మదనపల్లె వైద్యశాలకు ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌

ABN , First Publish Date - 2021-05-16T06:14:03+05:30 IST

మదనపల్లె జిల్లా వైద్యశాలకు శాశ్వత రియల్‌ టైమ్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌-వైరాలజీ)ల్యాబ్‌ మంజూరైంది.

మదనపల్లె వైద్యశాలకు ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌

మదనపల్లె క్రైం, మే 15: మదనపల్లె జిల్లా వైద్యశాలకు శాశ్వత రియల్‌ టైమ్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ (ఆర్టీపీసీఆర్‌-వైరాలజీ)ల్యాబ్‌ మంజూరైంది. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ స్టేట్‌ నోడల్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌  శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ పరీక్షలకు సంబంధించి ప్రజల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను తిరుపతి వైరాలజీ ల్యాబ్‌కు పంపుతుండడంతో ఫలితాలు వచ్చేందుకు ఆలస్యమవుతోంది. ఈ సమస్యపై ఆస్పత్రి అధికారులు  ఇటీవల ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. దీనిపై స్పందించిన సీఈవో జిల్లా వైద్యశాలకు శాశ్వత వైరాలజీ ల్యాబ్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆస్పత్రి అధికారులు చెప్పారు. ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.  ఇక్కడే పరీక్షలు నిర్వహించి గంటల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేయవచ్చని  చెప్పారు. 


సురక్ష ఆస్పత్రిలో కొవిడ్‌ సేవలు రద్దు  


మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న సురక్ష ఆస్పత్రిలో కొవిడ్‌ సేవలను రద్దు చేస్తూ కలెక్టర్‌ హరినారాయణన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.  గత ఏడాది కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆస్పత్రిలో కొవిడ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.  కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఇటీవల కలెక్టర్‌ సహా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఈక్రమంలో క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఆస్పత్రిలో  కొవిడ్‌ సేవలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-16T06:14:03+05:30 IST