Abn logo
Jan 25 2021 @ 00:49AM

ఆనాటి ఉద్యమ ప్రకంపనాల్నినమోదు చేసిన రుద్రశ్రీ

రుద్రశ్రీ తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ‘జనని’ కవితా సంకలనం రూపంలో రికార్డు చేయడం ఆనాడు చాలా చిన్న విషయమే కావచ్చు కాని అది ఇవాళ చారిత్రాత్మకంగా చాలా పెద్ద పనిగా మిగిలిపోయింది. ఆనాటి ఉద్యమ తీవ్రతను, ప్రజల ఆకాంక్షను, ఆనాటికే తెలంగాణ నినాదాన్ని నెత్తికెత్తుకున్న కవుల గొంతును వినిపించిన ఈ సంకలనం ఉద్యమ చరిత్ర నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుంది. 


తొలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో ఆనాటి ప్రధాన స్రవంతి రచయితలంతా స్వార్థ ప్రయో జనాల కోసం ప్రాకులాడి ప్రజా ఉద్యమాన్ని సమర్థించకుండా సమైక్యరాగాలు ఆలపిస్తే అనామకు లైన ఎంతోమంది విద్యార్థులు, అప్పుడప్పుడే ఎదుగు తున్న కొందరు కవులు ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేశారు. ఆ కాలంలోనే జనగామ నుంచి రుద్రశ్రీ, వెన్నెల సంకలనకర్తలుగా ‘జనని’ తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం (1969) వెలువడింది. ఈ సంకలనం చాలారోజులు అలభ్యం. 2019లో తెలంగాణ సాహిత్య అకాడమి దీన్ని సేకరించి పునర్ముద్రించింది. ఈ సంకలనకర్తల్లో ఒకరైన రుద్రశ్రీ అసలు పేరు చిట్టిమల్లె శంకరయ్య. ‘రుద్రశ్రీ’ కలం పేరు. ఈయన ఈ జనవరి 15న అనారోగ్యంతో మృతి చెందారు.


మధ్యతరగతి చేనేత కుటుంబానికి చెందిన రుద్రశ్రీ 15 ఏప్రిల్‌ 1934న జనగామలోని చిట్టిమల్లె వెంక టయ్య, మహాలక్ష్మి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను జనగామలో, ఉన్నత విద్యను హన్మకొండలో, స్నాతకోత్తర విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తిచేసి 1972 నుండి జనగామలోని ఆంధ్రభాషాభి వర్ధిని డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేసి 1996లో పదవీ విరమణ పొందారు. తండ్రి ద్వారా వారసత్వంగా లభించిన ఆయుర్వేద వృత్తిని కొన్నాళ్లు చేసి ఆ అనుభవంతోనే ‘తెలుగు సాహిత్యంలో దేశీయ వైద్యం’ అంశంపై ఎంఫిల్‌ చేశారు. ‘ఆంధ్రసాహి త్యంలో ఆయుర్వేదం’ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.డి. పట్టా పొందారు. ఇరవై ఏళ్ల వయసులో అంటే 1954లోనే భావకవిగా మొదలైన రుద్రశ్రీ ‘అరాత్రికం’, ‘ఇంద్ర చాపం’ ‘విశ్వసుందరి’, ‘బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌’, ‘అమృత బిందువు’, ‘రూపాయి ఆత్మకథ’, ‘ప్రేమ గజళ్లు’ అనే కవితా సంపుటాలతో పాటు ‘పంచామృతం’ అనే గేయ నాటికలను వెలువరించారు. అనంతరం వివిధ సాహిత్య ఉద్యమాలతో ప్రభావితులై అభ్యుదయ కవిగా మారిపోయారు. ఈ అభ్యుదయ దృక్పథమే వీరిని తెలంగాణ ఉద్యమంవైపు మలుపు తిప్పింది. అందుకే తాను స్వయంగా కొన్ని ఉద్యమ కవితల్ని రాయడంతో పాటు మరికొంతమందితో రాయించి, అప్పటికే రచ యితలుగా గుర్తింపు పొందిన కొంతమంది కవితల్ని సేకరించి 1969లో స్థాపించిన ‘జనని సాహితి’ సంస్థ నుండి ‘జనని’ పేరుతోనే కవితా సంకలనాన్ని తీసు కొచ్చారు. ఈ సాహితీ సంస్థ ముద్రించిన పుస్తకాల్లో ఇదే మొదటిది. అందులో ‘‘ఏదేని హృదయాన్ని కదిలించే సంఘటన జరిగినప్పుడు సహృదయుడు ఊర్కొనలేడు. అందులో రచయిత చూస్తూ ఉండ బోడు. అతని హృదయ ఫలకంపై ప్రతిబింబించిన సంఘటనకు ప్రేరితుడై అక్షరాకృతిలో మలచి ఇవ్వక మానడు.’’ అని ‘జనని’ కవితా సంకలనం వెనకగ కవుల ఉద్దేశ్యాన్ని పేర్కొన్నారు.  


