ఆక్సిజన్‌ అందని మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే

ABN , First Publish Date - 2021-05-13T06:43:02+05:30 IST

రాష్ట్రంలో ఆక్సిజన్‌ అందక మరణించిన కరోనా బాధితుల మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

ఆక్సిజన్‌ అందని మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
కొవిడ్‌ మృతులకు నివాళులర్పిస్తున్న నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


పుత్తూరు, మే 12: రాష్ట్రంలో ఆక్సిజన్‌ అందక మరణించిన కరోనా బాధితుల మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తన స్వగ్రామం నగరి మండలం అయినంబాకంలో తిరుపతి రుయా దుర్ఘటనలో మృతి చెందిన వారికి బుధవారం రాత్రి గ్రామస్తులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పింంచారు. తిరుపతి రుయాలో ఆక్సిజన్‌ అందక మరణించిన వారి సంఖ్య విషయంలో ప్రభుత్వం అసత్యాలు వల్లె వేస్తోందన్నారు. ఘటనలో మొత్తం 23 మంది మరణిస్తే 11 మంది మాత్రమే మృతి చెందారని కలెక్టర్‌ ప్రకటన నిజానిజాలను కప్పిపుచ్చేలా ఉందని తెలిపారు. మృతుల వివరాలను పేర్లు, చిరునామాలతో సహా వెల్లడించిన ఆయన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరణాలను తక్కెవ చేసి చూపుతున్నారని ఆక్షేపించారు. కరోనా కట్టడి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతకాని తనాన్ని నిరూపించుకున్నాయన్నారు. కరోనా విలయ తాండవం చేస్తుంటే కనీసం ప్రాణవాయువు కూడా అందించలేని ప్రభుత్వాలను ఏమనాలో తెలియడం లేదని నిలదీశారు. ఆక్సిజన్‌ అందక ఎవరూ మరణించలేదని ఆరోగ్యశాఖ ప్రకటించడాన్ని తప్పుబట్టారు. హిందూపురం, విజయనగరం, తిరుపతి, ఒంగోలులో ఆక్సిజన్‌ అందక మృతి చెందిన వారి విషయంలో ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్‌ ఇవ్వమని కేంద్రంలో మోదీ సర్కార్‌కు నిలదీయలేక రాష్ట్ర ప్రజల ప్రాణాలను బలిపెట్టడాన్ని ఉపేక్షించబోమన్నారు. మోదీ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలను తలచుకుని జగన్‌కు వణుకు పుడుతోందా అని ప్రశ్నించారు. వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం చేతులు ఎత్తివేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉండగా దాన్ని రాష్ట్రాలపై తోసి చేతులు దులుపుకోవడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రాల మద్య తగవులు సృష్టించేందుకే బీజేపీ ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలన్నారు. మెడిసిన్‌, ఆక్సిజన్‌, వెంటిలేటెడ్‌ బెడ్స్‌ తదితర అత్యవసర విషయాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-13T06:43:02+05:30 IST