ఆర్టీసీ చార్జ్‌..!

ABN , First Publish Date - 2022-07-01T06:30:51+05:30 IST

ఆర్టీసీ చార్జ్‌..!

ఆర్టీసీ చార్జ్‌..!

రెండు జిల్లాలపై ఏడాదికి రూ.200 కోట్ల భారం

డీజిల్‌ సెస్‌ పేరుతో ఇష్టానుసారంగా చార్జీల పెంపు

ప్రకటించింది వేరు.. రహస్యంగా అమలు చేసింది వేరు.. 

30-45 కిలోమీటర్ల వరకు మినహాయింపు ఉత్తుత్తే..

ఐదు కిలోమీటర్లు దాటితే చార్జీల భారమే ఫ  పల్లె వెలుగుకూ అంతే..

సీజనల్‌ టికెట్లు, ఇతర పాస్‌లపైనా భారీ పెరుగుదల


పైన పటారం.. లోన లొటారం.. అన్నట్టుంది ఆర్టీసీ చార్జీల పెంపుచూస్తే. పేరుకు 30-45 కిలోమీటర్ల వరకూ పెంపు లేదని ప్రకటిస్తూనే.. రహస్యంగా ఇచ్చిన జీవోల్లో మాత్రం ఇష్టానుసారంగా పెంచి పడేశారు. ప్రయాణికులను గందరగోళం చేయడానికి పైకి ఓ రకంగానూ, అంతర్గతంగా మరో రకంగానూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేమైనా డీజిల్‌ సర్‌ చార్జీల పేరుతో జిల్లా ప్రయాణికులపై ఏడాదికి రూ.200 కోట్ల మేర బండ పడేసి చేతులు దులుపుకొన్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆర్టీసీ అధికారులు విడుదల చేసిన అధికారిక వివరాలకు, అంతర్గతంగా ఇచ్చిన ఆదేశాలకు చాలా తేడా ఉంది. ప్రజలను గందరగోళం చేయటానికి ఒక రకంగానూ, అంతర్గతంగా మరో రకంగానూ ఉత్తర్వులు జారీ చేశారు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల మేర డీజిల్‌ సెస్‌ లేదని ప్రకటించిన ఆర్టీసీ.. అధికారులకు ఇచ్చిన రహస్య ఉత్తర్వుల్లో మాత్రం 30 కిలోమీటర్లలోపు రూ.5 పెంచింది. దీనిని బట్టి చూస్తే దొడ్డిదారిలో డీజిల్‌ సెస్‌తో సంబంధం లేకుండా చార్జీలు పెంచారని తెలుస్తోంది. పల్లె వెలుగుతో పాటు ఆల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, ఆల్ర్టా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర, గరుడ, మెట్రో లగ్జరీ, అమరావతి, డాల్ఫిన్‌ క్రూజ్‌, నైట్‌ రైడర్‌ బస్సుల్లో కూడా 45 కిలోమీటర్ల వరకు ఇంధన చార్జీ లేదని చెప్పినప్పటికీ, రహస్యంగా పెంచారు. ఆర్టీసీ అధికారులకు రహస్యంగా ఇచ్చిన ఆదేశాల్లో కిలోమీటరుకు పల్లెవెలుగుకు 83 పైసలు, ఆల్ర్టా పల్లెవెలుగు బస్సుకు 92 పైసలు, ఎక్స్‌ప్రెస్‌కు రూ.1.07, ఆల్ర్టా డీలక్స్‌కు రూ.1.30, సూపర్‌ లగ్జరీకి రూ.1.36, ఇంద్రకు రూ.1.66, గరుడకు రూ.1.91, మెట్రో లగ్జరీకి రూ.1.91, అమరావతికి రూ.2.19, డాల్ఫిన్‌ క్రూజ్‌కు రూ.2.19, నైట్‌ రైడర్‌కు రూ.1.91, నైట్‌ రైడర్‌ బెర్త్‌కు రూ.2.30, వెన్నెల స్లీపర్‌కు రూ.2.73 చొప్పున పెంపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 

సామాన్యుడికి భారం

పల్లె వెలుగు బస్సుల్లో సామాన్యులు ప్రయాణిస్తుంటారు. వారిపైనా భారం వేస్తూ ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీలు పెంచేశారు. ఐదు కిలోమీటర్ల వరకు మాత్రమే చార్జీ మినహాయింపును ఇచ్చారు. ఇంతకుముందు పది కిలోమీటర్లకు రూ.15 చార్జీ ఉండగా, ప్రస్తుతం రూ.20 అయ్యింది. 20 కిలోమీటర్ల దూరానికి గతంలో రూ.25 ఉండగా, రూ.30 చేశారు. 35 కిలోమీటర్లకు ఇంతకుముందు చార్జీ రూ.35 ఉండగా, ఇప్పుడు రూ.40 చేశారు. 

