ద్విచక్ర వాహనం విషయమై గొడవ.. కోపంతో ఆర్టీసీ డ్రైవర్‌పై..

ABN , First Publish Date - 2020-07-16T15:57:38+05:30 IST

గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ డ్రైవర్‌పై..

ద్విచక్ర వాహనం విషయమై గొడవ.. కోపంతో ఆర్టీసీ డ్రైవర్‌పై..

ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం

పరిస్థితి విషమం.. తిరుపతికి తరలింపు


మదనపల్లె(చిత్తూరు): గుర్తుతెలియని వ్యక్తులు ఆర్టీసీ డ్రైవర్‌పై కత్తులతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి సమీపంలోని బీసీ కాలనీకి చెందిన ఎస్‌.బావాజాన్‌(36) ఆర్టీసీ వన్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం డ్యూటీకి వెళ్లేందుకు స్థానిక బస్టాండుకు వచ్చాడు. అక్కడ బస్సు కోసం వేచివుండగా, గుర్తుతెలియని వ్యక్తులు బావాజాన్‌పై  కత్తులతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. అధిక రక్తస్రావం కావడంతో ఆయన కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.


గమనించిన స్థానికులు బాధితుని తొలుత బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రికి, అక్కడినుంచి మదనపల్లెకు తరలించారు. అక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు. దాడికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు. అయితే బావాజాన్‌ బుధవారం ఉదయం ద్విచక్ర వాహనం విషయమై బీసీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులతో గొడవపడ్డాడని, అక్కడినుంచి డ్యూటీకి వెళ్లేందుకు బస్టాండుకు రాగా ఈ హత్యాయత్నం జరిగిందని స్థానికులు అంటున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు బావాజాన్‌తో గొడవపడిన వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బి.కొత్తకోట పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-07-16T15:57:38+05:30 IST