ఇదేం టార్గెట్‌!

ABN , First Publish Date - 2022-08-01T04:51:25+05:30 IST

ఆర్టీసీ ఉద్యోగులకు కొరియర్‌ పార్శిల్‌ టార్గెట్‌ పెడుతున్నారు. కొత్తగా శ్రీకారం చుట్టిన డోర్‌ డెలివరీ పార్శిల్‌ సర్వీసుపై అవగాహన కల్పించాల్సిన అధికారులు బలవంతంగా వసూళ్లకు తెగబడుతున్నారు.

ఇదేం టార్గెట్‌!

కనీసం మూడు కొరియర్‌ పార్శిళ్లు చేయాలంటూ ఆర్టీసీ ఉద్యోగులకు ఆదేశాలు

ఉద్యోగుల నుంచి బలవంతంగా రూ.210 వసూళ్లు

గగ్గోలు పెడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు


గుంటూరు, జూలై 31: ఆర్టీసీ ఉద్యోగులకు కొరియర్‌ పార్శిల్‌ టార్గెట్‌ పెడుతున్నారు. కొత్తగా శ్రీకారం చుట్టిన డోర్‌ డెలివరీ పార్శిల్‌ సర్వీసుపై అవగాహన కల్పించాల్సిన అధికారులు బలవంతంగా వసూళ్లకు తెగబడుతున్నారు. తమ వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.210 నిర్బంధంగా వసూలు చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విభజిత జిల్లాలోని ఐదు డిపోల్లో అధికారుల తీరు ఇలాగే ఉందని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల ఆర్టీసీ పార్శిల్‌ డోర్‌ డెలివరీ సర్వీసును ప్రారంభించింది. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రతి ఒక్కరూ మూడు డోర్‌ డెలివరీ పార్శిల్స్‌ చేయాల్సిందేనని టార్గెట్లు పెడుతున్నారు. ఇక డిపో స్థాయి అధికారులు ఒక అడుగు ముందుకేసి పార్శిల్‌ అడ్రస్‌లు ఏమిలేకుండానే, వాటితో సంబంధం లేకుండా ఒక్క పార్శిల్‌ బుకింగ్‌ రూ.70 చొప్పున మూడుకు లెక్క కట్టి ఒక్కో ఉద్యోగి రూ.210 చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని గుంటూరు-1, 2 డిపోలతో పాటు మంగళగిరి, పొన్నూరు, తెనాలి డిపోలలో ఇదేవిధంగా ఉద్యోగుల నుంచి బలవంతంగా రూ.210 వసూలు చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడీసీకి నగదు వసూలు చేసే బాధ్యత అప్పగించారు. ఆయా ఏడీసీలు ఉద్యోగులకు ఫోన్‌ చేసి రూ.210  వసూలు చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇక కొందరు అధికారులైతే డ్రైవర్‌, కండక్టర్లతో పాటు కిందిస్థాయి సిబ్బంది చేత కూడా రూ.210 వసూలు చేయిస్తున్నట్లు సమాచారం. 


రశీదు ఉంటేనే విధులు..

ఒక జిల్లాలో ఓ డిపోలో అయితే రూ.210 చెల్లించిన రశీదు ఉంటేనే డ్యూటీకి అంటూ ఆ డిపో మేనేజర్‌ షరతు పెట్టటం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీరు పట్ల ఉద్యోగులు లోలోపల మండిపడుతున్నారు. మరో డిపోలో ఉదయాన్నే అధికారులు ముందుగా రూ.210 చెల్లించి రశీదు తీసుకొని డ్యూటీకి వెళ్ళాలని స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డెస్క్‌ ఏర్పాటు చేయటం విశేషం. అధికారులతో ఎందుకిలే తంటా అని కొందరు నగదు చెల్లిస్తుంటే, మరి కొందరు జీతాలు వచ్చినాక చూద్దాంలే అని సమాదానం చెప్పి జారుకుంటున్నారు. మరికొంత మంది అయితే నాలుగు రోజులు సెలవులిస్తే డోర్‌ డెలివరీపై అవగాహన కల్పించటంతో పాటు మూడు అడ్రస్సులు తీసుకొస్తామని అంతేకానీ ఇలా ఇబ్బందులు  పెట్టటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలా ఇలా వసూళ్లు చేశారు.. వచ్చే నెల ఏం చేస్తారోనని మరికొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్గోకు ఆదరణ పెరిగింది, కొత్తగా తీసుకొచ్చిన డోర్‌ డెలివరీతో వ్యాపారం బాగా పెరిగిందని చెప్పుకోవటానికే కొందరు అధికారులు వేసిన ఎత్తుగడగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఉద్యోగులపై అధికారుల వేధింపులు పెరిగాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2022-08-01T04:51:25+05:30 IST