రబ్బరు చెప్పులు కూడా లేనోళ్లు.. రాహుల్‌ గురించి మాట్లాడతారా..?

ABN , First Publish Date - 2022-05-02T10:06:27+05:30 IST

రబ్బరు చెప్పులు కూడా లేనోళ్లు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడతారా..

రబ్బరు చెప్పులు కూడా లేనోళ్లు.. రాహుల్‌ గురించి మాట్లాడతారా..?

  • వారిని ప్రజలు చెప్పులతో కొట్టాలి
  • రాహుల్‌ ఓయూకు వస్తానంటే కేసీఆర్‌కు ఎందుకంత భయం..?
  • తెలంగాణ ఇచ్చిన నేతను అడ్డుకుంటారా.. సీఎం భోగాలు కాంగ్రెస్‌ భిక్ష
  • ఎన్‌ఎస్‌యూఐ నేతల్ని విడుదల చేయకుంటే టీఆర్‌ఎస్‌ నేతలను తిరగనివ్వం
  • నేడు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ 


హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): రబ్బరు చెప్పులు కూడా లేనోళ్లు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడతారా..? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ ఓయూ పర్యటన విషయంలో.. టీఆర్‌ఎ్‌సలోని కొందరు బానిసలు మాట్లాడే మాటలపై తాను మాట్లాడబోనన్నారు. వారిని అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం చెప్పులతో కొట్టాలని పిలుపునిచ్చారు. రాహుల్‌ గాంధీ.. ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించడం నేరమా..? అని రేవంత్‌ ప్రశ్నించారు. ఆయన ఓయూకు వస్తానంటే సీఎం కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. తెలంగాణ ఇచ్చిన నాయకుడిని ఇంత దుర్మార్గంగా అడ్డుకోవడం ఎందుకని మండిపడ్డారు. నేడు కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌, సోనియా గాంధీ పెట్టిన భిక్షేనని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ఓయూ పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు.. ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడు వెంకట్‌తోపాటు 18 మంది విద్యార్థి నాయకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు మోపి, జైలులో పెట్టడం అప్రజాస్వామికమన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని, లేకుంటే టీఆర్‌ఎస్‌ నాయకులను బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఎన్‌ఎ్‌సయూఐ నేతల అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేయాలని ఎన్‌ఎ్‌సయూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నేతలకు రేవంత్‌ పిలుపునిచ్చారు. విద్యార్థి నేతలను పరామర్శించడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.  


జగ్గారెడ్డి అరెస్టును ఖండించిన భట్టి.. 

ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. జగ్గారెడ్డిని కస్టడీలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఓయూలో రాహుల్‌ పర్యటనకు అనుమతినివ్వాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎన్‌ఎ్‌సయూఐ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌ నిషేధిత సంస్థకు చెందిన నేత కాదని, టీఆర్‌ఎస్‌ సర్కారుకు భయమెందుకని కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ ప్ర శ్నించారు. కాగా, కాంగ్రెస్‌ ప్రధాన మంత్రులు ప్రైవేటు కంపెనీలను ప్రభుత్వ పరం చేస్తే, మోదీ కేంద్ర ప్ర భుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఆదివారం మే డే సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో ఐఎన్‌టీయూసీ జెండాను ఎగురవేశారు.  


అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసులు

ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దామోదర్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలపై విమర్శలు చేసిన అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్‌ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. వారంలోగా నోటీసులకు జవాబివ్వాలని కోరింది. ఇక జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేసిన మదన్‌ మోహన్‌ తన పరిధిలో చేసే కార్యక్రమాలను పార్టీ పేరుతో నిర్వహించడం లేదని, దీనిపై ఆయనకు లేఖ రాయాలని క్రమ శిక్షణ సంఘం నిర్ణయించింది.  

Updated Date - 2022-05-02T10:06:27+05:30 IST