కర్జూరాల ప్యాకెట్లో పురుగులు.. పుచ్చిపోయిన కందిపప్పు

ABN , First Publish Date - 2022-09-24T16:12:18+05:30 IST

కుషాయిగూడ డీమార్ట్‌లో నాణ్యత లేని సరుకులు విక్రయిస్తున్నారని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు రూ.30 వేల జరిమానా విధించారు.

కర్జూరాల ప్యాకెట్లో పురుగులు.. పుచ్చిపోయిన కందిపప్పు

 డీ-మార్ట్‌కు రూ.30 వేల జరిమానా 

వినియోగదారుడి ఫిర్యాదుతో స్పందించిన అధికారులు 


హైదరాబాద్/కుషాయిగూడ: కుషాయిగూడ డీమార్ట్‌లో నాణ్యత లేని సరుకులు విక్రయిస్తున్నారని ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు రూ.30 వేల జరిమానా విధించారు. వివరాలిలా ఉన్నాయి.. వాసవీశివనగర్‌లో నివసించే శేఖర్‌ కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం డీమార్ట్‌కు వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసిన తర్వాత బయటకు వచ్చి కర్జూరాల ప్యాకెట్‌ను విప్పి చూడగా పురుగులు కనిపించాయి. ఆందోళనకు గురై మళ్లీ డీమార్ట్‌లోకి వెళ్లి మిగతా సీల్డ్‌ ప్యాకెట్లను పరిశీలించారు. డబ్బాలపై ఈనెల 2న తయారీ తేదీ వేసి ఉండగా, పురుగులు పట్టడం ఏమిటని సిబ్బందిని నిలదీశారు. వారు దురుసుగా సమాధానం చెప్పడంతో కాలనీ సంక్షేమ సంఘాల నాయకులను పిలిపించి స్టోర్‌లో బైఠాయించారు. స్టోర్‌ ఇన్‌చార్జి శేఖర్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నించినా వినలేదు. శేఖర్‌ సమాచారంతో కాప్రా సర్కిల్‌ ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ స్వప్న అక్కడకు చేరుకొని సరుకులను పరిశీలించారు. కందిపప్పు పుచ్చిపోయినట్టు గమనించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.30 వేల జరిమానా విధించి సరుకులను సీజ్‌ చేశారు. గత ఆరు నెలల కాలంలో డీమార్ట్‌పై రెండుసార్లు అధికారులు జరిమానా విధించారు.సంఘటన జరిగిన సమయంలో కాకుండా, ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు విక్రయించే హోటళ్లు, బార్లు, కిరాణా దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ను తరచూ తనిఖీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని పలువురు విమర్శిస్తుండడం కొసమెరుపు.

Updated Date - 2022-09-24T16:12:18+05:30 IST