ఆర్టీసీలో మోనార్క్‌!

ABN , First Publish Date - 2020-05-27T09:47:06+05:30 IST

ఆర్టీసీ ధర్మవరం డిపోలో మోనార్క్‌ రాజ్యం..

ఆర్టీసీలో మోనార్క్‌!

ఆయన చెప్పిందే శాసనం..

సిబ్బంది చేతులు కట్టుకుని నిల్చోవాల్సిందే..


ధర్మవరం(అనంతపురం): ఆర్టీసీ ధర్మవరం డిపోలో మోనార్క్‌ రాజ్యం నడుస్తోంది. డిపో అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బందికి కనీస మర్యాద ఇవ్వకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ డిపోను అభివృద్ధి బాటలో నడిపించాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాను చెప్పినట్లు వినాల్సిందేనన్న రీతిలో ఆ అధికారి శైలి ఉంది. చిరుద్యోగులైతే ఆయన కన్పించాడంటే చేతులు కట్టుకుని వొంగి, వొంగి నమస్కారం చేయాల్సిందేనట. లేదంటే వారిపై ఏదో ఒక రూపంలో క్రమశిక్షణ చర్య తప్పదని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికారులకు సైతం ఆయనంటే హడల్‌.


కుర్చీ ఉండదు.. మర్యాద దక్కదు..

సిబ్బంది విధులకు హాజరైనపుడు, ముగించుకుని వెళ్లేటపుడు ఏదైనా అవసరమైతే డిపో మేనేజరు వద్దకు వెళ్తుంటారు. తన చాంబర్‌లో ఆశీనులయ్యే ఆ అధికారి దర్పాన్ని ప్రదర్శిస్తుంటాడనే ఆరోపణలున్నాయి. తాను కుర్చీలో కూర్చోగానే, చాంబర్‌లో ఎక్కడా కుర్చీ ఉండకుండా తొలగించేస్తారు. అధికారులు, కార్మికులు పని నిమిత్తం ఆయన వద్దకెళ్తే చేతులు కట్టుకుని నిల్చోవాల్సిందే. ఎంతసేపైనా నిలువుకాళ్లు పడాల్సిందే. ఆయన సరే.. అనే వరకు నిష్క్రమించే వీలుకూడా లేదు. ఒకవేళ వెళ్తే ఆయన ఆగ్రహానికి లోనుకావాల్సి ఉంటుందని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


డిపో అభివృద్ధి పట్టని అధికారి..

ఒకప్పుడు ధర్మవరం డిపో అంటే మంచి గుర్తింపు ఉండేది. డిపో అభివృద్ధి కూడా ఆ స్థాయిలోనే ఉండేది. కార్మికులు, అధికారులు సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్లేవారు. కొందరు అధికారుల అహమో.. నిర్లక్ష్యమో కానీ.. డిపో అభివృద్ధిలో వెనుకబడిపోతోంది. ప్రస్తుతమున్న అధికారి తీరు కూడా ఇందుకు కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. సిబ్బంది పట్ల మర్యాద మరవటం, బస్టాండ్‌లో సౌకర్యాలను పూర్తిగా విస్మరించటం తదితర కారణాలతో డిపో అభివృద్ధి కుంటు పడిందనే వాదన ఆ వర్గాల నుంచే వినిపిస్తోంది. సిబ్బందిని సమన్వయ పరచుకుంటూ, సమయానికి బస్సులు నడిపితే డిపో నష్టాల్లో ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


బస్సు అపహరణ సంఘటనలోనూ ఉదాసీనత

కార్మికులు, సిబ్బంది పట్ల ఆ అధికారి అనుసరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆయన వ్యవహారంతో విసిగిపోయిన కొందరు సిబ్బంది పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు వారు అక్షింతలు కూడా వేసినట్లు సమాచారం. ఇటీవల సంచలనం రేకెత్తించిన ఆర్టీసీ బస్సు అపహరణ విషయంలో కూడా ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. బస్సు అపహరణ విషయంలో ఆలస్యంగా సమాచారం ఇవ్వటంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2.14 గంటలకు బస్సును అపహరిస్తే సాయంత్రం 5 గంటలైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసు అధికారులు సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-05-27T09:47:06+05:30 IST