ఉపపోరులో ఓటుకు రూ.1500

ABN , First Publish Date - 2021-04-16T09:23:46+05:30 IST

నాగార్జున సాగర్‌లో ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాల అంకానికి తెర లేచింది. ఎన్నికల పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్టగా ముద్ర వేసుకున్న ప్రధాన పార్టీ ఓటుకు రూ.1500, ఇంటికి క్వార్టర్‌ బాటిల్‌ చొప్పున పంపిణీ

ఉపపోరులో ఓటుకు రూ.1500

పంపిణీ పూర్తి చేసిన ప్రధాన పార్టీ.. స్థానిక నేతలకు భారీగా ప్యాకేజీలు

మరో రెండు పార్టీలు వెయ్యి చొప్పున


నల్లగొండ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాగార్జున సాగర్‌లో ప్రచార పర్వం ముగియడంతో ప్రలోభాల అంకానికి తెర లేచింది. ఎన్నికల పోల్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్టగా ముద్ర వేసుకున్న ప్రధాన పార్టీ ఓటుకు రూ.1500, ఇంటికి క్వార్టర్‌ బాటిల్‌ చొప్పున పంపిణీ చేసింది. గురువారం ఉదయం 5 గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నానికల్లా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బయటి జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం ప్రచారం ముగించుకుని సొంత జిల్లాలకు వెళ్లాల్సి ఉండటంతో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి వెళ్లినట్టు సమాచారం. 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని ముందుగానే నియమించిన విషయం తెలిసిందే. దాంతో, పోలింగ్‌ బూత్‌ పరిధిలో తమ పార్టీ వారు ఎంతమంది? తటస్థులు ఎంత మంది? అనేది ముందుగానే గుర్తించి వారికే పంపిణీ చేశారు. ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక తరహాలోనే ఓటరుకు నేరుగా నగదు చేరే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. బయటి వ్యక్తులు డబ్బు పంచితే తమ పరువు ఏం కాను అంటూ స్థానిక నేతలు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలింగ్‌ నాడు ఓటరును బూత్‌ వరకు తీసుకెళ్లడం, ఈ రెండు రోజులు ఓటర్లను కాపుకాయడం వంటి బాధ్యతలు ఎవరు చూస్తారని స్థానిక నేతలు బెదిరింపులకు దిగడంతో నియోజకవర్గం అంతటా తమ పార్టీ నేతలకు ఓ ప్యాకేజీని అమలు చేసినట్టు తెలిసింది. 


జడ్పీటీసీ స్థాయి వ్యక్తికి రూ.10 లక్షలు, సర్పంచికి రూ.2 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.20 వేలు ఇలా ముందే ముట్టజెప్పి ఎక్కడా విభేదాలకు తావు లేకుండా చూశారు. మొత్తం 2.20 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 80 శాతం మందికి ప్రధాన పార్టీ ఓటుకు రూ.1500 చొప్పున పంపిణీ చేసింది. ఉదయమే ప్రధాన పార్టీ సొమ్ము ఓటర్లకు చేరిందన్న సమాచారం రావడంతో సాయంత్రానికి మరో రెండు ప్రధాన పార్టీలు గురువారం సాయంత్రం నుంచి పంపిణీని మొదలుపెట్టాయి. ఓటుకు రూ.1000, ఇంటికి క్వార్టర్‌ బాటిల్‌ చొప్పున పంచడం మొదలు పెట్టాయి. డిపాజిట్‌ దక్కించుకోవాలనుకుంటున్న ఒక పార్టీ తమకు ఓట్లు ఏ ప్రాంతం, ఏ వర్గం నుంచి పడే అవకాశాలున్నాయో గుర్తించి అంతమేరకే పంపిణీకి సిద్ధమైంది. ప్రచారంలో కొంత వెనకబాటు, అధికారం, మంద బలం లేకపోవడంతో ఓటుకు రూ.2 వేలు పంచితేనే గెలుస్తామని మండల స్థాయిలో పని చేసిన ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు మరో పార్టీ అభ్యర్థి దృష్టికి తీసుకెళ్లారు. తుదకు ఓటుకు రూ.1000 చొప్పున పంపిణీకి సిద్ధమయ్యారు. 60 శాతం మంది ఓటర్లకు పంచాలని ఈ పార్టీ పెద్దలు నిర్ణయించి పంపిణీ కార్యక్రమాన్ని అంతటినీ స్థానిక నేతలకే అప్పగించారు. అయితే, డబ్బు పంపిణీ క్రమంలో పార్టీలేవీ ఎక్కడా ఘర్షణ పడడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయకపోవడం గమనార్హం.

Updated Date - 2021-04-16T09:23:46+05:30 IST