ఆర్టీసీ బస్సుల్లేవ్‌.. ప్రైవేటు వాహనాలే దిక్కు

ABN , First Publish Date - 2022-07-05T05:04:51+05:30 IST

మండలంలోని పలు గ్రామాలకు బీటీ రోడ్లు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు మాత్రం రావడం లేదు. దీంతో ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారాయి. మండల కేంద్రం మీదుగా గతంలో నడిచిన బస్సులు లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈ మార్గంలో సర్వీ్‌సను నిలిపివేశారు.

ఆర్టీసీ బస్సుల్లేవ్‌.. ప్రైవేటు వాహనాలే దిక్కు


నారాయణరావుపేట మండలవాసులకు తప్పని రవాణా తిప్పలు

మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామానికి బస్సు బంద్‌ 

మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసినా స్పందన కరువు


నారాయణరావుపేట, జూలై 4: మండలంలోని పలు గ్రామాలకు  బీటీ రోడ్లు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు మాత్రం రావడం లేదు. దీంతో ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారాయి. మండల కేంద్రం మీదుగా గతంలో నడిచిన బస్సులు లాభాల బాటలో నడుస్తున్నప్పటికీ ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈ మార్గంలో సర్వీ్‌సను నిలిపివేశారు. మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామమైన ఇబ్రహింపుర్‌కు కొన్ని నెలల నుంచి ఆర్టీసీ బస్సు రావడం లేదు. కరోనా నేపథ్యంలో పలు మార్గాల్లో ఆర్టీసీ బస్సుల సేవలు నిలిపివేసి నెలలు గడుస్తున్నా పునరుద్ధరించడం లేదు. 

గతంలో నారాయణరావుపేట మండల కేంద్రం మీదుగా ముస్తాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, వేములవాడకు బస్సు సౌకర్యం ఉండేది. ఆర్టీసీ అధికారుల టార్గెట్‌లు రావడం లేదనే సాకుతో ఈ రెండు మార్గాల్లో బస్సు సౌకర్యాన్ని నిలిపి వేశారు. మండల కేంద్రానికి వివిధ రకాల పనులు, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఆర్టీసీ రవాణా సౌకర్యం కల్పించాలని మండల సర్వసభ్య సమావేశంలో రెండుసార్లు తీర్మానం చేసి ఆర్టీసీ శాఖకు పంపించినప్పటికీ స్పందించకపోవడంతో మండల ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని యువకులు ఆర్టీసీ ఎండి సజ్జానార్‌కు ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేసిన పలితం లేకుండా పోయింది. నారాయణరావుపేట మండల కేంద్రం మీదుగా సిద్దిపేట డిపో నుంచి ముస్తాబాద్‌, కామారెడ్డికి.. దుబ్బాక డిపో నుంచి సిరిసిల్ల, వేములవాడకు ఈ రూట్లలో బస్సు సౌకర్యం కల్పిస్తే సిద్దిపేట రూరల్‌ మండలంలోని, నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల ప్రజలకు రాకపోకలకు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. సిద్దిపేట డిపో నుంచి ముస్తాబాద్‌ కామారెడ్డి మార్గంలో సుమారు 16 బస్సులు నడిపిస్తున్నారు. ఒకటైనా నారాయణరావుపేట మండల కేంద్రం మీదుగా నడిపించపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించగా ప్రయాణికులు వాహనంలో నిండే వరకు కదలకపోవడంతో సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకోకపోవడం లేదు. అధికారులు స్పందించి నారాయణరావుపేట మండల కేంద్రం మీదుగా గతంలో మాదిరిగా బస్సులను పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


బస్సు సౌకర్యం కల్పించాలి

మండలంలోని 10 గ్రామల ప్రజలకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారాయి. నారాయణరావుపేట మండల కేంద్రం మీదుగా బస్సు కోసం సిద్దిపేట, దుబ్బాక డిపోలకు వినతిపత్రాలు అందించాం. వెంటనే పాత రూట్లలో బస్సు సౌకర్యం కల్పించాలి. 

- మహేష్‌, సీపీఎం మండల కార్యదర్శి


Updated Date - 2022-07-05T05:04:51+05:30 IST