రూ.637 కోట్ల వడ్డన?

ABN , First Publish Date - 2022-08-12T07:55:59+05:30 IST

రూ.637 కోట్ల వడ్డన?

రూ.637 కోట్ల వడ్డన?

నష్టాలను ట్రూఅప్‌ చార్జీలతో పూడ్చుకుంటాం

గత జనవరి నుంచి మార్చిదాకా అనుమతివ్వండి.. లెక్కలు వేయడంలో ఆలస్యం జరిగింది

60 రోజుల గడువూ దాటిపోయింది.. అయినా అవకాశమివ్వండి.. ఈఆర్‌సీకి డిస్కమ్‌ల ప్రతిపాదనలు


అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు వినియోగదారులపై మరో పెద్ద బాదుడుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 2014-15  నుంచి 2020-21 కాలంలో విద్యుత్తు కొనుగోళ్లకూ .. వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న బిల్లులకూ మధ్య వ్యత్యాసం రూ.29,010 కోట్లను ఈ ఏడాది ఏప్రిల్‌ బిల్లుల నుంచే విద్యుత్తు పంపిణీ సంస్థలు వసూలు చేస్తున్నాయి. ట్రూఅప్‌ చార్జీల కింద విద్యుత్తు బిల్లులలో ఈ మొత్తాలను చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెల దాకా మూడు నెలల కాలానికి కొనుగోలు చేసిన విద్యుత్తుకూ .. వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న మొత్తాలకూ మధ్య  రూ.637 కోట్ల మేర తేడా కారణంగా తీవ్ర నష్టం ఏర్పడుతోందని డిస్కమ్‌లు పేర్కొన్నాయి. తమకు వస్తోన్న నష్టాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ దక్షిణ ప్రాంత, తూర్పు ప్రాంత, కేంద్ర ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలు తాజాగా విద్యుత్తు నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపాయి. ఈ ప్రతిపాదనలపై గురువారం  ప్రజాభిప్రాయాన్ని ఏపీఈఆర్‌సీ కోరుతూ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి దాకా 6726.79 మిలియన్‌ యూనిట్లను రూ.5.22 చొప్పున కొనుగోలు చేశామని ఈఆర్‌సీకి ఏపీఎస్పీడీసీఎల్‌ వెల్లడించింది. వినియోగదారులకు 7392.57 మిలియన్‌ యూనిట్లను రూ.4.26 పైసల చొప్పున విక్రయించామని .. దీనివల్ల రూ.363 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఈఆర్‌సీకి వివరించింది. అదేవిధంగా విజయవాడ కేంద్రంగా ఉన్న ఏపీసీపీడీసీఎల్‌ .. జనవరి నుంచి మార్చిదాకా 2057.38 మిలియన్‌ యూనిట్లను రూ.5.35 చొప్పన రూ.3842.03 కోట్లకు కొనుగోలు చేశామని ఈఆర్‌సీకి వివరించింది. వినియోగదారులకు రూ.4.96 చొప్పున 4015.26 మిలియన్‌ యూనిట్లు విక్రయించడం ద్వారా 1992.39 కోట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించింది. ఈ విక్రయాల వల్ల తమకు రూ167 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంది. విశాఖ కేంద్రంగా కలిగిన ఈపీడీసీఎల్‌ కూడా రూ.5.2945 చొప్పున6541.76 మిలియన్‌ యూనిట్లును కొనుగోలు చేశామని.. 631.44 మిలియన్‌ యూనిట్లను రూ.4.56 చొప్పన విక్రయించామని పేర్కొంది. దీనివల్ల తమ సంస్థకు రూ.107 కోట్లు మేర నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఇప్పటికే 29,010 కోట్ల రూపాయల మేర ట్రూఅప్‌ చార్జీలను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి డిస్కమ్‌లు వసూలుచేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రూ.637 కోట్ల మేర విద్యుత్తు భారాన్ని వేసేందు కు సిద్ధం కావడం వినియోగదారులను మింగుడు పడనీయడంలేదు. రాష్ట్రంలో 24 గంటలూ కోతలు లేకుండా విద్యుత్తును అందిస్తున్నామని చెప్పుకోడానికి బహిరంగ మార్కెట్లో అధిక ధరలు చెల్లించి కరెంటు కొన్నారు. యూనిట్‌ను రూ.20 వరకూ కొనుగోలు చేశారు. అయితే.. ఏరోజుకారోజు ఎంతెంతకు కొనుగోలు చేశారన్న లెక్కలు చూపకుండా సగటు కొనుగోళ్లను మాత్రం చూపుతూ విద్యుత్తు సంస్థలు గిమ్మిక్కులు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2022-08-12T07:55:59+05:30 IST