ప్రభుత్వాలపై ఆరెస్సెస్ చీఫ్ మండిపాటు

ABN , First Publish Date - 2021-05-16T01:24:17+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి మొదటి ప్రభంజనం తర్వాత

ప్రభుత్వాలపై ఆరెస్సెస్ చీఫ్ మండిపాటు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి మొదటి ప్రభంజనం తర్వాత అందరూ అజాగ్రత్తగా వ్యవహరించారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రభుత్వాలు, పాలనా యంత్రాంగం, ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరించడం వల్లే రెండో ప్రభంజనం వచ్చిందన్నారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ప్రజలకు సకారాత్మక దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఆరెస్సెస్ ‘‘పాజిటివిటీ అన్‌లిమిటెడ్’’ పేరుతో ప్రముఖుల ఉపన్యాసాలను అందజేస్తోంది. దీనిలో భాగంగా మోహన్ భగవత్ శనివారం మాట్లాడారు. 


కోవిడ్-19 మహమ్మారి మొదటి ప్రభంజనం తర్వాత దాని పట్ల మనమంతా అశ్రద్ధగా ఉన్నామన్నారు.  రెండో ప్రభంజనం వస్తుందని ప్రజలు, ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగాలకు తెలుసునన్నారు. వైద్యులు మనల్ని ముందుగానే హెచ్చరించారని గుర్తు చేశారు. హెచ్చరికలు వచ్చినప్పటికీ మనం అజాగ్రత్తగా, అశ్రద్ధగా వ్యవహరించామని తెలిపారు. మూడో ప్రభంజనం వస్తుందని ఇప్పుడు వైద్యులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. దీనికి మనం భయపడాలా? అని అడిగారు. కరోనా వైరస్‌పై పోరాటానికి సరైన దృక్పథాన్ని పెంచుకుందామా? అని ప్రశ్నించారు. 


బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి విన్‌స్టన్ చర్చిల్ టేబుల్‌పై ఉండే కొటేషన్‌ను భగవత్ ప్రస్తావించారు. ‘‘ఈ కార్యాలయంలో నైరాశ్యం లేదు. పరాజయం సంభవించే అవకాశంపై మాకు ఆసక్తి లేదు. అవి లేనే లేవు’’ అనే కొటేషన్ చర్చిల్ టేబుల్‌పై ఉండేదన్నారు. భారతీయులు కూడా ఈ మహమ్మారిపై సంపూర్ణ విజయం సాధించాలన్నారు. 


Updated Date - 2021-05-16T01:24:17+05:30 IST