‘ఆర్టీసీ’ స్టాళ్ల నిర్వాహకులకు ఊరట

ABN , First Publish Date - 2020-09-17T08:36:34+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో షాపులు/స్టాల్స్‌ లీజుకు తీసుకున్న వ్యాపారులకు హైకోర్టు ఊరటనిచ్చింది. కొవిడ్‌

‘ఆర్టీసీ’ స్టాళ్ల నిర్వాహకులకు ఊరట

  • ఏప్రిల్‌, మే, జూన్‌ బకాయిల కోసం ఒత్తిడి చేయొద్దు: ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లో షాపులు/స్టాల్స్‌ లీజుకు తీసుకున్న వ్యాపారులకు హైకోర్టు ఊరటనిచ్చింది. కొవిడ్‌ విపత్కర పరిస్థితులను అవకాశంగా తీసుకుని పిటిషనర్లపై, అదే పరిస్థితిని ఎదుర్కొంటున్న ఇతరులపై భారం మోపరాదని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ వల్ల మూసేసిన షాపు యజమానులపై ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల అద్దెలు/లైసెన్సు ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయరాదని తేల్చి చెప్పింది. లాక్‌డౌన్‌కు ముందున్న బకాయిలతో పాటు జూలై, ఆగస్టు నెలలకు 50ు అద్దె/లైసెన్సు ఫీజులను కోర్టు ఉత్తర్వులు అందిన 3 వారాల్లోగా చెల్లించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం అద్దెలు/లైసెన్సు ఫీజులను పిటిషనర్లు చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఆర్టీసీ యాజమాన్యానికి సూచించింది.


అయితే ఏదేని నిర్ణయం తీసుకునే ముందు కరోనా వల్ల దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను నవంబరు 6కి వాయిదా వేశారు. లాక్‌డౌన్‌ సమయంలో షాపు లీజులు/లైసెన్సు ఫీజులు చెల్లించాలని, లేకుంటే లీజు అగ్రిమెంట్లు/లైసెన్సులు రద్దు చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు జారీ చేయడాన్ని బి.అమిత్‌ కుమార్‌, మరికొందరు వేర్వేరు పిటిషన్లతో హైకోర్టులో సవాల్‌ చేశారు. లాక్‌డౌన్‌తో షాపులను మూసివేశామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. 

Updated Date - 2020-09-17T08:36:34+05:30 IST