శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పుల వ్యవహారం.. అది ముమ్మాటికీ చట్ట విరుద్ధమేనన్న ఎన్ఆర్ఏఐ అధికారి

ABN , First Publish Date - 2022-09-22T18:53:02+05:30 IST

ఒక రైఫిల్ (Rifle) ఉపయోగించాలంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI)కు సంబంధించిన సభ్యత్వం ఉండాలి.

శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పుల వ్యవహారం.. అది ముమ్మాటికీ చట్ట విరుద్ధమేనన్న ఎన్ఆర్ఏఐ అధికారి

హైదరాబాద్ : ఒక రైఫిల్ (Rifle) ఉపయోగించాలంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI)కు సంబంధించిన సభ్యత్వం ఉండాలి. అది లేకుండా రైఫిల్‌ను వినియోగించడానికి వీలే లేదు. అయితే ఒకవేళ లైసెన్స్ కలిగి ఉన్నా కూడా ఒక పోలీస్ రైఫిల్‌ను వినియోగించి పబ్లిక్‌లో ఫైర్ ఓపెన్ చేయడం చట్టరీత్యా నేరం. ఇటీవల ఒక్కసారి కాదు.. రెండు సార్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) బహిరంగ ప్రదేశంలో పోలీస్ ఆయుధాన్ని ఉపయోగించి అడ్డంగా దొరికిపోయారు. ఈ విషయమై ఓ వ్యక్తి సమాచారం హక్కు చట్టం(RTI) ని ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన ఎన్ఆర్ఏఐ తాజాగా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. శ్రీనివాస్‌గౌడ్‌కు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వం ఉందని ఆ ఆర్టీఐ దరఖాస్తుకి బదులిచ్చింది. అయితే సభ్యత్వం ఉన్నా కూడా పోలీసు ఆయుధాన్ని ఉపయోగించి బహిరంగంగా (మెటల్/రబ్బర్ బుల్లెట్) కాల్పులు జరపడానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి అధికారం లేదని .. ఇది చట్టవిరుద్ధమని పేర్కొంది.


మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు..


స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆ వజోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్‌లోని జిల్లా పరిషత్ మైదానం నుంచి విద్యార్ధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి ఫ్రీడమ్ రన్‌ని ప్రారంభించారు. మంత్రి పక్కనే కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం, టీవీల్లో ప్రసారమైంది. మంత్రి తుపాకీ పేల్చిన వీడియోలు నిమిషాల వ్యవధిలోనే మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసు తుపాకీతో మంత్రి ఎలా కాల్పులు జరుపుతారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ ఘటనపై సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని జిల్లా ఎస్పీని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. దీనికి ఎస్పీ అదేదో డమ్మీ బుల్లెట్ అన్నట్టుగా అప్పట్లో సమర్థించుకొచ్చారు. అదంతా మంత్రి పొడ గిట్టని వారి దుష్ప్రచారం అని టిఆరెస్స్ ఎదురుదాడికి దిగింది. 


అయితే ఈ విషయంపై వెనక్కి తగ్గని ఓ వ్యక్తి ఆర్‌టీఐని సంప్రదించాడు. దానిలో ఆయన పలు ప్రశ్నలను సంధించాడు. దానికి ఎన్ఆర్ఏఐ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి ఇలా సమాధానం ఇచ్చారు-  


1. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమైనా ఎన్ఆర్ఏఐ మెంబరా? 


అవును

ఒకవేళ ఆయన మెంబర్ అయితే ఈ కింది వివరాలు తెలియచేయండి: 

2. ఆయన మెంబర్ షిప్ కాల వ్యవధి ఎంత?


ఆయనొక జీవితకాల మెంబర్. ఆయన మెంబర్‌షిప్ నం L.8764. 5 ఫిబ్రవరి 2021 నుంచి ఆయన మెంబర్ షిప్ కలిగి ఉన్నారు.


3. ప్రస్తుతం ఆయన మెంబర్‌షిప్ యాక్టివ్‌లో ఉందా? లేదా?


యాక్టివ్‌లోనే ఉంది.


4. పబ్లిక్‌లో ఒక కానిస్టేబుల్‌కు చెందిన సెల్ఫ్ లోడెడ్ రైఫిల్‌తో గాల్లో కాల్పులు జరిపేందుకు ఒక ఎన్ఆర్ఏఐ మెంబర్‌కు అనుమతి ఉందా?


అనుమతి లేదు.


5. కాల్పులు జరిపేందుకు ఒక ఎన్ఆర్ఏఐ మెంబర్‌కు ఏ రకమైన బుల్లెట్స్(రబ్బర్/మెటల్)కు అనుమతి ఉంది?


దేనికీ అనుమతి లేదు.


6. ఒకవేళ ఆయన ఎన్ఆర్ఏఐ మెంబర్ అయితే ఒక పోలీస్ కానిస్టేబుల్ రైఫిల్‌తో గాల్లో కాల్పులు జరపవచ్చా? 


ఎవరికైనా సరే.. పబ్లిక్‌లో పోలీస్ రైఫిల్ వినియోగించి ఫైర్ ఓపెన్ చేయడానికి అనుమతి లేదు.


Updated Date - 2022-09-22T18:53:02+05:30 IST