గ్రేటర్ ‘స్పీడ్’

ABN , First Publish Date - 2022-03-04T13:41:18+05:30 IST

నగర రోడ్లపై లాక్‌డౌన్‌లు, కొవిడ్‌ వేవ్‌ల తర్వాత పాత ట్రాఫిక్‌ దర్శనమిస్తోంది. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు

గ్రేటర్ ‘స్పీడ్’

 రెండేళ్ల తర్వాత భారీగా ట్రాఫిక్‌

 రోడ్లపై 50 లక్షల వాహనాలు

 ఆర్టీసీ, మెట్రోలో పెరిగిన ప్రయాణికులు

 సిటీబస్సుల్లో 65 శాతం ఆక్యుపెన్సీ 


కరోనా, లాక్‌డౌన్‌ ఆంక్షల నడుమ రెండేళ్లుగా 

పడి లేస్తూ నెమ్మదించిన నగర జనజీవనం క్రమేణా స్పీడందుకుంటోంది. ప్రస్తుతం కొవిడ్‌ కంటే ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరిగానే పౌరులు  దైనందిన చర్యల్లో పాల్గొంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలను పూర్తి స్థాయిలో ప్రారంభించడంతో రెండేళ్ల తర్వాత నగరానికి పాత కళ వచ్చింది.  


హైదరాబాద్‌ సిటీ: నగర రోడ్లపై లాక్‌డౌన్‌లు, కొవిడ్‌ వేవ్‌ల తర్వాత పాత ట్రాఫిక్‌ దర్శనమిస్తోంది. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొదటిసారి లాక్‌డౌన్‌కు ముందు (2020లో) రోజూ సుమారు 40 లక్షల వాహనాలు తిరిగేవి. నగరంలో 60 లక్షల వాహనాలు ఉన్నట్లు ట్రాఫిక్‌ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో నగర రోడ్లపై రోజూ 35 లక్షల నుంచి 40 లక్షల వరకు తిరిగాయి. మళ్లీ కరోనా విజృంభణ.. రెండో వేవ్‌లో రెండోసారి లాక్‌డౌన్‌లతో మళ్లీ పాత స్థితి కనిపించింది. ఆ తర్వాత ఒమైక్రాన్‌ భయాందోళనలు చుట్టుముట్టాయి. ఇప్పుడు జనం కరోనాను మర్చిపోయారు. 


సిటీ బస్సులు ఫుల్‌..

నగరంలో సిటీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కొవిడ్‌ దెబ్బతో రెండేళ్లుగా అరకొర ప్రయాణికులతో నడిచిన ఆర్టీసీ బస్సులు రద్దీగా మారాయి. కొవిడ్‌ ఫస్ట్‌వేవ్‌లో 20-25 శాతం నమోదయిన ప్రయాణికుల ఆక్యుపెన్సీ రెండోవేవ్‌లో 40 శాతం వరకు నమోదైంది. థర్డ్‌వేవ్‌లో 45 శాతం వరకు పెరిగినా కొవిడ్‌కేసులు పెరగడంతో ఆక్యుపెన్సీ తగ్గింది. కొన్నిరోజులుగా సాధారణ పరిస్థితులు నెలకొనడంతో కొవిడ్‌ ముందునాటి పరిస్థితులు నెలకొన్నాయి. కొవిడ్‌కు ముందు సిటీ బస్సుల్లో 65 శాతం నమోదైన ప్రయాణికులు ఆక్యుపెన్సీ ప్రస్తుతం అదే స్థాయిలో నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత గ్రేటర్‌లో సిటీబస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోతుండటంతో రద్దీకి అనుగుణంగా రోజు 2వేల వరకు అదనపు బస్‌ ట్రిప్పులు నడుపుతున్నారు. ప్రస్తుతం రోజుకు 25లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. 


మెట్రోలో రోజుకు 3 లక్షల మంది.. 

మెట్రో రైళ్లలోనూ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మెట్రోలో రోజుకు 3 లక్షలమంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఐటీకారిడార్‌లో సాప్ట్‌వేర్‌ సంస్థలు పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగేఅవకాశాలుంటాయని మెట్రోవర్గాలు భావిస్తున్నాయి. కొవిడ్‌ పరిస్థితులతో పోల్చితే ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం మూడు రూట్లలో 50 సర్వీసులు నడుపుతున్న ఎంఎంటీఎ్‌సలో రోజుకు 40 వేల మంది ప్రయాణాలు సాగిస్తున్నారు.


రోడ్లపై పెరిగిన వాహనాలు

నగర ప్రజల్లో కరోనా భయం పూర్తిగా తగ్గిపోయినా చాలా మంది తమ సొంతవాహనాలు ఉపయోగిస్తున్నారు. దీంతో నగర వాహనాల్లో సాధారణ రద్దీ కన్నా సుమారు 5 నుంచి 8శాతం పెరిగి ఉంటాయని అంచనా. కాస్త ట్రాఫిక్‌ సమస్య కూడా నగర రోడ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. తాజా గణాంకాలలో నగర రోడ్లపై అన్ని రకాల వాహనాలను కలిపితే ప్రతి రోజూ సుమారు 50లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా ఐటీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో పని ప్రారంభిస్తే మరో 2 లక్షల వాహనాలు పెరిగే అవకాశముందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2022-03-04T13:41:18+05:30 IST