అనుగ్రహానికి ఆలంబన

ABN , First Publish Date - 2021-02-05T05:34:56+05:30 IST

ఈ విశ్వంలో ప్రతి పదార్థానికీ కొన్ని విశిష్టమైన ప్రకంపనలు ఉంటాయి. మన జీవితంలోని వివిధ దశల్లో చేసే ప్రయాణానికి అవి దోహదం చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో రుద్రాక్ష అటువంటి దోహదకారి.

అనుగ్రహానికి ఆలంబన

ఈ విశ్వంలో ప్రతి పదార్థానికీ కొన్ని విశిష్టమైన ప్రకంపనలు ఉంటాయి. మన జీవితంలోని వివిధ దశల్లో చేసే ప్రయాణానికి అవి దోహదం చేస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో రుద్రాక్ష అటువంటి దోహదకారి.


రుద్రాక్ష... ఎలిఒకర్‌ గనిట్రాస్‌ అనే చెట్టు తాలూకు విత్తనం. రుద్రాక్షలు పర్వతాల మీద, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాలలో కొంత ఎత్తులో పెరిగే ఆ చెట్టు గింజలు. అవి ఇంకా అనేక ఇతర ప్రాంతాలలో, పశ్చిమ కనుమలలో కూడా పెరుగుతాయి. కానీ నాణ్యమైనవి ఎత్తైన హిమాలయ ప్రాంతంలోనే లభిస్తాయి. అక్కడ నేలా, వాతావరణం లాంటి అంశాలు దీనికి కారణం. ఈ విత్తనాలకు ఒక విశిష్టమైన ప్రకంపన ఉంటుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు. విత్తనం ఎంత చిన్నదైతే ప్రకంపన అంత బాగా ఉంటుంది. రుద్రాక్ష సాధకుడి జీవితం లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.


మన ప్రపంచంలో రకరకాల మొక్కలు, పుష్పాలు, జంతువులు ఉన్నాయి. వాటిలో మనల్ని ఆధ్యాత్మికత దిశగా కొన్ని తీసుకువెళ్ళగలవు, కొన్ని తీసుకువెళ్ళలేవు. ఒక గొర్రెను ఉదాహరణగా తీసుకుంటే, అది ఆధ్యాత్మిక సాధనలో పనికొచ్చే జంతువు కాదు. ఎద్దు, పాము, నెమలి లాంటివి పనికొస్తాయి. ఆ ప్రాణులలో ఒక విధమైన సూక్ష్మగ్రాహ్యత ఉండడమే దీనికి కారణం. పూలలో కూడా కొన్నిటిని పవిత్రమైనవిగా గుర్తింపు పొందాయి. ఒక పుష్పం శివుడికి చాలా ప్రీతి అనీ, మరొకటి మహా విష్ణువుకు ఇష్టమనీ పెద్దలు చెప్పడం మనం వింటూ ఉంటాం. అంటే శివుడుగానో, విష్ణువుగానో, మరో పేరుతోనో ప్రస్తావించుకొనే దైవతత్త్వాలకు ఆ పుష్పాల ప్రకంపనలు చాలా సన్నిహితంగా ఉంటాయని వారు గుర్తించారన్నమాట. అందుకే దేవాలయాలలో కొన్ని పుష్పాలను మాత్రమే దైవానికి సమర్పిస్తారు. 


అలాగే రుద్రాక్ష అతి విశిష్టమైన ప్రకంపనలు గల పదార్థాలలో ఒకటి. రుద్రాక్షను కేవలం చేతిలో ఉంచి చూసినా ఈ ప్రత్యేకతను గమనించవచ్చు. ఎవరైనా రుద్రాక్షను మూడు నుంచి ఆరునెలలు ధరిస్తే... ఆ వ్యక్తి శరీరంతో దానికి ఒక సంబంధం ఏర్పడిపోతుంది. కాబట్టి, వేర్వేరు వ్యక్తులు ధరించే రుద్రాక్షలు వేర్వేరుగా ఉంటాయి. అందుకనే ఒకరి రుద్రాక్షను మరొకరికి ఇవ్వకూడదు. వేరొకరి రుద్రాక్షను తీసుకోకూడదు. ఎందుకంటే వారికే అనువైన, అనుకూలమైన కొన్ని ప్రకంపనలు దానిలో ఏర్పడి ఉంటాయి. 

