Allu Arjun తక్షణమే క్షమాపణ చెప్పాలి: RTC MD Sajjanar

ABN , First Publish Date - 2021-11-10T18:58:42+05:30 IST

సినీ హీరో అల్లు అర్జున్ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ డిమాండ్ చేశారు.

Allu Arjun తక్షణమే క్షమాపణ చెప్పాలి: RTC MD Sajjanar

హైదరాబాద్: సినీ హీరో అల్లు అర్జున్ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ డిమాండ్ చేశారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో బుధవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థతో తనకు ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారు కాబట్టే నోటీసులు ఇచ్చామని సజ్జనార్ స్పష్టం చేశారు. తాము ఇచ్చిన నోటిసులకు రిప్లయ్ రాకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతామని చెప్పారు.


సెలబ్రెటీలు కమర్షియల్ యాడ్స్‌లో నటించే ముందు జాగ్రత్తగా చూసి నటించాలని సూచించారు. డబ్బులకు ఆశపడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించకూడదని సజ్జనార్ హితబోధ చేశారు. సినిమా వాళ్లకు బాధ్యత ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. ఎవరైనా తమ ప్రొడక్ట్ గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు కానీ ఇతర ప్రొడక్ట్‌లను కించపరచకూడదనే విషయాన్ని గుర్తించాలని సజ్జనార్ తెలియజేశారు. ఆర్టీసీతో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంటుందని, తన బాల్యం, విద్యార్థి దశ, కాలేజీ జీవితం మొత్తం ఆర్టీసీతోనే ముడిపడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ ప్రతిష్టను పెంచుతామన్నారు. నష్టాల నుంచి లాభాల వైపు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.



Updated Date - 2021-11-10T18:58:42+05:30 IST