చెడ్డీలు కాల్చేయమన్న Siddu.. చెడ్డీలు పంపిన RSS

ABN , First Publish Date - 2022-06-07T02:58:52+05:30 IST

ఇంతకీ విషయం ఏంటంటే.. కర్ణాటక పాఠ్య పుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ నాయకుడికి సంబంధించిన పాఠాలు చేర్చారు. విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు, అనేక సంఘాలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి..

చెడ్డీలు కాల్చేయమన్న Siddu.. చెడ్డీలు పంపిన RSS

బెంగళూరు: రాజకీయ మధ్య వివాదాలు ఒక్కోసారి చిత్రమైన మలుపులు తీసుకుంటాయి. ఎటు నుంచి ఎటో పోతూ జనాల ముందు నవ్వుల పాలు అవుతుంటారు. ఇలాంటి వాటిని కూడా తమ ప్రచారానికి కొందరు ఉపయోగించుకుంటారు. అది వేరే విషయం. తాజాగా ఇలాంటి కాంట్రవర్సే ఒకటి కర్ణాటకలో లేవనెత్తింది. ఆర్ఎస్ఎస్ చెడ్డీలు కాల్చేస్తామంటూ కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య వ్యాఖ్యనించగా.. ఆయనకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెడ్డీలు పోగుచేసి పంపారు.


ఇంతకీ విషయం ఏంటంటే.. కర్ణాటక పాఠ్య పుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ నాయకుడికి సంబంధించిన పాఠాలు చేర్చారు. విద్యను కాషాయీకరణ చేస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు, అనేక సంఘాలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం క్రితం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా నిరసన చేపట్టింది. కర్ణాటక విద్యా మంత్రి బీసీ నగేష్ ఇంటి ముందు కొనసాగిన ఈ నిరసనలో ఖాకీ చెడ్డీలను కాల్చారు.


ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ చెడ్డి ఇప్పటికే ఊడిపోయింది. వాళ్ల చెడ్డీలను ప్రజలు చింపేశారు. చాముండేశ్వరిలో సిద్ధరామయ్య చెడ్డీతో పాటు లుంగీ కూడా ఊడిపోయింది. కానీ వీళ్లు ఇప్పుడు చెడ్డీలు కాలుస్తున్నారు. వాళ్ల ఓటమిని కవర్ చేసుకునేందుకు ఈ ప్రయత్నాలు’’ అని అన్నారు. ‘‘చెడ్డీలు కాలిస్తే పర్యావరణం కాలుష్యం అవుతుంది. కానీ సిద్ధరామయ్య వినేలా లేరు’’ అంటూ బీజేపీ నేత చలవాడి నారాయణ స్వామి అన్నారు. కాగా, సిద్ధూ వ్యాఖ్యలను నిరసిస్తూ మధ్యప్రదేశ్‭కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెడ్డీలు పోగుచేసి కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయానికి పంపారు.


కాగా, చెడ్డీలను కాల్చడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ విషయమై ఆదివారం సిద్ధరామయ్య స్పందిస్తూ ‘‘అవును.. ఎన్ఎస్‭యూఐ సభ్యులు పోలీసుల ఎదుటే చెడ్డీలు కాల్చారు. అయితే ఏంటి ఇప్పుడు? అవసరమైతే మళ్లీ కాలుస్తాం. ఎక్కడైనా కాలుస్తాం, ఎప్పుడైనా కాలుస్తాం. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అన్ని నిరసనల్లో కాలుస్తాం’’ అని అన్నారు. సిద్ధూ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు దాడికి దిగారు. కాంగ్రెస్ చెడ్డీ ఊడిపోయిందని, తమ చెడ్డీ కాపాడుకోలేనివారు ఇతరుల చెడ్డీలు కాలుస్తామంటూ హెచ్చరిస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Updated Date - 2022-06-07T02:58:52+05:30 IST