పండుగ ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధం

ABN , First Publish Date - 2022-09-30T06:55:33+05:30 IST

దసరా పండుగ ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధమైంది. బతుకమ్మ, విజయదశమి సందర్భంగా ప్రయాణికులను గమ్యానికి చేరవేసేందుకు ఆర్టీసీ రీజియన్‌లోని ఏడు డిపోల్లో అదనపు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. పండుగ సందర్భంగా 385 అదనపు సర్వీసులకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

పండుగ ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధం

దసరాకు 385 అదనపు సర్వీసులు

నేటి నుంచి 4వ తేదీ వరకు 

తిరిగి 7 నుంచి 9తేదీ వరకు

ఈ సారి అదనపు చార్జీలు లేవు

నల్లగొండ అర్బన్‌, సెప్టెంబరు 29: దసరా పండుగ ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధమైంది. బతుకమ్మ, విజయదశమి సందర్భంగా ప్రయాణికులను గమ్యానికి చేరవేసేందుకు ఆర్టీసీ రీజియన్‌లోని ఏడు డిపోల్లో అదనపు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. పండుగ సందర్భంగా 385 అదనపు సర్వీసులకు షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

రాష్ట్రంలో దసరా పండుగకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వైభవంగా నిర్వహిస్తారు. బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఈ పండుగకు స్వగ్రామానికి వస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా మంది నివాసం ఉంటున్నారు. ఇప్పటికే పిల్లలకు దసరా సెలవులు రాగా, వారు స్వగ్రామాలకు చేరారు. ఇక పండుగకు ముందు రోజులు హైదరాబాద్‌ నుంచి వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. రోజువారీకంటే పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పండుగ తర్వాత స్వగ్రామాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా బస్సు సర్వీసులు పెంచాల్సి ఉంటుంది. అంతేగాక పండుగల సమయాల్లోనే ఆర్టీసీకి అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ మేరకు బస్సులను సిద్ధం చేయడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా బస్సు సర్వీసుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ నెల 30 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు. పండుగ అనంతరం వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు తిరిగి అదనపు సర్వీసులు నడుపుతారు. అదనపు సర్వీసుల పర్యవేక్షణ కోసం నల్లగొండ, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, దేవరకొండ, భువనగిరి, యాదగిరిగుట్టతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, సాగర్‌ రింగ్‌రోడ్డు, ఉప్పల్‌, బోడుప్పల్‌ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించారు. వారు ఇక్కడి నుంచి అదనపు సర్వీసులను పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు నడిచేలా చూస్తారు.

ప్రత్యేక సర్వీసులకు అదనపు చార్జీలు లేవు

పండుగల సందర్భంగా నడిపే అదనపు సర్వీసులకు పండుగ స్పెషల్‌ పేరుతో ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేసేది. అయితే ఈసారి ఎలాంటి అదనపు చార్జీలు ఉండవు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా రోజువారీ చార్జీలనే ప్రయాణికులను నుంచి వసూలు చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి వారే అధికంగా ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో అదనపు చార్జీలు లేకపోవడంతో వారికి పండుగ సందర్భంగా అదనపు ఆర్థిక భారం తప్పినట్టే.

ఆర్టీసీ ప్రయాణం సురక్షితం : వరప్రసాద్‌, నల్లగొండ ఆర్‌ఎం

పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నాం. ప్రయాణికులు పిల్లా పాపలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయణించి సురక్షితంగా వారి గమ్యాలకు చేరుకొని సంతోషంగా పండుగ నిర్వహించుకోవాలి. ఈసారి ఎలాంటి అదనపు చార్జీలు లేనందున ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించి ఇబ్బందిపడవద్దు.

Updated Date - 2022-09-30T06:55:33+05:30 IST