రూ.200 కోట్ల విలువైన స్థలాలు కబ్జా

ABN , First Publish Date - 2021-01-19T06:37:48+05:30 IST

హుజూర్‌నగర్‌ పట్టణంలో రూ.200 కోట్ల విలువైన 14 వేల గజాల లేఔట్‌ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని టీఆర్‌ఎస్‌కు చెందిన 23వ వార్డు కౌన్సిలర్‌ జక్కుల వీరయ్య, మూడో వార్డు కౌన్సిలర్‌ కోతి సంపత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం హుజూర్‌నగర్‌లో మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రూ.200 కోట్ల విలువైన స్థలాలు కబ్జా
మునిసిపల్‌ సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ జక్కుల వీరయ్య, చిత్రంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హుజూర్‌నగర్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో టీఆర్‌ఎస్‌  కౌన్సిలర్ల ఆరోపణ  

హుజూర్‌నగర్‌ , జనవరి 18: హుజూర్‌నగర్‌ పట్టణంలో రూ.200 కోట్ల విలువైన 14 వేల గజాల లేఔట్‌ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని టీఆర్‌ఎస్‌కు చెందిన 23వ వార్డు కౌన్సిలర్‌ జక్కుల వీరయ్య, మూడో  వార్డు కౌన్సిలర్‌ కోతి సంపత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం హుజూర్‌నగర్‌లో మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లపై అదే పార్టీకి చెందిన  కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునిసిపల్‌ చైర్మన్‌ గెల్లి అర్చనరవి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ హుజూర్‌నగర్‌ పట్టణంలో సుమారు వేయి గజాలు ఆక్రమించారని కౌన్సిలర్లు వీరయ్య, సంపత్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలో సాయిబాబా థియేటర్‌ పక్కన సుమారు 5,500 గజాల స్థలంలో సమీకృత వ్యవసాయ మార్కెట్‌ నిర్మాణానికి మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేయగా,  ఆ స్థలాన్ని సూర్యాపేటకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ యజమాని తన  కుటుంబసభ్యుల పేరిట రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నాడని ఆరోపించారు. అగ్రిమెంట్‌ చేయించుకున్న లేఔట్‌ స్థలాలను స్వాధీనం చేసుకోకుండా, ఆ స్థలాలపై అధికారులు కోర్టుకు వెళ్లకుండా  ప్రైవేట్‌ వ్యక్తులతో లాలూచీపడ్డారని తెలిపారు. ఆర్డీవో  కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌  రాగా మున్సిపల్‌ అధికారులు రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు తయారు చేశారని, మునిసిపల్‌ కార్యాలయంలో నాలుగు లక్షల మొక్కలు నాటినట్లు బిల్లులు తయారు చేసి నిధులు స్వాహా చేసేందుకు అధికారులు యత్నించారని కౌన్సిలర్లు వీరయ్య, సంపత్‌రెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో పాల్గొన్న  కౌన్సిలర్లు జక్కుల శంభయ్య, మహ్మద్‌ అస్మాన్‌,  శ్రావణ్‌, మంజుల, ఉపేంద్ర, రామ్‌గోపి మాట్లాడుతూ తమకు చెప్పకుండా తమ వార్డుల పరిధిలోని  పనులు ఎజెండాలో పెట్టి తీర్మానాలు చేయాలని చెబుతున్నారని అభ్యంతరం తెలిపారు. బోర్ల మరమ్మతు,  పైప్‌లైన్లు వంటి పనులు కూడా అధికారులు చేయడంలేదని, గత సమావేశంలో హామీ ఇచ్చిన ఏ ఒక్క పనీ పూర్తిచేయలేదని విమర్శించారు.  

 మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను రాజకీయాల్లోకి రాకముందే గ్రామపంచాయతీకి కావాల్సిన రోడ్డు స్థలాన్ని తమ కుటుంబసభ్యులు గ్రామ పంచాయతీకి ఇచ్చారని, తీర్మానం చేసి గ్రామ పంచాయతీ స్థలాన్ని తమ కుటుంబసభ్యులకు ఇచ్చారన్నారు. 

అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దాం: ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి పని చేద్దామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మునిసిపల్‌ పరిధిలోని మోడల్‌ కాలనీ వద్ద డంపింగ్‌ యార్డు ఏర్పాటుచేయడం సరికాదన్నారు.  మోడల్‌ కాలనీని పూర్తిచేసేందుకు మంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారని, పాలకవర్గం కూడా  కౌన్సిల్‌ సమావేశాలకు మీడియాను తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతించాల న్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాలనే ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా కౌన్సిల్‌ సమావేశాలకు మీడియాను నిరాకరించడం శోచనీయమన్నారు. సమావేశంలో వైస్‌ఛైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, కమిషనర్‌ గోపయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

గులాబీ కౌన్సిలర్లు సంపత్‌, వీరయ్య సస్పెన్షన్‌

 హుజూర్‌నగర్‌ మూడో వార్డు కౌన్సిలర్‌ సంపత్‌రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్‌ జక్కుల వీరయ్యయాదవ్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు  పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి, కార్యదర్శి బెల్లంకొండ అమర్‌ తెలిపారు. సోమవార పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించినందుకు  వారిని హైకమాండ్‌ ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2021-01-19T06:37:48+05:30 IST