మియాపూర్‌ డిపో బస్సులో మంటలు

ABN , First Publish Date - 2021-11-15T04:21:37+05:30 IST

హైదరాబాద్‌ మియాపూర్‌ 1 డిపో నుంచి భద్రాచలం వెళుతున్న గరుడ బస్సు ఖమ్మం జిల్లా వైరాలో మంటల్లో చిక్కుకుంది.

మియాపూర్‌ డిపో బస్సులో మంటలు
వైరా వద్ద బస్సు వెనుకభాగం నుంచి ఎగిసిపడుతున్న మంటలు

భద్రాచలం వెళుతుండగా ఖమ్మం జిల్లా వైరాలో ఘటన

యువకులు అప్రమత్తం చేయడంతో తప్పిన ఘోర ప్రమాదం

డ్రైవర్‌, సహాయకుడి సహా 21మంది ప్రయాణికులు క్షేమం

వైరా, నవంబరు 14: హైదరాబాద్‌ మియాపూర్‌ 1 డిపో నుంచి భద్రాచలం వెళుతున్న గరుడ బస్సు ఖమ్మం జిల్లా వైరాలో మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన సమయంలో 21మంది ప్రయాణికులుండగా ద్విచక్రవాహనదారులు అప్రమత్తం చేయడం, డ్రైవర్‌ కూడా చాకచక్యంగా వ్యవహరించడంతో వారితో పాటు బస్సు డ్రైవర్‌ దస్రూ(డీఎస్‌.నాయక్‌), సహాయకుడు ఈ.నాగరాజు సురక్షితంగా బయటపడ్డారు. మియాపూర్‌ డిపో నుంచి ఉదయం 10.30గంటలకు భద్రాచలం బయల్దేరిన  ఏపీ29జడ్‌2610 నెంబరు గల గరుడ బస్సు 12:30గంటలకు ఎంజీబీఎస్‌కు చేరుకుని.. అక్కడ 18మంది ప్రయాణికులతో బయల్దేరి సాయంత్రానికి ఖమ్మం బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ ఏడుగురు ప్రయాణికులు దిగిపోగా కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం వెళ్లేందుకు మరో 10మంది ఎక్కారు. దాంతో మొత్తం 21మంది ప్రయాణికులతో ఖమ్మం నుంచి బయల్థేరి సాయంత్రం 6.30గంటల సమయంలో వైరాలోని క్రాస్‌ రోడ్డు సమీపంలో మసీదు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకోగా.. ఆ సమయంలో జాతీయ ప్రధాన రహదారిపై బస్సు ఎడమ వైపు వెనుక టైర్ల పైభాగంలో ఉన్న ఏసీ నుంచి పొగలు వచ్చి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో వెనుక ద్విచక్రవాహనంపై వస్తున్న కల్లూరు మండలం మర్లపాడుకు చెందిన రాచబంటి ముత్తారావు, రెడ్డిచర్ల కృష్ణంరాజు గమనించి బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో డ్రైవర్‌ రోడ్డుపైనే బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. వైరా ఎస్‌ఐ శాఖమూరి వీరప్రసాద్‌, పోలీస్‌ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా శకటంతో ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ ఘటనలో బస్సు వెనుక టైర్లు కాలిపోయాయి. ప్రమాద సమయంలో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. ఈ ప్రమాదంతో భయంతో వణికిపోయిన ప్రయాణికులు.. బస్సు సరైన కండీషన్‌లో లేదని, ప్రయాణ సమయంలో శబ్ధాలు వస్తున్నాయని పేర్కొన్నారు. 

బస్సు కండీషన్‌లో లేదు

డ్రైవర్‌ డీఎస్‌.నాయక్‌ ఆవేదన

మంటలు ఎగిసిపడిన బస్సు సరైన కండీషన్‌లో లేదని డ్రైవర్‌ డీఎస్‌.నాయక్‌ ప్రమాదం అనంతరం తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పాత బస్సు అని ఈ రూట్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా సర్వీస్‌గా ఇచ్చారని పేర్కొన్నారు. బ్రేకులు కూడా సరిగా పడటం లేదని, కండీషన్‌ సరిగా లేదని, బస్సు నుంచి రకరకాల శబ్ధాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


Updated Date - 2021-11-15T04:21:37+05:30 IST