పండుగలతో ఆర్టీసీ బస్సులు కిటకిట

ABN , First Publish Date - 2021-01-12T04:46:06+05:30 IST

సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో వారం పది రోజుల నుంచే సందడి ఉంటుంది.

పండుగలతో ఆర్టీసీ బస్సులు కిటకిట
జమ్మలమడుగు పాత బస్టాండులో ఆర్టీసీ బస్సు వద్ద పల్లెలకు వెళ్లడానికి ప్రయాణికుల పాట్లు

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 11: సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో వారం పది రోజుల నుంచే సందడి ఉంటుంది. ముఖ్యంగా కొత్త పంట ఇంటికి రావడంతో పల్లెవాసులు సంతోషాలతో ఈ పండుగను జరుపుకుం టారు. దీంతో పట్టణానికి సరుకుల కొనుగోలు కోసం వస్తున్న  గ్రామీణ ప్రజలతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. నెల రోజుల కిందటి వరకు కరోనాతో స్తబ్దుగా ఉన్న జనం ఇప్పుడిప్పుడే ఇంటి నుంచి బయ టకు వస్తున్నారు. కూలీలు మాత్రం పొట్ట చేతపట్టుకుని కరోనా సమ యంలోనే పనుల కోసం ఆటోలు, ట్రాక్టర్లను పట్టుకుని బయటకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే మధ్య తరగతి ప్రజలు కరోనాతో ఇంటికే పరిమితమై ఇటీవల కరోనా విజృంభన కాస్త తగ్గడంతో బస్సుల్లో ప్రయా ణానికి ముందుకు వస్తున్నారు. ప్రయాణికుల రాకతో నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బస్సుల సంఖ్య పెంచడంతో ఆదాయంలో ఒకింత పర్వాలేదనేలా ప్రగతి సాధిస్తోంది. అయితే జమ్మలమడుగు ఆర్టీసీ డిపో ఇంకా నష్టాల బాటలో పయనిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు.  ఒకప్పుడు జిల్లాలోనే జమ్మలమడుగు ఆర్టీసీ డిపో  రెండవ స్థానంలో ఉండేదని కార్మికుల ద్వారా తెలుస్తోంది. 

నష్టాలు పూడ్చుకునేలా చర్యలు

జమ్మలమడుగు ఆర్టీసీ డిపో ఇంకా నష్టాల్లోనే పయనిస్తోందని ఆదాయా న్ని పెంచుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం 45 ఆర్టీసీ బస్సులతోపాటు 34 అద్దె బస్సులు ఉన్నాయని అందులో  76 బస్సులు మాత్రమే నడుపుతున్నామన్నారు. తాడిపత్రి రోడ్డులో ఇంకొక బస్సు నడపాల్సి ఉందన్నారు. జమ్మలమడుగు ఆర్టీసీ డిపో నుంచి రోజుకు 29 వేల కిలోమీటర్లు బస్సులు నడపాల్సిన లక్ష్యం కాగా ప్రస్తుతం 26 వేల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజుకు రూ.7 లక్షల ఆదాయం మధ్య ఉందన్నారు. నెలకు రూ.2.95 కోట్లు రావాల్సి ఉండగా రూ.2 కోట్లు ఆదాయం వస్తోందన్నారు. జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో మొత్తం కార్మికులు 283 మంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. కరోనా కారణంగా కొన్ని బస్సులు గతంలో తిరగలేదన్నారు. ప్రస్తుతం జనవరి 1వ తేదీ నుంచి అన్ని రూట్లలో బస్సులు తిరుగుతున్నాయని జమ్మలమడుగు ఆర్టీసీ డిపో పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు డిపో మేనేజర్‌ తెలిపారు. 

- రామసుబ్బయ్య, డిపో మేనేజర్‌, జమ్మలమడుగు

Updated Date - 2021-01-12T04:46:06+05:30 IST