులు దాడి చేసినప్పుడు పబ్‌లో మేం 156 మందిమి ఉన్నాం. 155 మందిమి ఉగాది పచ్చడి తినడానికి వెళ్లాం. మిగిలిన ఒక్కడూ ఉగాది పచ్చడి తయారుచేయడానికి వచ్చాడు’ అని సోషల్‌ మీడియాలో జరుగుతున్న వ్యంగ్య ప్రచారం నిజం అవుతుంది. తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్‌లో కూడా డ్రగ్స్‌ వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా అప్రమత్తం కావాలి. తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదో చెదురుమదురుగా జరుగుతున్న సంఘటనల ఆధారంగా హైదరాబాద్‌ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని నిందించడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది. 


ఇప్పుడు ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య మొదలైన యుద్ధం విషయానికి మళ్లీ వద్దాం! ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన గవర్నర్‌ తమిళిసైకి ప్రధాని, హోం మంత్రి ఏమి దిశానిర్దేశం చేశారో తెలియదు. ఆ ఇరువురినీ కలిశాకే రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని తమిళిసై చేశారు. ఏదేమైనా కేంద్రంపై కేసీఆర్‌ ప్రకటించిన యుద్ధం ఏ మలుపులు తీసుకుంటుంది? అన్న ఆసక్తి సర్వత్రా వ్యాపించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన కొన్ని బృందాలు హైదరాబాద్‌ చేరుకున్నాయని శుక్రవారం నుంచి ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోలికి వెళ్లకుండా ఆయన చుట్టూ ఉండే ముఖ్యులను టార్గెట్‌ చేయబోతున్నారని, వారి లొసుగులను ఇప్పటికే సేకరించారని చెబుతున్నారు. అదే నిజమైతే కేసీఆర్‌కు, బీజేపీకి మధ్యలో మొదలైన ఆటలో కొందరు బలిపశువులవుతారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కూడా ఒక వాస్తవాన్ని గుర్తించాలి. గతంలో కేంద్రంతో గొడవపెట్టుకున్న చంద్రబాబు నాయుడు రాజకీయంగా నష్టపోయారు. మోదీ-–షా ద్వయం ఇప్పటికీ బలంగానే ఉన్నందున వారిని ఢీకొనడం ద్వారా కేసీఆర్‌ సాధించేది ఏమీ ఉండదు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు దెబ్బతింటే దాని ప్రభావం రాష్ట్రంపై పడుతుంది. అభివృద్ధిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ర్టానికి అది మంచిది కాదు. రెండు పార్టీల మధ్య మొదలైన రాజకీయ పోరు రెండు ప్రభుత్వాల మధ్య పోరుగా మారకూడదు. గవర్నర్‌ను వ్యక్తిగతంగా కించపరచడం కూడా మంచిది కాదు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ కొంత సంయమనం పాటించడం తెలంగాణ రాష్ర్టానికి మంచిది!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-04-10T06:11:05+05:30 IST