‘కనీస’ బాదుడు

కనీస చార్జీల బాదుడు చూస్తే భయమేస్తుంది. పల్లె వెలుగు, ఆల్ర్టా పల్లె వెలుగు బస్సుల్లో కనీస చార్జీ రూ.10, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అయితే రూ.20, ఆల్ర్టా డీలక్స్‌ రూ.25, సూపర్‌ లగ్జరీ రూ.40, ఇంద్ర రూ.50, గరుడ రూ.50, అమరావతి రూ.50, డాల్ఫిన్‌ క్రూజ్‌ రూ.50, నైట్‌ రైడర్‌ రూ.50, నైట్‌ రైడర్‌ బెర్త్‌ రూ.80, వెన్నెల స్లీపర్‌ రూ.80, మెట్రో లగ్జరీ ఏసీ రూ.50 చొప్పున పెంచింది. కనీస ధరలు ఇలా పెంచామని అధికారులు చెప్పినా.. గరిష్ట ధరలు రూ.140 వరకూ పెంచడం గమనార్హం.

బస్‌పాస్‌ భారమే..

పెంపు భారం బస్‌పాస్‌లపైనా పడింది. నెలవారీగా చూస్తే సిటీ బస్సుల్లో సీజనల్‌ బస్‌ టికెట్‌ (సిటీ బస్‌ పాస్‌) రూ. 155 ఉండగా, రూ.300 చేశారు. పల్లెవెలుగు బస్సుల్లో సీజనల్‌ బస్‌ టికెట్‌ (పల్లె వెలుగు పాస్‌) ధర రూ.245 ఉండగా, రూ.350కి పెంచారు. త్రైమాసిక పాస్‌ రూ.885ను రూ.1,035కు పెంచారు. గ్రామీణ రూట్‌ పాస్‌ల విషయానికి వస్తే ఐదు కిలోమీటర్ల వరకు ఇప్పటి వరకు రూ.100 ఉండగా, రూ.140 చేశారు. త్రైమాసిక పాస్‌ ధర రూ.400గా నిర్ణయించారు. 

రెండు జిల్లాలపై భారం ఇలా..

డీజిల్‌ ధరల భారాన్ని చూపిస్తూ.. ఆర్టీసీ అధికారులు మరోసారి చార్జీలు పెంచేశారు. దీని ప్రకారం రెండు జిల్లాల ప్రయాణికులపై రూ.200 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఆర్టీసీ బస్సులు రెండు జిల్లాల్లోనూ రోజుకు 5.50 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. లీటర్‌ డీజిల్‌ 4.70 కిలోమీటర్ల మేర వస్తుంది. ఈ లెక్కన సగటున రోజుకు 1.10 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగమవుతుంది. దీంతో కిలోమీటర్ల ప్రాతిపదికన ఆర్టీసీ అధికారులు సర్‌ చార్జీని ప్రయాణికులపై పడేశారు. వివిధ కేటగిరీల బస్సుల్లో వేర్వేరుగా కనీస ధరలు నిర్ణయించారు. పల్లె వెలుగు బస్సుల నుంచి హై ఎండ్‌ బస్సుల వరకూ సగటున కిలోమీటరుకు రూ.50 భారం లెక్కించాలి. ఈ లెక్కన రోజుకు 1.10 లక్షల కిలోమీటర్లు అంటే.. రూ.55 లక్షల మేర డీజిల్‌ సెస్‌ రూపంలో భారం పడుతుంది. అదే నెలకు రూ.16.50 కోట్ల మేర భారం పడుతుంది. అదే ఏడాదికి లెక్కిస్తే రూ.198 కోట్లు అవుతుంది. బస్‌పాస్‌ల మీద వడ్డన రూ.2 కోట్లు అదనంగా కలిపితే మొత్తం రూ.200 కోట్ల మేర ప్రయాణికులపై భారం పడుతుంది.





Updated Date - 2022-07-01T06:30:51+05:30 IST