ఆర్టీసీపై కరోనా పంజా

ABN , First Publish Date - 2021-05-19T05:55:11+05:30 IST

నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే ఆర్టీసీ సంస్థలోని ఉద్యోగులపై కరోనా పంజా విసురుతోంది. రీజియన్‌ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 350 మందికిపైగా కరోనా బారిన పడ్డారు.

ఆర్టీసీపై కరోనా పంజా
ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సిన్‌ వేస్తున్న ఆరోగ్య సిబ్బంది

భయం.. భయంగా విధులు

రీజియన్‌లో 350 మందికిపైగా వైరస్‌ 

ఇప్పటికే 14 మంది మృత్యువాత

గుంటూరు, మే 18: నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసే ఆర్టీసీ సంస్థలోని ఉద్యోగులపై కరోనా పంజా విసురుతోంది. రీజియన్‌ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 350 మందికిపైగా కరోనా బారిన పడ్డారు. రీజియన్‌లో 14 మంది మృత్యువాత పడగా పలువురు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగులను కరోనా కలవరం వెంటాడుతోంది. డ్రైవర్‌తోపాటు కండక్టర్లు ఎక్కువగా వైరస్‌ బారిన పడుతున్నారు. మాస్కులు, భౌతిక దూరం కఠినంగా అమలు చేయకపోవటంతో పాటు శానిటైజర్లు  పక్కాగా వినియోగించకపోవటంతో ఉద్యోగులను వైరస్‌  బలితీసుకుంటోంది. కరోనా కర్ఫ్యూ ఉన్నా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా బస్సుల్లో ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చేక్రమంలో వైరస్‌ సోకుతుందని సమాచారం. విధులకు వెళ్ళి వచ్చిన కండక్టర్లు డిపోలకు చేరుకుని క్యాష్‌ కౌంటర్‌లో నగదు జమ చేస్తుంటారు. అదే సమయంలో అధికారులకు కూడా వైరస్‌ సోకుతోంది. ఈ క్రమంలో డిపోలలో పనిచేసే ఇద్దరు సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఓ యూనియన్‌ నాయకుడు కరోనాతో పోరాడి ఇటీవల మృతి చెందారు. పలువురు అధికారులు కూడా వైరస్‌ బారిన పడి కొలుకొని విధులకు హాజరవుతున్నారు.   ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో అత్యవసర సర్వీసుల కింద డిపో కార్యాలయాల్లో ఉద్యోగులు రోజుమార్చి రోజు పని చేసేలా అధికారులు ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేశారు.

ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ : ఇన్‌చార్జి ఆర్‌ఎం

ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ వ్యాక్సినేషన్‌ వేసేందుకుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రీజనల్‌ ఇన్‌చార్జి ఆర్‌ఎం నర్రా శ్రీనివాసరావు తెలిపారు. 13 డిపోలకు సంబంధించిన ఉద్యోగులకు వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. గుంటూరులోని ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో గుంటూరు 1, 2 డిపోలతో పాటు పొన్నూరు, బాపట్ల డిపోల ఉద్యోగులకు 306 మందికి మొదటి డోసు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. రీజియన్‌ వ్యాప్తంగా 1230 మందికి వ్యాక్సిన్‌ వేయించినట్లు తెలిపారు. తెనాలిలో తెనాలి, మంగళగిరి, రేపల్లె డిపోల ఉద్యోగులకు, నరసరావుపేటలో నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట డిపోల ఉద్యోగులకు, వినుకొండలో వినుకొండ ఉద్యోగులకు, పిడుగురాళ్ళలో పిడుగురాళ్ళ, మాచర్ల డిపోల ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-05-19T05:55:11+05:30 IST