1150 మెగావాట్లతో ఆర్టీపీపీ ఉత్పత్తి

ABN , First Publish Date - 2021-01-25T05:50:27+05:30 IST

సుమారు పదినెలల తర్వాత రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటు 1150 మెగావాట్ల సామర్థ్యంతో నడుస్తోంది. యూనిట్‌ 1-203, యూనిట్‌ 2-204, యూనిట్‌ 4-215, యూనిట్‌ 6-515 మెగావాట్లతో నడుస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఆదివారం 1150 యూనిట్ల ఉత్పత్తి జరిగినట్లు సీఈ మోహనరావు తెలిపారు.

1150 మెగావాట్లతో ఆర్టీపీపీ ఉత్పత్తి

నేడు మరో యూనిట్‌ రన్నింగ్‌లోకి

రాష్ట్రంలోని ఇతర ప్లాంట్లతో సమానంగా ఉత్పత్తి

ఆర్టీపీపీని సందర్శించిన జెనకో డైరక్టర్‌

ఎర్రగుంట్ల, జనవరి 24: సుమారు పదినెలల తర్వాత రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటు 1150 మెగావాట్ల సామర్థ్యంతో నడుస్తోంది. యూనిట్‌ 1-203, యూనిట్‌ 2-204, యూనిట్‌ 4-215, యూనిట్‌ 6-515 మెగావాట్లతో నడుస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఆదివారం 1150 యూనిట్ల ఉత్పత్తి జరిగినట్లు సీఈ మోహనరావు తెలిపారు. రాష్ట్రంలోని ఏపీ జెనకో ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్‌డీఎస్‌టీపీఎస్‌ 1033, డాక్టర్‌ ఎనటీటీపీఎస్‌ (వీటీపీఎస్‌)-1165 మెగావాట్ల సామర్థ్యంతో నడిచే సమయంలో ఆర్టీపీపీలో కూడా 1150 మెగావాట్ల సామర్థ్యంతో నడవటంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఆర్టీపీపీలో 210 ఇంటూ 5, 600 మెగావాట్ల సామర్థ్యంతో నడిచే ఆరు యూనిట్లున్నాయి. మొత్తం 1650 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్‌ క్రిటికల్‌ పవర్‌స్టేషనగా రూపాంతరం చెందింది. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుతకు డిమాండ్‌ బాగా ఉండటంతో ఆర్టీపీపీలోని యూనిట్స్‌ బ్యాక్‌డౌన లేకుండా నడుస్తున్నాయి. ప్రస్తుతానికి నాలుగు యూనిట్లు రన్నింగ్‌లో ఉండగా నేడు మరో యూనిట్‌ను కూడా రన్నింగ్‌లోకి తీసుకోవాలని గ్రిడ్‌ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో సోమవారం నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఈ ఎల్‌.మోహనరావు తెలిపారు. 


ఆర్టీపీపీని సందర్శించిన జెనకో డైరెక్టర్‌ 

ఏపీ జెనకో డైరక్టర్‌ థర్మల్‌, హైడల్‌ చంద్రశేఖర్‌రాజు ఆదివారం ఆర్టీపీపీని సందర్శించారు. చాలా రోజుల తర్వాత ప్లాంటులోని యూనిట్లు నడుస్తుండటంతో యూనిట్ల పనితీరును ఆయన పరిశీలించి స్థానిక అధికారులతో మాట్లాడారు. ఆదివారం ఆయన మైలవరం జలాశయం నుంచి సరఫరా అవుతున్న పైప్‌లైనను పరిశీలించారు. నీటి సరఫరాపై ఆయన అధికారులతో చర్చించారు. ప్రస్తుతం మైలవరం నుంచి 39 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. అయితే అన్ని యూనిట్లు నడిస్తే నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో బ్రహ్మంసాగర్‌ నుంచి కూడా పంపింగ్‌ ఆదివారం మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీపీపీలోని మూడు రిజర్వాయర్స్‌ను నింపిన అనంతరం సాగర్‌ నుంచి పంపింగ్‌ నిలిపివేయనున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-01-25T05:50:27+05:30 IST