రూ.26.99 కోట్లు.. ఎస్సీ కార్పొరేషన్‌ ప్రణాళిక సిద్ధం

ABN , First Publish Date - 2021-06-17T05:01:51+05:30 IST

రూ.26.99 కోట్లు.. ఎస్సీ కార్పొరేషన్‌ ప్రణాళిక సిద్ధం

రూ.26.99 కోట్లు.. ఎస్సీ కార్పొరేషన్‌ ప్రణాళిక సిద్ధం

  •  రూ.1204.44 లక్షల సబ్సిడీ మంజూరు
  •  రుణాల కోసం 3,889 మంది దరఖాస్తు 
  •  నైపుణ్య శిక్షణా పథకాలకు 2002 మంది
  •  నైపుణ్యేతర పథకాలకు 1,887 మంది
  •  19 నుంచి 30 వరకు నైపుణ్య శిక్షణ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి)

జిల్లాలో షెడ్యూల్డ్‌ కులాలకు చెందినకుటుంబాలకు ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసేందుకు రూ.26.99 కోట్ల  అంచనాతో ప్రణాళికను రూపొందించారు.  షెడ్యూల్‌ కులాల అభివృద్ధి ప్రణాళికలో  భాగంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 619 ఎస్సీ కుటుంబాలకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు వర్తింపజేయాలని నిర్ణయించారు. స్వయం    ఉపాధి, ఆర్థిక సహాయ పథకాల ద్వారా జిల్లాలో ప్రతిపాదించిన 300 యూనిట్ల వృత్తి నైపుణ్య శిక్షణా పథకాలు, నైపుణ్యేతర పథకాలకు సబ్సిడీ కింద రూ.1204.44 లక్షలు మంజూరయ్యాయి. వృత్తి నైపుణ్య శిక్షణ పథకాల ద్వారా  లబ్ధిపొందడానికి జిల్లాలో 3,889 మంది షెడ్యూల్డ్‌ కులాల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.  జిల్లాస్థాయి కమిటీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అర్హతలు, నైపుణ్యతల ఆధారంగా  అర్హులను ఎంపిక చేయనుంది. నైపుణ్యంతో సంబంధం లేని ఇతర పథకాల ద్వారా లబ్ధ్ది పొందడానికి 1887 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు మండల, మునిసిపల్‌ స్థాయి కమిటీల ఆధ్వర్యంలో సంబంఽధిత మండల , మునిసిపల్‌ కార్యాలయాల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. ఇదిలా ఉంటే, జిల్లా స్థాయి కమిటీ ద్వారా వృత్తి నైపుణ్య పథకాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనుంది.  వికారాబాద్‌ పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌  అంబేద్కర్‌ భవన్‌లో కొనసాగనున్న ఈ ప్రక్రియలో నైపుణ్యాల ఆధారంగా ఎస్సీ  సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్‌ ద్వారా  రుణాలు మంజూరు చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. 

దరఖాస్తు చేసుకున్న 3,889 మంది అభ్యర్థులు

ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం జిల్లాలో మొత్తం 3,889 మంది అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,002  మంది వృత్తి నైపుణ్య శిక్షణ పథకాల కింద ప్రయోజనం పొందడానికి దరఖాస్తు చేసుకోగా, 1887 మంది నైపుణ్యేతర పథకాల కింద రుణాలు పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. తాండూరు రూరల్‌లో 205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, తాండూరు అర్బన్‌లో 33, యాలాల్‌లో 164, పరిగి రూరల్‌లో 275, పరిగి అర్బన్‌లో 52, కోట్‌పల్లిలో 105, దౌల్తాబాద్‌లో 120, కొడంగల్‌ అర్బన్‌లో 77, కొడంగల్‌ రూరల్‌లో 190, దోమలో 229, కులకచర్లలో 185,  బషీరాబాద్‌లో 137, మోమిన్‌పేట్‌లో 241,  బంట్వారంలో 190, ధారూరులో 186, నవాబ్‌పేట్‌లో 205, పెద్దేముల్‌లో 195, వికారాబాద్‌ అర్బన్‌లో 139, వికారాబాద్‌ రూరల్‌లో 232, మర్పల్లిలో 316, పూడూరులో 282, బొంరాస్‌పేట్‌ మండలం పరిధిలో 131  మంది దరఖాస్తు చేసుకున్నారు. 


ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలి:బాబూ మోజెస్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఎస్సీ కార్పొరేషన్‌, వికారాబాద్‌ జిల్లా

 ఎస్సీ కార్పొరేషన్‌ నైపుణ్య శిక్షణ పథకాల కింద రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకున్న అభ్యర్థులు వికారాబాద్‌లోని  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భవన్‌లో  సూచించిన తేదీ, సమయం రోజు తమ  ఒరిజినల్‌ సర్టిఫికేట్లు, జిరాక్స్‌ ప్రతులతో హాజరు కావాలి. విద్యార్హతలు, శిక్షణ  పొందిన సర్టిఫికేట్లు, పని అనుభవ ధ్రువపత్రాలు తీసుకు రావాలి. పైన పేర్కొన్న సర్టిఫికెట్లు తీసుకురాకపోయినా, సూచించిన సమయానికి హాజరు కాకపోయినా రుణం మంజూరుకు అర్హులు కారు. 

Updated Date - 2021-06-17T05:01:51+05:30 IST