ఆర్టీసీ సర్వీసులు అంతంతమాత్రమే..

ABN , First Publish Date - 2021-05-06T06:40:23+05:30 IST

కర్ఫ్యూ తొలి రోజున ఆర్టీసీ సర్వీసులు అంతంతమాత్రంగానే నడిచాయి. బుధవారం జిల్లాలోని 9 డిపోల నుంచి కేవలం 60 నుంచి 65 బస్సులను మాత్రమే నడపగలిగారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తిప్పాల్సి రావడంతో ఆ మేరకు అధికారులు తక్కువ సంఖ్యలో మాత్రమే బస్సులను పంపగలిగారు.

ఆర్టీసీ సర్వీసులు అంతంతమాత్రమే..

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 5: కర్ఫ్యూ తొలి రోజున ఆర్టీసీ సర్వీసులు అంతంతమాత్రంగానే నడిచాయి. బుధవారం జిల్లాలోని 9 డిపోల నుంచి కేవలం 60 నుంచి 65           బస్సులను మాత్రమే నడపగలిగారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తిప్పాల్సి రావడంతో ఆ మేరకు అధికారులు తక్కువ సంఖ్యలో మాత్రమే బస్సులను పంపగలిగారు. ఒక్కో రూటులో రెండు, మూడు సర్వీసులు మాత్రమే వెళ్లాయి.                 రాజమహేంద్రవరం-కాకినాడ నాన్‌స్టాప్‌ బస్సులను పూర్తిగా నిలిపివేశారు. రాజమహేంద్రవరం నుంచి తుని, కాకినాడ, గోకవరం-రాజమహేంద్రవరం, అమలాపురం-రాజమహేంద్రవరం, గోకవరం బస్టాండు-సీతానగరం వంటి రూట్లలో మాత్రమే కొన్ని సర్వీసులు నడిపారు. డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు తిరగలేదు. పల్లెవెలుగులు మాత్రమే నడిచాయి.         మరోపక్క ప్రయాణికుల నుంచి స్పందన కూడా నామమాత్రంగానే ఉంది. కర్ఫ్యూ అమల్లో ఉండడంతో బయట పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. అత్యవసరమైన కొద్దిమంది మాత్రమే ప్రయాణాలు సాగించారు. దీంతో రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ బోసిపోయింది. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి, గోకవరం బస్టాండు ప్రాంతాల్లోనూ సందడి లేదు. ఉదయం పది గంటల వరకు మాత్రమే కాస్త ప్రయాణికులు కనిపించినా ఆ తర్వాత నుంచి రాకపోవడంతో అధికారులు సర్వీసులను కూడా క్రమబద్ధీకరించారు. తుని, కాకినాడ వంటి కొన్ని రూట్లలో ప్రయాణికులు చాలా తక్కువ సంఖ్యలోనే రాకపోకలు సాగించారు. ఖాళీగా బస్సులు                  తిప్పితే కనీసం డీజిల్‌ ఖర్చులైనా వస్తాయా అనే అనుమానాన్ని ఆర్టీసీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాగా తొలి రోజు కర్ఫ్యూ అనుభవంతో  గురువారం కనీసం 100 నుంచి 125 సర్వీసులైనా నడపాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీనికోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ మేరకు బస్సులు నడపాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ప్రయాణికులు రాకపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారనుంది.

Updated Date - 2021-05-06T06:40:23+05:30 IST