సేవకు సిద్ధం

ABN , First Publish Date - 2020-04-01T17:27:53+05:30 IST

కోవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు..

సేవకు సిద్ధం

వలంటీర్లుగా ఆర్టీసీ సిబ్బంది 

క్షేత్రస్థాయిలో పోలీసులకు సహకరించేందుకు ఆర్టీసీ బృందాలు 

ఆరు డీజీటీ వాహనాల్లో వైద్యశాఖకు మందులు 

నగరంలో మొబైల్‌ కూరగాయల పంపిణీ కోసం 40 బస్సులు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కోవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు పోరాడుతున్న ప్రభుత్వ యంత్రాంగాలకు సహకరించేందుకు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌ రంగంలోకి దిగింది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలను బయట తిరగనీయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించేందుకు ఆర్టీసీ వలంటీర్లు రంగంలోకి దిగనున్నారు. విపత్కర పరిస్థితుల్లో బస్సులను నిలిపివేసినప్పటికీ, ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు తాము సిద్ధమని ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు ఇటీవల బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఈ ప్రకటనకు ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. ఆపరేషన్‌ విభాగం సిబ్బందిని వలంటీర్లుగా నియమించాలని రీజియన్‌ అధికారులు నిర్ణయించారు. లాక్‌డౌన్‌ అమలుకు కృషి చేస్తున్న పోలీసులకు సహాయపడటానికి, సడలింపు సమయాల్లో రైతుబజార్లు, కిరాణాషాపుల వద్ద రద్దీని నివారించటానికి సిబ్బంది సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. వలంటీర్ల ఎంపిక కోసం రీజియన్‌లోని ఆపరేషన్‌ కార్మికులను గుర్తించే బాధ్యతను డిపో మేనేజర్లకు ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్‌ అప్పగించారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండి, సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న వారినే ఇందుకు ఎంపిక చేయాలని సూచించారు. 


మహిళా సిబ్బందికి మినహాయింపును ఇవ్వాలని నిర్ణయించారు. డిపో మేనేజర్లు ఎంపిక చేసిన బృందాల సేవలను దశల వారీగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టనున్నారు. రైతుబజార్ల వద్ద రద్దీని నివారించే బాధ్యతను కొందరు వలంటీర్లకు బుధ, గురువారాల్లో అప్పగించనున్నారు. తర్వాత రెండు రోజులు మిగిలిన వారికి డ్యూటీలు అప్పగించనున్నారు. గుంటూరు రీజియన్‌లో పోలీసు స్టేషన్లలో సహాయకులుగా ఆర్టీసీ సిబ్బందిని కేటాయిస్తున్నారు. జిల్లాలో కూడా ప్రతి పోలీసుస్టేషన్‌కూ ఆర్టీసీ సిబ్బందిని ఇవ్వాలని ఆలోచిస్తున్నారు.

 

మొబైల్‌ కూరగాయల పంపిణీకి ఆర్టీసీ సేవలు 

నగరంలో రైతుబజార్ల దగ్గర రద్దీని నివారించటం కోసం స్థానికంగా మొబైల్‌ కూరగాయల వాహనాలను ఉంచాలని నగరపాలక సంస్థ భావిస్తోంది. ఈ సేవలకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని నగర అధికారులు భావిస్తున్నారు. ఇందుకు దాదాపు 40 బస్సులు అవసరమని అంచనా వేయగా, ఆర్టీసీ సిబ్బంది అందుకు సంసిద్ధంగా ఉన్నారు. 


వైద్యశాఖకు మందుల తరలింపులో..

రీజియన్‌లోని డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (డీజీటీ) బస్సులు కీలక సేవలు అందిస్తున్నాయి. కరోనా మహమ్మారిపై పోరాటం సల్పుతున్న వైద్యశాఖకు మందుల తరలింపులో ఆర్టీసీ సహకారం అందిస్తోంది. రీజియన్‌లోని ఆరు డీజీటీ బస్సులు ఏపీ శాక్స్‌ ద్వారా వచ్చిన మందులను ఆయా హాస్పిటల్స్‌కు తరలించే పనిలో బిజీగా ఉన్నాయి. 


సిబ్బంది భద్రతపై శ్రద్ధ పెట్టాలి

సేవలందించే ఆర్టీసీ ఉద్యోగుల భద్రత పట్ల యాజమాన్యం శ్రద్ధపెట్టాలి. గుంటూరులో పోలీసు స్టేషన్లకు సిబ్బందిని కేటాయించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. మహిళలకు మినహాయింపు నివ్వాలి. సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందించాలి. బీపీ, షుగర్‌ వ్యాధులున్నవారికి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 

- పి.దామోదరరావు, రాష్ట్ర ఈయూ ప్రధాన కార్యదర్శి 

Updated Date - 2020-04-01T17:27:53+05:30 IST