శిథిల వంతెన.. రవాణా వేదన!

ABN , First Publish Date - 2022-08-13T05:51:06+05:30 IST

పాడి-రత్నంపేట మార్గంలో వంతెన శిథిలమైంది. భారీ వర్షాలతో వరద ఉధృతికి కుంగిపోయింది. ప్రయాణానికి ఏమాత్రం అవకాశం లేని విధంగా తయారైంది. విషయం తెలిసినా అధికార యంత్రాంగం తమ పని కాదన్నట్టు గాలికొదిలేసింది. ఫలితంగా మండలంలోని 15 గ్రామాల ప్రజలు ఈ రహ‘దారి’లో రవాణాకు ప్రత్యక్ష నరకం చవిచూడాల్సి వస్తోంది.

శిథిల వంతెన.. రవాణా వేదన!
పాడి-రత్నంపేట ప్రధాన రహదారిలోని కొండవాగుపై పూర్తిగా కుంగిపోయిన వంతెన

పాడి-రత్నంపేట మార్గంలో కుంగిన వంతెన

15 గ్రామాల ప్రజలు రాకపోకలకు అగచాట్లు

ప్రత్యక్ష నరకం చూస్తున్న వాహన చోదకులు

వంతెన పునర్నిర్మాణం.. హామీలకే పరిమితం

పట్టించుకోని అధికారులు, పాలకులు


పాడి-రత్నంపేట మార్గంలో వంతెన శిథిలమైంది. భారీ వర్షాలతో వరద ఉధృతికి కుంగిపోయింది. ప్రయాణానికి ఏమాత్రం అవకాశం లేని విధంగా తయారైంది. విషయం తెలిసినా అధికార యంత్రాంగం తమ పని కాదన్నట్టు గాలికొదిలేసింది. ఫలితంగా మండలంలోని 15 గ్రామాల ప్రజలు ఈ రహ‘దారి’లో రవాణాకు ప్రత్యక్ష నరకం చవిచూడాల్సి వస్తోంది. అయినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో రాకపోకలు సాగిస్తూ ఎప్పుడు ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని మనోవేదన అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది.


కొయ్యూరు ఆగస్టు 12: కృష్ణాదేవీపేట నుంచి రత్నంపేట, పాడి మీదుగా కన్నంపేట గ్రామాన్ని కలిపే పాడి-రత్నంపేట ప్రధాన రహదారి బాలారం, కంఠారం తదితర 15 గ్రామాల ప్రజల రవాణా ఆధార మవుతోంది. అత్యవసర పనులకు కృష్ణాదేవిపేట రావాలంటే ఈ మార్గం వల్ల సుమారు పది కిలోమీటర్లు కలసివచ్చేది. అలాగే ప్రయాణం సులభమయ్యేది. అయితే ఈ రహదారిలో పాడి దాటాక తాండవ రిజర్వాయర్‌ ఇన్‌ప్లో అయిన కొండకాలువ భారీ వర్షాలకు పొంగి ప్రవహించంతో వంతెన శిథిలమైంది. దీంతో ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగించడం ప్రమాదకరంగా పరిణమిం చింది. ద్విచక్ర వాహనం సైతం తిరిగేందుకు అవకాశం లేకపోతోంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లో ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. 

గత ఏడాది కురిసిన వర్షాలకు ఈ వంతెన దెబ్బతినగా, పాడి తదితర గ్రామాల వారు తాత్కాలికంగా మరమ్మతు చేసుకున్నారు. రాకపోకలు అనువుగా మార్చుకున్నారు. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నాలుగు ఖానాలపై సిమెంట్‌ కాంక్రీట్‌ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఫలితంగా ఈ వంతెన మీదుగా ప్రయాణం కష్టతరమైంది. దీంతో అత్యవసర పనులకు విఘాతం ఏర్పడుతున్నదని, తప్పనిసరి పరిస్థితుల్లో ద్విచక్ర వాహన రాకపోకలకు వీలుగా శ్రమదానంతో స్వల్ప మరమ్మతులు చేసుకున్నామని, అయినప్పటికీ భయంభయంగానే రాకపోకలు సాగిస్తున్నామని ఆయా గ్రామాలు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఈ వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్టు పాలకులు ప్రకటించారు తప్పితే పనులు ప్రారంభించలేదని, ఈ వంతెన ఎన్నికల హామీగానే మిగిలిందని వారు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి వంతెన నిర్మాణానికి తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని 15 గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వేడుకున్నారు.

Updated Date - 2022-08-13T05:51:06+05:30 IST