Pakistan Occupied Jammu and Kashmir: కేంద్రం మరింత దూకుడుగా వ్యవహరించనుందా?

ABN , First Publish Date - 2022-07-25T21:54:17+05:30 IST

జమ్మూ: పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు సంపూర్ణ న్యాయం జరగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటోంది. తమ స్వాతంత్ర్యం కోసం పీఓకే ప్రజలు భారత్‌ వైపు చూస్తున్నారని

Pakistan Occupied Jammu and Kashmir: కేంద్రం మరింత దూకుడుగా వ్యవహరించనుందా?

జమ్మూ: పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు సంపూర్ణ న్యాయం జరగాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటోంది. తమ స్వాతంత్ర్యం కోసం పీఓకే ప్రజలు భారత్‌ వైపు చూస్తున్నారని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబెలే అన్నారు. జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాక్ అకృత్యాలకు పీఓకే ప్రజలు బలయ్యారని ఆయన వాపోయారు. 1947 నుంచి పాక్ అరాచకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పాక్ దుష్కృత్యాల వల్ల కశ్మీర్ ప్రజలు అనేక ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చిందన్నారు. పాక్ కుట్రలను భారత సైన్యంతో పాటు జమ్మూకశ్మీర్ ప్రజలు గట్టిగా తిప్పికొట్టారని హొసబెలే గుర్తు చేశారు. 1947లో జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయాలని నాటి కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ నిర్ణయించడం గొప్ప విషయమంటూ ఆయన కీర్తించారు. పాక్ దుర్మార్గాలకు నిజమైన బాధితులు పీఓకే ప్రజలేనని, వారికి న్యాయం జరగాల్సిందేనన్నారు.  




మరోవైపు గతంలో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ పాకిస్థాన్ ఓడిపోయిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. మళ్లీ యుద్ధమంటూ జరిగితే పీఓకే భారత్‌లో కలిసిపోవడం ఖాయమన్నారు. కుట్రలు పన్నే దేశాల భరతం పట్టే శక్తి సామర్థ్యాలు  భారత్‌కు వచ్చేశాయన్నారు. పీఓకే ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమని రాజ్‌నాధ్ చెప్పారు.






రాజ్‌నాథ్‌తో పాటు హొసబెలే కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడటం ప్రకంపనలు రేపుతోంది. పాకిస్థాన్‌ నుంచి ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ అనడం ఏదో జరగబోతోందనే సంకేతాలిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో కేంద్రం మరింత దూకుడుగా వ్యవహరించబోతోందనడానికి వీరి తాజా వ్యాఖ్యలు నిదర్శనమంటున్నారు. 

Updated Date - 2022-07-25T21:54:17+05:30 IST