బస్సెక్కితే బాదుడే

ABN , First Publish Date - 2022-07-01T05:55:51+05:30 IST

బస్సు ఎక్కాలంటే పర్సు బరువుగా ఉండాల్సిందే. డీజిల్‌ ధరలు పెరిగాయని ఇటీవల ఆర్టీసీ మినిమం చార్జీని రూ.5 పెంచిన ప్రభుత్వం తాజాగా డీజిల్‌ సెస్‌, బేసిక్‌ చార్జీ పేరిట అన్ని వర్గాల ప్రయాణికులను బాదేసింది.

బస్సెక్కితే బాదుడే

ప్రయాణికులపై చార్జీల మోత

డీజిల్‌ సెస్‌, బేసిక్‌ చార్జీల పేరిట భారం

రూ.5 నుంచి రూ.80 వరకు డీజిల్‌ సెస్‌ వసూలు

కేటగిరీల వారీగా కీమీకి 18 నుంచి 26 పైసల బేసిక్‌ చార్జీ పెంపు

గుంటూరు, జూన్‌ 30: బస్సు ఎక్కాలంటే పర్సు బరువుగా ఉండాల్సిందే. డీజిల్‌ ధరలు పెరిగాయని ఇటీవల ఆర్టీసీ మినిమం చార్జీని రూ.5 పెంచిన ప్రభుత్వం తాజాగా డీజిల్‌ సెస్‌, బేసిక్‌ చార్జీ పేరిట అన్ని వర్గాల ప్రయాణికులను బాదేసింది. ఇప్పటికే పెరిగిన కరెంట్‌ చార్జీలు, చెత్త, ఇంటి పన్నులతో అల్లాడుతున్న ప్రజలపై ఆర్టీసీ చార్జీల భారం మోపింది. డిజిల్‌ సెస్‌తో పాటు  పల్లెవెలుగు నుంచి గరుడా, వెన్నెల సర్వీసులకు కిలో మీటర్‌కు బేసిక్‌ చార్జీని కూడా పెంచుతూ గురువారం ప్రభుత్వం నుంచి ఆర్టీసీ అనుమతి పొందింది. బేసిక్‌ కిలో మీటర్‌ చార్జీతో పాటు డీజిల్‌ సెస్‌ కూడా జోడించారు. దీంతో ప్రయాణికులపై చార్జీల మోత మోగింది. డిజిల్‌ సెస్‌ బస్సుల కేటగిరీల వారీగా  వసూలు చేసేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతి ఇచ్చింది. బేసిక్‌ చార్జీ కిలోమీటర్‌కు 18 పైసల నుంచి 26 పైసల వరకు పెంచుకునేందుకు అంగీకరించింది. ఈ ప్రకారం పెరిగిన చార్జీలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శుక్రవారం(గురువారం అర్ధరాత్రి) నుంచే అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఆర్టీసీ పల్లెవెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస చార్జీ రూ.10గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా విధించిన డీజిల్‌ సెస్‌ నుంచి తొలి 30 కిలో మీటర్ల వరకు మినహాయింపు ఇచ్చారు.  35 కిలో మీటర్ల నుంచి మాత్రం కేటగిరీల వారీగా  డిజిల్‌ సెస్‌ తక్కువలో తక్కువ రూ.5 నుంచి  రూ.80కి పైగా భారం మోపారని సమాచారం. 

బేసిక్‌ చార్జీల బాదుడు

సెస్‌ పేరుతో ప్రయాణికులపై చార్జీలను బాదడంతో వదలిపెట్టకుండా బేసిక్‌ చార్జీలను కూడా పెంచారు. పల్లెవెలుగు సర్వీసులకు బేసిక్‌ చార్జీ కిలో మీటర్‌కు 83 పైసలు ఉండగా తాజాగా దాన్ని 102 పైసలకు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌కు బేసిక్‌ చార్జీ కిలో మీటర్‌కు 107 పైసలు ఉండగా దాన్ని 125 పైసలకు పెంచేశారు.  సూపర్‌లగ్జరీ కిలో మీటర్‌కు 136 పైసలు ఉండగా 162 పైసలకు పెంచారు. ఇంద్రాకు గతంలో 166 పైసలు ఉండగా 196 పైసలకు పెంచారు.  గరుడా బస్సులో 191 నుంచి 221 పైసల వరకు పెంచేశారు. ఈ పెంచిన చార్జీలతో  గుంటూరు నుంచి హైదరాబాద్‌, వైజాగ్‌, చెన్నై, బెంగళూరు, తిరుపతి, శ్రీశైలం వంటి దూర ప్రాంతాలకు ఛార్జీలు మోయలేని భారంగా మారనున్నాయి. 

గుంటూరు నుంచి చార్జీలు ఇలా..

- ప్రస్తుతం గుంటూరు నుంచి విజయవాడకు పల్లెవెలుగు బస్సులో చార్జీ రూ.45 ఉండగా తాజా పెంపుతో రూ.50 చేరుకోనున్నది. ఎక్స్‌ప్రెస్‌లో రూ.55 ఉండగా అది రూ.60 కానున్నది. నాన్‌స్టాప్‌ ఆలా్ట్ర డీలక్స్‌లో ప్రస్తుతం రూ.60 ఉండగా 65 వసూలు చేయనున్నారు.

- గుంటూరు నుంచి శ్రీశైలం రూ.420 ఉండగా పెరిగిన ధరతో సుమారుగా రూ.520 చేరుకోనున్నది. 

- గుంటూరు నుంచి హైదరాబాద్‌కు సూపర్‌లగ్జరీ ప్రస్తుతం రూ.440 ఉండగా పెంపుతో సుమారుగా అది రూ.570 వసూలు చేయనున్నారు. 

- గుంటూరు నుంచి వైజాగ్‌ సూపర్‌లగ్జరీలో ప్రస్తుతం రూ.610 ఉండగా తాజా పెంపుతో రూ.780 వసూలు చేయనున్నారు.


Updated Date - 2022-07-01T05:55:51+05:30 IST