సుదూర ప్రాంతాలకు ఆర్టీసీ రైట్‌.. రైట్‌..!

ABN , First Publish Date - 2021-06-20T06:33:49+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని సడలించింది.

సుదూర ప్రాంతాలకు ఆర్టీసీ రైట్‌.. రైట్‌..!
సమావేశంలో ప్రసంగిస్తున్న తిరుపతి డిప్యూటీ సీటీఎం మధుసూదన

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కాకినాడ, విశాఖ, శ్రీశైలంకు బస్సులు


తిరుపతి(కొర్లగుంట), జూన్‌ 19: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని సడలించింది. దీనివల్ల ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అంటే 12 గంటలపాటు బస్సులు నడిపే అవకాశం రావడంతో ఆర్టీసీ యంత్రాంగం దీనిపై కసరత్తు చేపట్టింది. ప్రధానంగా దూరప్రదేశాలకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. కాకినాడ, విశాఖ, శ్రీశైలంకు సూపర్‌లగ్జరీ బస్సులను పునరుద్ధరించారు. ఏసీ బస్సులకు అనుమతి లేకపోవడంతో ప్రస్తుతానికి ఆ సర్వీసులను వాయిదా వేశారు. ఈ అంశాలపై శనివారం తిరుపతి డిప్యూటీ సీటీఎం మధుసూదన ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన డ్రైవర్‌, కండక్టర్లను యథావిధిగా విధులకు నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి, మంగళం డిపో మేనేజర్లు ప్రవీణ్‌కుమార్‌, రాజవర్ధన్‌రెడ్డి, అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ విశ్వనాఽథ్‌, తిరుపతి డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ పుష్పలత పాల్గొన్నారు.


తిరుపతి నుంచి బయల్దేరే సర్వీసులిలా

సూపర్‌లగ్జరీ: విశాఖకు ఉదయం 5.30గంటలకు,  కాకినాడకు ఉదయం ఆరు గంటలకు,  విజయవాడకు ఉదయం 5, 6.30, 7, 7.30, 8, 8.30, 9, 9.30, 10, 11గంటలకు, కర్నూలుకు ఉదయం 4, 4.40, 5.15, 6, 6.30, 7, 7.30, 8.15, 9.20, 10.10గంటలకు, అనంతపురానికి ఉదయం 5.30, 6, 6.30, 7, 7.30, 8.30గంటలకు, శ్రీశైలంకు ఉదయం 6, 7గంటలకు బస్సులు బయల్దేరుతాయి. ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్లో సీట్లను ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా బస్టాండులోని రిజర్వేషన్‌ కౌంటర్‌ ద్వారా ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చు. 

ఎక్స్‌ప్రెస్‌, పల్లె వెలుగు: చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పుత్తూరులకు ప్రతి 20నిమిషాలకో బస్సు, నెల్లూరు, కడప, సత్యవేడు, పీలేరులకు ప్రతి 30నిమిషాలకో సర్వీసు, పుంగనూరుకు ప్రతి 40 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుంది.

Updated Date - 2021-06-20T06:33:49+05:30 IST