బాబోయ్‌.. కర్నూలు బస్సా!

ABN , First Publish Date - 2020-06-03T09:48:19+05:30 IST

కరోనా ఖిల్లాగా మారిన ‘కర్నూలు’ నుంచి వచ్చే..

బాబోయ్‌.. కర్నూలు బస్సా!

భద్రతా చర్యలు లేకుండానే విజయవాడ రాకపోకలు

రాత్రి పీఎన్‌బీఎస్‌లో షెల్టర్!

ఉదయం ప్రయాణానికి సిద్ధం

బెంబేలెత్తుతున్న ప్రయాణికులు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కరోనా ఖిల్లాగా మారిన ‘కర్నూలు’ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కృష్ణాజిల్లాలోని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్నూలు డిపో నుంచి వస్తున్న దూరప్రాంత సర్వీసులు పీఎన్‌బీఎస్‌లో ప్రయాణికులను దించి రాత్రికి ఇక్కడే హాల్ట్‌ అవుతున్నాయి. తిరిగి ఉదయం బయలుదేరే సమయానికి ప్లాట్‌ఫామ్‌లపైకి తెచ్చి పెడుతున్నారు.


ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే బయలుదేరే ముందు బస్సులను శానిటైజ్‌ చేసి లోపల ఫ్యూమిగేషన్‌ చేయాల్సి ఉండగా అలా చేయటం లేదు! కర్నూలు డిపో ఆర్టీసీ అధికారులు ఆ దిశగా జాగ్రత్తలు తీసుకోకపోవటంతో కొంప కొల్లేరయ్యే ప్రమాదం ఉంది. పోనీ కృష్ణా రీజియన్‌ అధికారులయినా రక్షణ చర్యలు చేపడతారా అంటే అదీ లేదు. తమ పరిధిలోని బస్సులను మాత్రమే శానిటైజింగ్‌ చేసి, ఫ్యూమిగేషన్‌ చేపడుతున్నామని, ఇతర డిపోల వాటికి తాము ఎలా బాధ్యత వహిస్తామని వాదనలు వినిపిస్తున్నారు. దీంతో కర్నూలు వెళ్లే బస్సులు ఎలాంటి ఫ్యూమిగేషన్‌ లేకుండానే బయలు దేరుతున్నాయి. 


తొలుత ఆర్టీసీ యాజమాన్యం శానిటైజర్స్‌, ఫ్యూమిగేషన్‌ కెమికల్స్‌ కొనుగోలుకు ఆదేశించటంతో కృష్ణా రీజియన్‌ హడావిడిగా కొనుగోలు చేసింది. తర్వాత బడ్జెట్‌ లేక ఇతర జిల్లాల వారు కొనుగోలు చేయలేకపోయారు. కర్నూలు జిల్లాదీ ఇదే పరిస్థితి. దీంతో ఆ జిల్లా బస్సుఓ్ల ఫ్యూమిగేషన్‌, శానిటైజింగ్‌ జరగటం లేదు. ఈ పరిస్థితి వల్ల కర్నూలు బస్సుల్లో ప్రయాణించే వారే అంతిమంగా సమిధలయ్యే మారే ప్రమాదం ఉంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసులు రాష్ర్టాన్ని అట్టుడికిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కర్నూలు వంటి రెడ్‌ జోన్‌ ప్రాంతం నుంచి వచ్చే బస్సులను అనుమతించే విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి ఉంది. కర్నూలు డిపో అధికారులకు ఎంత బాధ్యత ఉందో, కృష్ణాజిల్లా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కృష్ణా రీజియన్‌ అధికారులకు కూడా అంతే  బాధ్యత ఉంది.


ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారుల కంటే కృష్ణాజిల్లా యంత్రాంగం మీద ఈ బాధ్యత ఎక్కువగా ఉంది. ఇక్కడ కేసులు పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని రవాణా వ్యవస్థలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రైళ్లు, విమానాల్లో వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. బస్సుల్లో తిరిగే వారి విషయంలో ఇలాంటివేమీ లేవు. జిల్లా పరిధిలో తిరిగే బస్సుల విషయంలో పెద్దగా సమస్యలు లేకపోయినా కరోనా తీవ్రత ఉన్న జిల్లాల నుంచి వచ్చే బస్సుల వల్ల రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులతో పాటు కృష్ణాజిల్లా యంత్రాంగం కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-06-03T09:48:19+05:30 IST