ఇదేమీ వింతైన విషయం కాదు. చాలా ప్రాంతాలలో ఉప్పు, నువ్వులు, నూనె ఒకరి చేతి నుంచి మరొకరు తీసుకోరు. అలాగే నిమ్మకాయలు కూడా! ఎందుకంటే కొన్ని పదార్థాలను ముట్టుకోగానే ఇతర పదార్థాల ప్రకంపనలను త్వరగా రాబట్టగలవు. రుద్రాక్షకు కూడా ఈ గుణం ఉంది. ఒకటి రెండేళ్ళపాటు... రోజుకు ఇరవై నాలుగు గంటలూ విడవకకుండా ధరించారనుకోండి. ఎప్పుడైనా ఒక రోజు దాన్ని తీసి నిద్రపోవడానికి ప్రయత్నిస్తే నిద్ర పట్టదు. అది ధరించేవారి శరీరంలో ఒక భాగంగా మారిపోతుంది. అది శరీరంలో ఒక అవయవంలా పని చేస్తుంది. ఈ అదనపు అవయవం వల్ల ప్రధానమైన ప్రయోజనం... మిమ్మల్ని దివ్యానుగ్రహప్రాప్తికి సన్నద్ధులుగా చేయడం.


రుద్రాక్షల ప్రకంపనలు మీ శక్తినే ఒక కవచంలా తయారుచేస్తాయి. వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా నిరోధిస్తాయి. మనం ఒక కొత్త చోటుకు వెళ్ళినప్పుడు, కొన్ని సార్లు నిద్రలోకి తేలికగా జారిపోతాం. మరి కొన్ని చోట్ల, మనకు ఎంత అలసట ఉన్నా నిద్ర రాదు. అంటే ఆ పరిసరాల్లోని స్థితి మనలోని శక్తికి అనుకూలమైనది కాదన్నమాట. అందుకే అది మనల్ని అక్కడ విశ్రమించనివ్వదు. ఒకే చోట రెండవసారి నిద్రించకూడదన్నది సాధువులకూ, సన్న్యాసులకూ ఉన్న నియమాలలో ఒకటి. వారు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. వారు విశ్రమించే చోట పరిసరాలూ, పరిస్థితులూ బాధించవచ్చు. అందుకే వారు ఎప్పుడూ రుద్రాక్షలు ధరిస్తారు. ఈ రోజుల్లో మళ్ళీ ప్రజలు వృత్తి రీత్యా, వ్యాపారాల రీత్యా వివిధ ప్రదేశాలకు వెళుతున్నారు. అక్కడ తింటున్నారు, నిద్ర పోతున్నారు. ఎప్పుడూ ఒకే చోట ఉండేవారికి ఆ ప్రదేశంతో ఒక విధమైన ‘గూడు’ ఏర్పడుతుంది. అనేక చోట్ల తినేవారికీ, నిద్రించేవారికీ... వారి శక్తితోనే ఒక గూటిని రుద్రాక్ష ఏర్పరుస్తుంది. అందుకే రుద్రాక్షలు ఎప్పుడూ ఒకే చోట ఉండకుండా తిరిగేవారికీ, వేరు వేరు చోట్ల తినేవారికీ వారికి చాలా ఉపయోగకరం. రుద్రాక్ష వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. అది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 


ఎవరు ఎలాంటి యోగసాధనలు చేసినా, మరేది చేసినా... సాధించాలనుకొనేదీ, సాధించగలిగేదీ దివ్యానుగ్రహ ప్రాప్తి ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టే భక్తులకు వారి లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఎందుకంటే వారు తమనుతాము సమర్పించుకొనే బుద్ధితో ఉంటారు. ఆ భావన లేకపోతే యోగసాధనలు ఉత్త సర్కస్‌ విన్యాసాలుగా మిగిలిపోతాయి. జీవితంలోని ఏ విషయంలోనయినా - అది ఆధ్యాత్మిక ప్రక్రియ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, మరే విషయమైనా కావచ్చు... విజయం  సాధించాలంటే దివ్యానుగ్రహం పొందడానికి సన్నద్ధులుగా ఉండాలి. లేకపోతే విజయం సాధ్యం కాదు. ఎంతో కొంత దివ్యానుగ్రహం లేకుండా... మనిషే కాదు, ఏ ప్రాణీ జీవంతో ఉండడం అసాధ్యం. కాబట్టి ఆ దివ్యానుగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా జీవితంలో భాగం చేసుకోగలిగితే... మిగిలినదంతా సవ్యంగా జరిగిపోతుంది. కందెన నూనె వేసి చక్కబరచిన యంత్రంలా  జీవితం సజావుగా సాగుతుంది. అలా జరగడానికి రుద్రాక్ష దోహదం చేస్తుంది. లౌకికంగానైనా, ఆధ్యాత్మికంగానైనా జీవితంలో ఒక అత్యున్నత స్థితికి చేరుకోవాలంటే మనకు లభ్యమయ్యే అన్ని ఆలంబనలనూ, ఆధారాలనూ వినియోగించుకోవాలి.


సద్గురు జగ్గీవాసుదేవ్‌



రుద్రాక్షలు ప్రత్యేకమైన ప్రకంపనలు కలిగి ఉంటాయి. ఆ ప్రకంపనలు మన శక్తినే ఒక కవచంలా తయారుచేస్తాయి. వేరే శక్తులు మనల్ని కలత పెట్టకుండా నిరోధిస్తాయి.

Updated Date - 2021-02-05T05:34:56+05:30 IST