అత్యాచార చట్టాల కన్నా,చట్టబద్ధ పాలన ముఖ్యం!

ABN , First Publish Date - 2021-07-17T05:43:18+05:30 IST

మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం దిశచట్టం పేరుతో 2019 డిసెంబరులో బిల్లు రూపొందించి, కేంద్రప్రభుత్వానికి పంపటమూ, లోపాలను దిద్ది మళ్ళీ పంపాలని కేంద్రం కోరడమూ అందరికీ....

అత్యాచార చట్టాల కన్నా,చట్టబద్ధ పాలన ముఖ్యం!

మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం దిశచట్టం పేరుతో 2019 డిసెంబరులో బిల్లు రూపొందించి, కేంద్రప్రభుత్వానికి పంపటమూ, లోపాలను దిద్ది మళ్ళీ పంపాలని కేంద్రం కోరడమూ అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లను, దానికి కొనసాగింపుగా ఈ ఏడాది జూన్ 29న దిశ యాప్‌ను కూడా ప్రారంభించారు. దిశ చట్టం ప్రకారం 14 రోజుల్లోపే విచారణ పూర్తయి 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడుతుంది. అయితే ఈ చట్టం వచ్చిన తరువాత కూడా రాష్ట్రంలో అనేక అత్యాచార ఘటనలు జరిగాయి.


జూన్ 19న ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలో కాబోయే భర్తతో కలిసి షికారుకు వెళ్లిన యువతిపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన మన వ్యవస్థలోని లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఈ చట్టాలు, యాప్‌లు భరోసాను ఇవ్వగలవేమోగానీ, భద్రతను ఇవ్వగలవా అన్నది ప్రశ్నార్థకమే. నిర్భయలాంటి చట్టాలతో పాటు, రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్లు, దిశ చట్టం అమలును పర్యవేక్షించేందుకు ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు, ఎంతోమంది బలగమూ ఉన్నప్పటికీ అత్యాచారాలు ఎందుకు ఆగడం లేదు?  


పోలీసులను, ప్రాసిక్యూషన్‌ను రాజకీయ నేతలు గుప్పెట్లో పెట్టుకుని అధికారం చెలాయిస్తుండడం వల్లనే సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా మారింది. మద్యాన్ని విచ్చలవిడిగా పారించడం కూడా లైంగిక అత్యాచారాలు పెచ్చుమీరటానికి ముఖ్య కారణం. దశల వారీగా మద్యనియంత్రణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వమే మద్యం దుకాణాలను తన ఆధీనంలో పెట్టుకుని ధరలు పెంచి మరీ అమ్మటం విడ్డూరం. అత్తెసరు చదువులు, అందుబాటులో మద్యం, ఉచితంగా స్మార్ట్ ఫోన్, పనిచేయకపోయినా ఏదో రూపంలో అందుతున్న నగదు... ఇంతకంటే అత్యాచారాలకు అనుకూలమైన పరిస్థితులు ఏ సమాజంలోనైనా ఏముంటాయి?


రాష్ట్రంలో అత్యాచారాలను నిరోధించాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే, ముందు చట్టబద్ధ పాలనకు ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఏ స్థాయి నేరస్థుడిపైన అయినా వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి. కేసు దర్యాప్తు చేసే పోలీసులపై రాజకీయ పెత్తనం లేకుండా చట్టపరమైన మార్పుల్ని చేయాలి. పోలీసు సంస్కరణలంటే... డీజీపీ నియామకం ఎలా, ఎవరు చేయాలి అన్న నిబంధనలను మార్చడం కాదు. పోలీసులు సమర్థవంతంగా, జవాబుదారీతనంతో, ప్రజల పట్ల సేవాభావంతో పనిచేసేలా డిపార్ట్‌మెంటును తీర్చిదిద్దడం. దీనితోపాటు జిల్లాల్లోని పోలీసు యంత్రాంగంపై అజమాయిషీని స్థానిక శాసనసభ్యులు, అధికారపార్టీ నాయకుల చేతుల్లో కాకుండా ఆయా జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) అధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పోలీసులు స్థానికంగా కమ్యూనిటీలతో కలిసి పనిచేసేలా ఉండాలి. ఇందుకోసం స్థానిక ప్రభుత్వాలను పటిష్టం చేయాలి.


స్థానిక న్యాయస్థానాలు ఉన్నట్లయితే పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన అనేక కేసులు తేలిగ్గా పరిష్కారం కావడంతో పాటు ఈవ్ టీజింగ్ దశలోనే మహిళలపై దౌర్జన్యాలకు తెరపడి అత్యాచారాలు తగ్గుతాయి. తెలిసీ తెలియని వయస్సులో చేసిన చిన్నపాటి తప్పులకి చిన్నపాటి శిక్షలు విధించేలా చర్యలు చేపడితే అంతకు మించి పెద్ద తప్పులు చేయడానికి యువత ధైర్యం చేయదు.  


కూసంపూడి శ్రీనివాస్

Updated Date - 2021-07-17T05:43:18+05:30 IST