‘జనని’ కవితా సంకలనంలో గల మొత్తం 36 కవితల్లో పద్దెనిమిది కవితలు కాళోజీవే ఉన్నాయి. మిగతా పద్దెనిమిది ఇతర కవులవి. అందులో ‘నేను తెలంగాణ పౌరున్ని’, ‘ప్రజాస్వామ్య పాలనలో’, ‘జై తెలంగాణ అనండి’ అనే మూడు కవితలు రుద్రశ్రీ రాసినవి. ఈ మూడు కవితల్లోనూ ఆనాటి ఉద్యమ ‘ఉడుకు’ను ప్రతి అక్షరంలో తొడిగి చూపించారు. అన్నా అని నమ్మితే నమ్మించి మోసం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పాలనలో మనిషి మనిషిగా బ్రతకడానికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, కంపు లేని గాలి, మనసుకు ఇంపగు నీరు కావాలని ఆకాంక్షించారు. ఈ మాత్రమైనా తెలంగాణ ప్రజాళి నోచుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన తప్పనిసరి అని, అందుకోసం ప్రతి తెలంగాణ బిడ్డ, ఊరు, ఏరు కదలి రావాలని, తెలంగాణ విముక్తికి వీరోచిత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.


‘‘సౌహార్ధం ఇంకక ముందే/ సౌమనస్యం ప్రిదలక ముందే/ శాంతమ్మ రక్కసి కాకముందే/ మానవతా సురభిళం దుర్గంధం కాకముందే/ మంచి అనే కాగడా వెలుగులో/ శాశ్విత పరిష్కారమేమిటో/ సమాలో చించు త్వరగా/ అన్నా! అన్నా!/ ఓ అన్నా! అన్నా!’’ 


- అని తెలంగాణ ఉద్యమానికి మూలకారణాలేమిటో ఆలోచించి తొందరగా శాశ్వత పరిష్కారం కనుగొను మని లేకుంటే ఏం చేయాలో జనానికి బాగా తెలుసని హెచ్చరించారు. అగ్నిజ్వాల ఎగియక ముందే, ఇద్దరి మధ్య స్నేహం చెడక ముందే తగిన పరిష్కారం చూపా లని విన్నవించారు. అయినా జరిగిందేమిటో మనకు తెలుసు. బుజ్జగింపు మాటలతోని, పోలీసు ఇనుప బూట్లతోని తెలంగాణ ఉద్యమాన్ని అణచివేశారు. ఈ తతంగాన్నంతా నిరసిస్తారు ఈ మూడు కవితల్లో. 


తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ‘జనని’ కవితా సంకలనం రూపంలో రికార్డు చేయడం ఆనాడు అది చాలా చిన్న విషయమే కావచ్చు కాని అది ఇవాళ చారిత్రాత్మకంగా చాలా పెద్ద పనిగా మిగిలిపోయింది. ఆనాటి ఉద్యమ తీవ్రతను, ప్రజల ఆకాంక్షను, ఆనాటికే తెలంగాణ నినాదాన్ని నెత్తికెత్తుకున్న కవుల గొంతును వినిపించిన ఈ సంకలనం ఉద్యమ చరిత్ర నిర్మాణా నికి ఎంతో ఉపయోగపడుతుంది. రుద్రశ్రీ సాహిత్యా న్నంతా ఒక సమగ్ర సంకలనంగా ముద్రిస్తే ఆయన ఈనాటి తరాలకు కూడా పరిచయం అవుతారు. తాను సాహిత్యానికి ఆయన చేర్పేమిటో కూడా తెలుస్తుంది.

వెల్దండి శ్రీధర్‌

98669 77741


Advertisement
Advertisement
Advertisement